Skip to content
తెలంగాణ వార్తలు

ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ భూతం.. 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Prajapaksham 17 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ భూతం.. 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Osmania Medical College Under Spotlight Over Ragging Claims

హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్య విద్యాసంస్థ అయిన కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీ (డెంటల్ వింగ్) లో జరిగిన ఒక ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తోటి విద్యార్థులకు అండగా ఉండాల్సిన సీనియర్లే రౌడీల్లా ప్రవర్తించడంతో కాలేజీ యాజమాన్యం, పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. కాలేజీలో కొత్తగా చేరిన బీడీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను కొంతమంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు హాస్టల్ గదుల్లో మానసికంగా, శారీరకంగా తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఈ అరాచకానికి భయపడిపోయిన జూనియర్ విద్యార్థులు ధైర్యం చేసి కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

బాధిత విద్యార్థుల ఆవేదనపై ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ తక్షణమే స్పందించారు. ఆయన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిన 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై ‘తెలంగాణ ప్రోహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్’ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ర్యాగింగ్ సంస్కృతి పట్ల కాలేజీ యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది. తప్పు చేసినట్లు తేలిన ఆ 12 మంది సీనియర్ విద్యార్థులను ఆరు నెలల పాటు కాలేజీ నుండి సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులే ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాలేజీల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *