Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు నుండి నడిచే విమానాల లిస్ట్ ఇదే..అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
Bhogapurm Airport
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ప్రారంభ దశలో ప్రధాన నగరాలకు దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానుండగా, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా అంతర్జాతీయ సర్వీసులను కూడా దశలవారీగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో కీలక అధ్యాయానికి నాంది పలుకుతూ.. విశాఖపట్నం సమీపంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం ఎయిర్పోర్ట్)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అధికారికంగా జాతికి అంకితం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నిర్మితమైన అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇదే కావడం విశేషం.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి. మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రధానికి ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతికి ప్రతీకగా సుమారు 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు ఏకకాలంలో ధింసా నృత్యం చేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని ఓపెన్‌టాప్ జీపులో ప్రదర్శనను వీక్షించి.. విమానాశ్రయంలోని చెక్-ఇన్ హాల్, ఆధునిక ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవస్థలను పరిశీలించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో సుమారు రూ.4,700 కోట్ల వ్యయంతో 2,200 ఎకరాల్లో నిర్మించింది. భవిష్యత్ విస్తరణ కోసం మరో 500 ఎకరాలను కేటాయించారు. 3,800 మీటర్ల రన్‌వే పై బోయింగ్ 777, ఎయిర్‌బస్ A350 వంటి భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా నిర్మాణం చేపట్టారు.
తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని, భవిష్యత్తులో 4 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించేలా విస్తరించనున్నారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే తుఫాను గాలులను తట్టుకునే నిర్మాణం, క్యాట్-I ల్యాండింగ్ సిస్టమ్ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేశారు.
విశాఖ పాత విమానాశ్రయానికి ప్రత్యామ్నాయం: ప్రస్తుతం విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ దేగా నావికాదళ స్థావరం పరిధిలో పౌర విమాన సర్వీసులు కొనసాగుతుండటంతో భద్రతా పరిమితులు, రన్‌వే విస్తరణ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అనువుగా జాతీయ రహదారి-16 సమీపంలో భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు.
ఆగస్టు 17 నుంచి వాణిజ్య సేవలు: ప్రారంభోత్సవం పూర్తయినప్పటికీ ఆగస్టు 17 నుంచి అధికారికంగా పౌర విమానాల వాణిజ్య సేవలు ప్రారంభం కానున్నాయి. అనంతరం విశాఖ పాత విమానాశ్రయంలోని పౌర విమాన కార్యకలాపాలను పూర్తిగా భోగాపురానికి తరలించనున్నారు.
ఎయిర్ ఇండియా ప్రకటించిన సర్వీసులు: అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే షెడ్యూల్ ప్రకారం ఎయిర్ ఇండియా ఈ క్రింది విమాన సర్వీసులను నిర్వహించనుంది.
హైదరాబాద్ – భోగాపురం: రోజుకు 5 విమానాలు
బెంగళూరు – భోగాపురం: రోజుకు 2 విమానాలు (ఆదివారం, శుక్రవారం మినహా వారంలో మిగిలిన రోజుల్లో అదనంగా మరో సర్వీసు)
విజయవాడ – భోగాపురం: రోజుకు 4 విమానాలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి, ఫార్మా, సీఫుడ్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త ఊపిరి లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు రాకతో విశాఖ పాత ఎయిర్పోర్ట్ ఇమేజ్ తగ్గుతుందా? రెండు విమానాశ్రయాల మధ్య వ్యూహాత్మక వ్యత్యాసాలివిగో..
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఖర్చు ఎంత అయిందో తెలుసా.. దీనిని ఏ పద్దతిలో ఎవరు నిర్మించారంటే..
- Bhogapuram Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతలివే.. ASR International Airport రాకతో ఉత్తరాంధ్ర తలరాత మారుతుందా..
- Bhogapuram Airport : వీడియో ఇదిగో.. బొబ్బిలి వీణతో ప్రధాని మోదీ.. రూ.4,727 కోట్ల వ్యయంతో భోగాపురం అంతర్జాతీయ విమానం నిర్మాణం..
- Bhogapuram Airport : విశాఖ పాత ఎయిర్‌పోర్టుకు గుడ్‌బై.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు VTZ కోడ్..