భారీ భూకంపంతో వణికిన ఫిలిప్పీన్స్.. సునామీ ముప్పుపై హెచ్చరిక.. సముద్ర తీర ప్రాంతాలకు అలర్ట్
Tsunami Watch Triggered After Earthquake Shakes Southern Philippines
దక్షిణ ఫిలిప్పీన్స్‌ను సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం కుదిపేసింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఈ తీవ్రమైన భూప్రకంపనల కారణంగా తీరప్రాంత నగరాల్లో భారీగా ఆస్తినష్టం చోటు చేసుకుంది. ముఖ్యంగా దాదాపు 7 లక్షల మంది జనాభా ఉండి, ట్యూనా ప్రాసెసింగ్ పరిశ్రమకు పెద్ద కేంద్రంగా ఉన్న జనరల్ శాంటోస్ నగరం ఈ భూకంప ధాటికి వణికిపోయింది. అక్కడ ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీవ్రంగా దెబ్బతింది.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, జనరల్ శాంటోస్ నగరానికి నైరుతి దిశగా 8 మైళ్ల దూరంలో, భూగర్భంలో 6.2 మైళ్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భారీ భూకంపం కారణంగా సముద్రంలో 10 అడుగుల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడే ప్రమాదం ఉందని ఫిలిప్పీన్స్ తీరప్రాంత వాసులను అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తీరంలో మూడు అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడ్డాయి.
మరోవైపు, పసిఫిక్ సునామీ సెంటర్ హెచ్చరికల ప్రకారం పొరుగు దేశాలైన ఇండోనేషియా, మలేసియాల్లో కూడా 3 అడుగుల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది. వీటితో పాటు తైవాన్, జపాన్, పపువా న్యూ గునియా దేశాలు కూడా ఈ సునామీ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.