జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త.. సీబీఎస్‌ఈ లక్ష్యంగా విరుచుకుపడిన రాహుల్ గాంధీ..
సాంకేతికతను జోడించి మూల్యాంకనాన్ని మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. 12వ తరగతి ఫలితాల వెల్లడి అనంతరం అనేకమంది విద్యార్థులకు ఆశించిన మార్కులు రాకపోవడం, మార్కుల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపించడంతో ఈ కొత్త ప్రక్రియలోని లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. పరీక్షల నిర్వహణలో విద్యా సంస్థల వైఫల్యం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన సాంకేతిక, ఆర్థిక ఆరోపణలు చేశారు. నిబంధనల ప్రకారం పరీక్ష పత్రాలను అత్యంత స్పష్టత కలిగిన ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లతో స్కాన్ చేయాల్సి ఉండగా, టెండర్ నిబంధనలను మార్చివేసి సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్సర్ షీట్లను స్కాన్ చేశారని ఆయన ఆరోపించారు. దీనివల్ల అక్షరాలు సరిగా కనిపించక మూల్యాంకనంలో భారీ తప్పులు జరిగాయని, తప్పు బోర్డుది అయితే దానికి విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ లోపాల కారణంగా విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. బోర్డు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి విద్యార్థులు తమ సొంత డబ్బును వెచ్చించాల్సి వస్తోందని మండిపడ్డారు. డిజిటల్ స్కాన్ కాపీ పొందడానికి ఒక సబ్జెక్టుకు రూ.100, పేపర్ రీ-టోటలింగ్ కోసం మరో రూ.100, రి-ఎవాల్యుయేషన్ కోసం ఒక్కో ప్రశ్నకు రూ.25 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఒక విద్యార్థి తన జవాబుపత్రాన్ని పూర్తిగా సరిగా దిద్దించుకోవడానికి దాదాపు రూ.2 వేలు వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని, దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు దీనికోసం దరఖాస్తు చేసుకుంటే బోర్డుకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని ఆయన లెక్కలతో సహా వివరించారు.
జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త. వారంతా సీబీఎస్‌ఈ కార్యాలయంలో తిష్ట వేశారు. సీబీఎస్‌ఈ (CBSE) పొరపాటు వల్ల మార్కులు తప్పుగా వస్తే.. దానికి మీకు బిల్లు పడుతుంది అంటూ ఈ మేరకు ఆయన విద్యార్థులతో ముచ్చటించిన వీడియోను సోమవారం ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఇటీవలే దేశాన్ని కుదిపేసిన ‘నీట్’ ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం మరువకముందే, ఇప్పుడు దేశంలోనే అత్యున్నత విద్యా బోర్డు అయిన సీబీఎస్‌ఈ చుట్టూ ఇంతటి వివాదం ముసురుకోవడం విద్యావ్యవస్థపై నమ్మకాన్ని సడలిస్తోంది. విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోవడం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని, దీనివల్ల విద్యార్థులు తమ విలువైన సమయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్తును మూల్యంగా చెల్లించుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.