మన బడుల్లో పౌష్టికాహార విప్లవం ఎప్పుడు?
Telangana to Roll Out Breakfast and Mid-Day Meal Schemes on June 15
తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం భవనాలు, పరిశ్రమల నిర్మాణంతోనే కాదు, రేపటి సమాజాన్ని నడిపించే పౌరు ల ఆరోగ్య పునాదుల పైన కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఒకటి నుంచి పదిహేనేళ్ల వయసున్న బాలబాలికల దశ భౌతిక, మానసిక ఎదుగుదలకు అత్యంత కీలకమైనది. ఈ వయసులో సరైన పోషకాహారం అందకపోవడం వల్ల రక్తహీనత, శారీరక ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు జీవితకాలం వెంటాడుతాయి. కేవలం పిల్లల ఆకలి తీర్చడం వేరు, వారికి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించడం వేరు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కేవలం కడుపు నింపే కార్యక్రమంగా కాకుండా, వ్యాధి నిరోధక శక్తిని, మేధో వికాసాన్ని పెంచే ఒక అద్భుతమైన ఆరోగ్య ఉద్యమంగా మలచుకోవాల్సిన అవస రం ప్రభుత్వాల పైన ఎంతైనా ఉంది.
పాఠశాల భోజనం విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న ఫిన్లాండ్ మోడల్‌ను మనం తప్పక అధ్యయనం చేయాలి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పాఠశాల పిల్లలందరికీ పూర్తి ఉచితంగా, అత్యుత్తమ పోషకాలతో కూడిన భోజనాన్ని అందించిన దేశం ఫిన్లాండ్ విద్యార్థుల రోజువారీ క్యాలరీల అవసరంలో మూడొంతుల భాగం కేవలం ఆ భోజనం ద్వారానే లభించేలా మెనూను శాస్త్రీయంగా డిజైన్ చేస్తారు. విద్యా బడ్జెట్‌లో కనీసం ఒకటి నుంచి ఒకటిన్నర శాతం నిధులను కేవలం పిల్లల భోజనానికే కేటాయిస్తారు. భోజనం కోసం చేసే ఖర్చును వృధాగా కాకుండా, భవిష్యత్తు తరాల ఆరోగ్యంపై పెడుతున్న అత్యుత్తమ పెట్టుబడిగా ఆ ప్రభుత్వం భావిస్తుంది. మన పాలకులు కూడా ఈ మోడల్‌ను స్ఫూర్తిగా తీసుకుని బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం – కేటాయింపుల్లో పక్షపాతం
గణాంకాలను పరిశీలిస్తే పసిపిల్లల పౌష్టికాహారం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. దేశవ్యాప్తం గా సుమారు 11 కోట్ల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్రం వార్షిక బడ్జెట్‌లో కేటాయిస్తున్నది సుమారు 12,467 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఒక్కో విద్యార్థి పౌష్టికాహారం కోసం కేంద్రం రోజుకు వెచ్చిస్తున్నది సగటున ఐదారు రూపాయలు మాత్రమే. వినడానికి ఆశ్చర్యం గా ఉన్నా.. దేశంలో పసిపిల్లల పోషణ కోసం రోజుకు ఐదారు రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు, వివిధ పథకాలు, గోశాలల ద్వారా ఒక్కో పశువు రోజువారీ గ్రాసం కోసం సగటున రూ.30 నుంచి రూ.50 వరకు కేటాయిస్తుండటం (ఉదా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నిరాశ్రయ గోవంశ సహభాగితా యోజన) పాలకుల ప్రాధాన్యతలను ప్రశ్నిస్తోంది. ప్రచార ఆర్భాటాలకు, కార్పొరేట్ రాయితీలకు వేల కోట్ల రూపాయలు సునాయాసంగా కేటాయిస్తున్న కేంద్రం.. దేశ భవిష్యత్తును నిర్ణయించే పిల్లల భోజనానికి, నాణ్యమైన ప్రోటీన్ అందించడానికి నిధులు పెంచకపోవడం తీవ్ర శోచనీయం.
సాంస్కృతిక విశ్వాసాలు కాదు.. శాస్త్రీయతే ప్రామాణికం కావాలి
పాఠశాలల్లో పిల్లలకు అందించే పౌష్టికాహారం విషయం లో కొన్నిసార్లు అనవసరమైన వివాదాలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రముఖ పండితులు గరికపాటి నరసింహారావు గారు పిల్లల మధ్యాహ్న భోజనం, అందులోని మెనూపై చేసిన విమర్శలు ఈ కోవలోనివే. పిల్లల కడుపు నింపే, కండపుష్టిని పెంచే ఆహారాన్ని మత, సాంస్కృతిక లేదా వ్యక్తిగత ఆహార నియమాలతో ముడిపెట్టడం అత్యంత శోచనీయం. ఒకవిద్యార్థికి గుడ్డు లేదా మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్ అనేది జీవశాస్త్రపరమైన ప్రాథమిక అవసరం తప్ప, అది ఒక విలాసమో లేదా సంప్రదాయాలకు వ్యతిరేకమైన అంశమో కాదు. సమాజంలో పలుకుబడి ఉన్న పండితులు తమ వ్యక్తిగత విశ్వాసాలను పసిపిల్లల పళ్లెంలో రుద్దాలని చూసినప్పుడు, ప్రభుత్వాలు వాటికి తలొగ్గకుండా కేవలం వైద్య, శాస్త్రీయ ఆరోగ్య ప్రమాణాలకు మాత్రమే పెద్దపీట వేయాలి.
పౌష్టికాహారంలో వ్యత్యాసాలు
రాష్ట్ర ప్రభుత్వం తన తాజా బడ్జెట్‌లో విద్యా రంగానికి 26,674 కోట్ల రూపాయలు కేటాయించడం, అందులో సుమారు 900 కోట్లతో ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని విస్తరించడం గొప్ప ముందడుగు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో చదువుతు న్న విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ వంటి మాంసాహారాన్ని అందిస్తూ అత్యుత్తమ నాణ్యమైన ప్రోటీన్‌ను సమకూరుస్తోంది. కానీ, అదే తరహా విధానాన్ని అత్యంత పేదరికంలో మగ్గుతున్న సామాన్య ప్రభుత్వ బడుల్లో ఎందుకు అమలు చేయలేకపోతున్నారనేది ప్రశ్న. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలందరికీ ఆ మాత్రం పౌష్టికాహారం అందకపోవడం తీవ్రమైన వివక్షే అవుతుంది.
ప్రయోగాత్మక మార్పులు, డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్
బాలబాలికల్లో పోషకాహార లోపాన్ని సమూలంగా పారద్రోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ప్రతి విద్యార్థి బరువు, ఎత్తు, హిమోగ్లోబిన్ శాతాన్ని నమోదు చేస్తూ, రాష్ట్రం లో ఏ ఏ ప్రాంతాల్లో లోపం తీవ్రంగా ఉందో అంచనా వేయాలి. అలా గుర్తించిన ఏజెన్సీ గ్రామాల్లోని బడుల్లో ప్రయోగాత్మకం గా వారానికి కనీసం రెండు రోజులు మధ్యాహ్న భోజనంలో చికెన్ వంటి మాంసాహారాన్ని మెనూలో చేర్చాలి. తద్వారా లభించే ఐరన్, నాణ్యమైన ప్రోటీన్ వల్ల పిల్లల ఎదుగుదలలో వచ్చే అద్భుతమైన మార్పులను అధ్యయనం చేసి, ఈ విధానా న్ని క్రమంగా రాష్ట్రమంతటా విస్తరించాలి.
విద్యా ప్రణాళికలో ఒక సబ్జెక్టుగా న్యూట్రిషన్
బడిలో పౌష్టికాహారం వడ్డించడమే కాకుండా, దాని విలువను పిల్లలకు చిన్నప్పటి నుంచే బోధించడం ఎంతో ముఖ్యం. జపాన్ దేశంలో అమలు చేస్తున్న ఆహార విద్య తరహాలో, మన రాష్ట్రంలో కూడా న్యూట్రిషన్ సబ్జెక్టును పాఠ్యప్రణాళికలో తప్పనిసరిగా చేర్చాలి. ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఎన్ని క్యాలరీలు అందుతాయి, ఆరోగ్యకరమైన స్థానిక ఆహారం ఏది, జంక్ ఫుడ్ అనర్థాలు ఏమిటి అనే విషయాలను పిల్లలకు ఒక సబ్జెక్టు రూపంలో బోధించాలి.
దీనిద్వారా విద్యార్థులు కేవలం బడిలోనే కాకుండా, ఇళ్లలో కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధి తో ఈ మార్పులకు శ్రీకారం చుడితే, ఆరోగ్యవంతమైన నవ తెలంగాణను మనం గర్వంగా నిర్మించుకోవచ్చు. ఎం.కృష్ణ ఆదిత్య (పాత్రికేయుడు)