Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 అడుగులుకు చేరిన నీటి మట్టం..రెండో ప్రమాద హెచ్చరికతో హై అలర్ట్..
Godavari Swells at Bhadrachalam
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది భద్రాచలం వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకోవడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.
Godavari Floods: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నది తీవ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శుక్రవారం మధ్యాహ్నానికి నీటిమట్టం ఏకంగా 48 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం అధికారులు 11,44,507 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదిలో ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, ముంపు గ్రామాల నివాసితులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. అధికారులు ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.
కడెం ప్రాజెక్టు: ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 698.02 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 10,282 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (SRSP): ఎస్సారెస్పీలోకి 70 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, ప్రస్తుతం నీటిమట్టం 1069 అడుగుల వద్ద కొనసాగుతోంది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు: పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 147.30 మీటర్లకు చేరుకుంది. జలాశయంలోకి 1,32,785 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో, గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే (1,32,785 క్యూసెక్కులు) దిగువకు విడుదల చేస్తున్నారు.
మిడ్ మానేరు ప్రాజెక్టు: ఈ జలాశయంలోకి ప్రస్తుతం 18,445 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది.
జలాశయాల్లో నీటిమట్టాలు వేగంగా పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు.