మధిర రైతు ఆశీర్వాద సభ రద్దు.. రైతు భరోసా నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..
Madira Rythu Bharosa Meeting Cancelled, Fund Release to Continue
భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకం కలగదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడం ,సభా ప్రాంగణంలో మోకాల లోతు నీరు చేరడంతో రైతులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మధిర బహిరంగ సభను తక్షణమే రద్దు చేసింది. అయితే నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నిధులను విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సభా వేదికను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మార్చారు.
ఈ మార్పు ప్రకారం జూన్ 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు ఆశీర్వాద సభ ఇండోర్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డీబీటీ (Direct Benefit Transfer) పద్ధతిలో రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు వివిధ జిల్లాలలోని ‘రైతు వేదికల’ నుండి వర్చువల్ విధానంలో ప్రత్యక్షంగా పాల్గొనేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సభా వేదిక మారినప్పటికీ నిధుల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం ఉండబోదని, ముందుగా అనుకున్న టైమ్ టేబుల్ ప్రకారమే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వాతావరణ ,వ్యవసాయ శాఖల అధికారులు స్పష్టం చేశారు. వానాకాలం పంట సీజన్ ప్రారంభంలో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నిధుల విడుదల ఎంతో ఊరటనివ్వనుంది. అంతేకాకుండా, ఈసారి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన (జూన్ 15 నాటికి) అర్హులైన కొత్త రైతులు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు వీలుగా జూలై 5వ తేదీ వరకు స్థానిక వ్యవసాయ అధికారులకు (AEO/MAO) దరఖాస్తులు సమర్పించుకునేందుకు ప్రభుత్వం అదనపు అవకాశం కల్పించింది.