Skip to content
తెలంగాణ వార్తలు

ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ మెగా ప్రాజెక్టుల కోసం రూ.1 లక్ష కోట్ల ఫండ్ కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి..

Prajapaksham 12 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ మెగా ప్రాజెక్టుల కోసం రూ.1 లక్ష కోట్ల ఫండ్ కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి..

Telangana CM Revanth Reddy Meets PM Modi, Seeks ₹1 Lakh Crore for Hyderabad's M-6 Project

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా ఉన్న హైదరాబాద్, దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్‌’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

మౌలిక వసతుల కల్పన కోసం ఒక్కో మెట్రో నగరానికి రూ.లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులను కేంద్రం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని వ్యక్తిగతంగా కలిసి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులతో కూడిన వినతిపత్రాన్ని సమర్పిస్తూ తెలంగాణకు తక్షణమే 7 వరాలు ప్రకటించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాన్ని సాధించాలంటే నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అత్యంత ఆవశ్యకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కుల సర్వేలో ఆస్తుల కంటే విద్యే సామాజిక వెనుకబాటుతనాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోందని తేలిందని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం పెంపొందించడానికి, కులాల మధ్య గోడలను కూల్చివేయడానికి ప్రతి నియోజకవర్గంలో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ తరగతులు ,ఉచిత వసతులతో కూడిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

అలాగే యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని నెలకొల్పామని, రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునీకరించడానికి టాటా గ్రూప్‌తో రూ.2,100 కోట్ల భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు చేయడం తమ విద్యా విధానానికి దక్కిన తొలి విజయమని పేర్కొంటూ, తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వన్ ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని వివరించారు.

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రికి సమర్పించిన 7 ప్రధాన డిమాండ్లు ,ప్రతిపాదనలలో గోదావరి జలాల వినియోగం అత్యంత కీలకమైనదిగా ఉంది. సాగు, తాగునీటి అవసరాల కోసం గోదావరి నీటిని సమర్థంగా ఉపయోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే రూ.38,595 కోట్లతో ప్రతిపాదించిన 122.9 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (7 కారిడార్లు) ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ తదుపరి వృద్ధికి మైలురాయిగా నిలిచే రీజినల్ రింగ్ రోడ్ (RRR) ఉత్తర, దక్షిణ కారిడార్ల పనులను ఒకేసారి ఆమోదించాలని ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర భాగానికి సంబంధించి 90 శాతం భూసేకరణ పూర్తయిందని, ఎన్‌హెచ్‌ఏఐకి ఇప్పటికే రూ.626 కోట్లు విడుదల చేశామని గుర్తు చేస్తూ, దక్షిణ భాగం అలైన్‌మెంట్ మ్యాప్‌లను కూడా కేంద్రానికి అందించినట్లు తెలిపారు. దీనితో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం పోర్టు వరకు రవాణా, ఎగుమతులను సులభతరం చేసేలా 12 వరుసల ‘హైదరాబాద్-అమరావతి-బందరు పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వే’ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి ఉద్దేశించిన వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులను వేగంగా ప్రారంభించాలని, ఇందుకోసం అవసరమైన భూమిని ఇప్పటికే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి అప్పగించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. చివరగా, రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు హైదరాబాద్‌లో ఐఐఎం (IIMS) ఏర్పాటు చేయాలని కోరారు. దీనికోసం 200 ఎకరాల భూమిని కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానికి స్పష్టం చేశారు. వీటితో పాటు 30 వేల ఎకరాల్లో నిర్మించనున్న నెట్ జీరో గ్రీన్‌ఫీల్డ్ భారత్ ఫ్యూచర్ సిటీకి, మూసీ పునరుజ్జీవన పథకానికి ,పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం నుండి పూర్తి ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందించాలని రేవంత్‌రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *