Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ.. ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు..
Godavari Swells at Bhadrachalam
తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
Godavari Floods: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీరు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గురువారం 30 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం శనివారం ఉదయానికి ఏకంగా 55.10 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో, చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని ఆదేశించారు. వాగులు, వంకలు, వరద ప్రవాహాలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
గోదావరి వరద ప్రభావంతో పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రమైన పర్ణశాల జలమయమైంది. సీతవాగు ఉద్ధృతికి స్నానఘట్టాలు, సీతమ్మ నారచీరలు, దేవతామూర్తి పీఠం, ఇనుప వంతెన పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దుమ్ముగూడెం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తురుబాక ఆర్అండ్బీ వంతెన అప్రోచ్ రోడ్లు కోతకు గురికావడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చార్ల మండలం వీరాపురం సమీపంలోని ఇసుక క్వారీలో అకస్మాత్తుగా వరద రావడంతో చిక్కుకుపోయిన 44 మంది లారీ డ్రైవర్లు, స్థానికులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే 30కి పైగా లారీలు ఇంకా వరద నీటిలోనే చిక్కుకుపోయాయి. సహాయక చర్యల సమయంలో తెప్పపై నుంచి నీటిలో పడిన ఇద్దరు పోలీసులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అశ్వాపురం మండలంలో ప్రసవ వేదనతో ఉన్న ఓ గర్భిణిని థర్మాకోల్ తెప్ప సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించడం స్థానికంగా అందరినీ కదిలించింది.
వరద పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. మంత్రి సీతక్క స్వయంగా మంగపేట మండలంలో పర్యటించి గోదావరి ఉద్ధృతిని పరిశీలించారు. కరకట్ట పనులను సమీక్షించడంతో పాటు పొద్మూరు, ముస్లిం వాడ, బీసీ కాలనీల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. గోదావరి ఉద్ధృతి తగ్గే వరకు అధికారులు ఎవరూ హెడ్‌క్వార్టర్స్‌ను వీడి వెళ్లవద్దని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో అనవసరంగా సంచరించవద్దని విపత్తు నిర్వహణ అధికారులు విజ్ఞప్తి చేశారు.
- Vinayaka Chavithi 2026 Wishes In Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు అందమైన కొటేషన్స్ తో కూడి ఇమేజ్ గ్రీటింగ్స్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి..
- Ganesh Chaturthi 2026 Wishes in Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధు మిత్రులకు శ్లోకాలతో కూడిన ఈ కొటేషన్స్ వాట్సప్ ద్వారా షేర్ చేసుకోండి..
- Vinayaka Chavithi Wishes 2026: మీ బంధుమిత్రులకు వినాయక చవితి సందర్భంగా Whatsapp, SMS, X, Meta ద్వారా షేర్ చేయడానికి చక్కటి భక్తి భావంతో కూడిన Text Messeges మీ కోసం…
- Vinayaka Chavithi Wishes 2026: వినాయక చవితి శుభాకాంక్షలు .. మీకు మీ కుటుంబ సభ్యులకు 25 ప్రత్యేక శుభాకాంక్షలు
- తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు…మల్లు స్వరాజ్యం