Skip to content
తెలంగాణ వార్తలు

దేశ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మార్చేందుకే SIR తీసుకువస్తున్నారు : పరకాల ప్రభాకర్

Prajapaksham 15 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
దేశ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మార్చేందుకే SIR తీసుకువస్తున్నారు : పరకాల ప్రభాకర్

Parakala Prabhakar Says ‘Sir’ Is Meant to Reshape Indian Politics

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ద్వారా ప్రజలకు లేకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని పలువురు వక్తలు అన్నారు. ఓటు హక్కును రక్షించుకునేందుకు ‘సర్’ పట్ల వార్డు, గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్, బషీర్ బాగ్ దేశోద్దారక భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివ రావు అధ్యక్షతన సోమవారం ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరిగింది.

ఈ సదస్సులో పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశ రాజకీయ పరిస్థితులు మార్చేందుకే ‘సర్’ను ప్రవేశపెట్టారని విమర్శించారు. బీహార్ 63 లక్షల ఓట్లను తొలగించారని, పూర్తి స్థాయిలో లేక్కలు తీసుకుంటే ఆ సంఖ్య 80 లక్షలు చేరుతుందని, పశ్చిమ బెంగాల్ 90 లక్షలు, తమిళనాడులో 97 లక్షలు, కేరళలలో 27 లక్షల ఓటర్లను తొలగించారని, ఉత్తరప్రదేశ్ కూడా 2.83 కోట్ల ఓట్లర్లను తొలగిస్తే ఎవ్వరూ మాట్లాడటం లేదన్నారు. ‘సర్’ ప్రక్రియ పూర్తయిన తరువాత ఒకే ఇంటిపైన 8 వందల ఓట్లు ఉన్నాయని, అందులో అన్ని మతాలు, అన్ని కులాల వారికి చెందిన ఓట్లు ఉండట ఆశ్చర్యమని, ఆ ఇంటిని పరిశీలించేందుకు కొంతమంది ప్రయత్నిస్తే, అక్కడ అసలు ఆ ఇళ్లే లేదని వివరించారు. ‘సర్’ నిర్వహించిన తర్వాత కూడా ఇలాంటి అనేక సంఘటనలు చూశామన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఓట్ల తొలగిస్తున్నారని మండిపడ్డారు.తొలగించిన ఓటర్లలో ముస్లీం, క్రిస్టియన్ మైనార్టీలతో పాటు ఆదివాసీ, దళితులు, పేద, సామాన్య ఓటర్లే అత్యధిక శాతం ఉన్నారని ప్రభాకర్ తెలిపారు.

ఎన్నికలు జరగని రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా సర్ నిర్వహించి, ఓటర్లను తొలగించారని, ఈ విషయం రాజకీయ పార్టీలకు అవసరం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్యాత దేశంలో ఓటు ఉన్నావారు,ఓటు లేని వారు అని రెండు రకాల వారు ఉంటారన్నారు. ఇదే జరిగితే ఓటు లేని వారి వద్దకు ఎవ్వరూ వెళ్లరని అన్నారు. తద్వారా ఓట్లు లేనివారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలతో పాటు కనీస సౌకర్యాలు కూడా అందని పరిస్థితులు నెలకొంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని ఇజ్రాయిల్ తరహాలో మారుస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల జాబితా సవరణ జరపాలాంటే రాజ్యాంగం ప్రకారం గ్రామా,వార్డు సభ ఏర్పాటు చేసి, సభలో బహిరంగంగా ఓటరు సవరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. చీకటి గదుల్లో కూర్చొని ఓట్లను తొలగిస్తే కుదరదన్నారు. దేశంలో అర్హులైన ప్రతి ఓక్కరికి ఓటు హక్కు ఉండాలన్నారు. సాధారణంగా ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకుంటారని, కానీ ప్రభుత్వమే ఓటర్లను ఎన్నుకుంటుందని విమర్శించారు. ఇతర మతాల వారు దేశంలో ఉండటం ఇష్టం లేదని, వారిని చంపలేరని, కానీ ‘సర్’ ద్వారా పౌరసత్వాన్ని చంపుతున్నారని దుయ్యబట్టారు. తొలగించిన ఓటర్లతో ఓటర్ల సంఘాన్ని ఏర్పాటు చేసి, ఓటు హక్కు పునరుద్దరణకు పోరాటం చేయాలని పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *