Skip to content
Uncategorized వార్తలు

అమెరికా, ఇరాన్‌ మధ్య తాత్కాలిక ఒప్పందం

Prajapaksham 16 Jun 2026 1 నిమిషాల పఠనం Uncategorized
అమెరికా, ఇరాన్‌ మధ్య  తాత్కాలిక ఒప్పందం

US–Iran Interim Agreement Signals Temporary Peace in Middle East (Photo-AI Generated Image)

అమెరికా – ఇరాన్‌ మధ్య ఏప్రిల్‌ 7 నుండి అమలులో ఉన్న కాల్పుల విరమణ పలుదఫాలు ఉల్లంఘనకు గురై, ఆ ఇరుదేశాల మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందానికి అవరోధాలు కల్పించినప్పటికీ మధ్యవర్తుల పట్టువిడవని ప్రయత్నాల వల్ల ఎట్టకేలకు సంతకాల దశకు చేరటం యావత్‌ ప్రపంచ దేశాలకు శుభవార్త. ఈ ఒప్పందం కుదరకుండా విలన్‌ పాత్ర పోషిస్తున్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు శనివారం బీరుట్‌ (లెబనాన్‌)లో ఎంచుకున్న లక్ష్యాలపై బాంబులు వేశాడు. కనీసం ముగ్గురు చనిపోయారు, 16 మంది గాయపడ్డారు.

ఇరాన్‌ మద్దతుతో పనిచేసే మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్లా దాడుల కు ప్రతిగా తాము దాడిచేసినట్లు సాకులు చెప్పటం ఆ యుద్ధోన్మాది, జాత్యహంకారికి అలవాటు. అమెరికా తాత్కాలిక ఒప్పందంపై ఆదివారం జెనీవాలో సంతకాలు జరుగుతాయని ఆశించిన తరుణంలో ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై బాంబులు వేసింది. అయినా ఒప్పందంపై సంతకాలు జరుగుతాయన్న అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన నెరవేరలేదు.

మీ హామీలను నెరవేర్చగల సంకల్పబలం, సామర్థ్యం మీకు కొరవడినపుడు శాంతిచర్చల క్రమంతో ముందుకు సాగటం సాధ్యం కాదని” టెహరాన్‌ తరఫున చర్చల్లో ప్రధానపాత్రధారుల్లో ఒకరైన ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మహహ్మద్‌ బాఘెర్‌ క్వాలిబాఫ్‌, లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత ఎక్స్‌ మాధ్యమం ద్వారా అమెరికాను హెచ్చరించాడు. చర్చలను చెడగొట్టటం నెతన్యాహుకు కొత్తకాదు. పదిరోజుల క్రితం శాంతి ఒప్పందం సంతకాల దశకు చేరిందని ట్రంప్‌ ప్రకటించగానే ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై బాంబులవర్షం కురిపించింది. అప్పుడు ట్రంప్‌ తీవ్రంగా నెతన్యాహును హెచ్చరించాడు. ఇప్పుడు జూన్‌ 19న (శుక్రవారం) జెనీవాలో శాంతికి ఫ్రేమ్‌వర్క్‌ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని అమెరికా రెండూ ప్రకటించాయి. ఇంతలో ఏ విఘ్నాలు ఏర్పడకుండా సంతకాలు జరిగితే అది 100 రోజుల యుద్ధం తర్వాత చరిత్రాత్మకమే అవుతుంది. ఆ తర్వాత 60 రోజుల్లో ఇరాన్‌ అణుకార్యక్రమం సహా మిగిలిఉన్న వివాదాంశాలపై చర్చలు జరుగుతాయి.
ఒప్పందంపై అమెరికా శుక్రవారం సంతకాలు చేయబోతున్నాయనే వార్త వెల్లడికాగానే ప్రపంచ దేశాలు ఊపిరిపీల్చుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం వల్ల సంభవించిన విధ్వంసం, ఇతర పర్యవసానాలు ఎలా ఉన్నా, హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయటంవల్ల ఆయిలు సరఫరా చాలావరకు నిలిచిపోయి ప్రపంచదేశాలు ఆర్థిక మాంద్యానికి లోనయినాయి. ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుల బ్రతుకు భారమైంది. ఇప్పుడు సంతకాల ప్రకటన వెలువడగానే, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిలు ధర 5శాతం తగ్గింది. షేర్‌ మార్కెట్లలో షేర్లు కళకళలాడుతున్నాయి. మొన్న దిగాలుపడిన బంగారం ధర ఎగుమోములో ఉంది. డాలర్‌తో మారకంలో మన రూపాయి కూడా కాస్త బలం పుంజుకుంది.

తాత్కాలిక ఒప్పందం వివరాలు వెల్లడికానప్పటికీ అమెరికా ఒక అడుగు వెనక్కువేసి ఇరాన్‌కు అనేక రాయితీలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అందిన సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రం నుంచి హోర్ముజ్‌ జలసంధిలో స్వేచ్ఛా రవాణా మొదలవుతుంది. అయితే యథాపూర్వస్థితి రావటానికి కనీసం నెలరోజులు పడుతుంది. అదేసమయంలో ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా నావికా దిగ్బంధం కూడా తొలగించబడుతుంది. ఇరాన్‌ ఆయిలు ఎగుమతికి అవకాశం కలుగుతుంది. అమెరికా తమ బ్యాంకుల్లో స్థంభింపజేసిన ఇరాన్‌ ఆస్తుల్లో 12 బిలియన్‌ డాలర్లు తక్షణం విడుదల చేస్తుంది. అవి 120 బిలియన్‌ డాలర్లదాకా ఉంటాయని అంచనా. ఇరాన్‌కు అణుబాంబు తయారీ అవకాశం లేకుండా చేయటమే తమ లక్ష్యమంటున్న ట్రంప్‌, ఇరాన్‌ వద్దనున్న శుద్ధిచేసిన ఆయుధ గ్రేడ్‌ యురేనియంను ఇరాన్‌ నుంచి తరలించాలని పట్టుబట్టుతున్నాడు. ఇరాన్‌ ఏమో అమెరికా స్తంభింపజేసిన తమ ఆస్తులను మొత్తంగా విడుదల చేయాలని, దురాక్రమణ యుద్ధం తమకు కలుగజేసిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతున్నది.

ఇత్యాది పెండింగ్‌ సమస్యలకు రెండు నెలల గడువులో పరిష్కారాలు అన్వేషిస్తారు. ఈ తాత్కాలిక ఒప్పందం కోసం యుఎఇ, పాకిస్థాన్‌, ఈజిప్టు, జోర్డాన్‌ గట్టి ప్రయత్నాలు చేశాయి. ఈ చర్చల్లో ఇజ్రాయెల్‌ ఏకాకి అయినప్పటికీ ఈ ఒప్పందం లెబనాన్‌కు కూడా వర్తించటం విశేషం. అందుకు అమెరికా గ్యారంటీ. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ అనుకూల మిలిటెంట్‌లు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని ఆశించుదాం. ఒక సమగ్ర శాంతి ఒప్పందం కుదరాలని, పశ్చిమాసియాలో స్థిరశాంతి నెలకొనాలని ఆశించుదాం. అయితే పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కారం, రెండు దేశాల సహజీవనం సూత్రాన్ని 1967 సరిహద్దుల ప్రాతిపదికన ఆమోదించటం మాత్రమే పశ్చిమాసియాలో ఉద్రిక్తోపశమనం, శాంతి సాధ్యం.
ఇరాన్‌ ప్రజలు ఏభైఏళ్ల క్రితం రాజు షాను పారద్రోలి ఇస్లామిక్‌ రాజ్యాన్ని ఏర్పరుచుకున్న తదుపరి ఇది అమెరికా మూడవ యుద్ధం. ఇరాక్‌ని ముందు పెట్టుకుని సాగించిన తొలి గల్ఫ్‌ యుద్ధంలో తోకముడిచింది. 2025 జూన్‌లో ఇజ్రాల్‌తో కలిసి ఇరాన్‌ అణు పరిశోధనా శాలలను ధ్వంసం చేసేందుకు 10 రోజులకు పైగా బాంబుదాడులు చేసి కొంతనష్టం కలుగజేయగలిగింది. 2026 ఫిబ్రవరి 28 న ఇజ్రాయెల్‌తో కలిసి ట్రంప్‌ సాగించిన వైమానిక దాడుల్లో ఇరాన్‌ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ, మరికొందరు ముఖ్య నాయకులను హతమార్చింది గాని ఇరానియన్‌ల మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయింది. ట్రంప్‌ ఆశించిన ప్రభుత్వ మార్పు సాధ్యం కాలేదు. ఇజ్రాయెల్‌ కోరుకున్న మిస్సిలీ వ్యవస్థను నాశనం చేయలేకపోయింది. చివరకు అమెరికాయే ఒప్పందంకోసం చొరవ తీసుకోవాల్సి వచ్చింది. ఒమన్‌ కుదిర్చిన ఒప్పందంపై నిర్ణయించుకున్న ప్రకారం అమెరికా సంతకం చేసినట్లయితే ఈ యుద్ధం అవసరమే ఉండేది కాదు.