ఎల్‌ని‘నో’ ఎఫెక్ట్… అప్రమత్తతే ఆయుధం
ఎల్‌ని‘నో’ ఎఫెక్ట్... అప్రమత్తతే ఆయుధం
జి.లక్ష్మణ్ కుమార్ (అసిస్టెంట్ డైరెక్టర్, పౌరసంబంధాల శాఖ, కరీంనగర్)
వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తం గా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ఏర్పడే ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వ్యవసాయంపై ప్రభావం చూపుతుంది. భారతదేశంలో దక్షిణ పశ్చిమ రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తుండగా, తెలంగాణ రాష్ట్రం కూడా దీని ప్రభావానికి అతీతం కాదు. తెలంగాణలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా కొనసాగుతోంది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు వంటి పంటలు సకాలంలో కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా ప్రారంభమవడం, తక్కువగా కురవడం లేదా అసమానంగా పడడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు విత్తనాలు వేసిన తర్వాత మొలకలు దెబ్బతినడం, పంట దిగుబడి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఎల్ నినో ప్రభావం కేవలం వ్యవసాయానికే పరిమితం కాదు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. భూగర్భ జలాల మట్టం పడిపోవడం, చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గడం, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. విద్యుత్ అవసరం పెరగడం, పశువులకు మేత, తాగునీటి కొరత ఏర్పడడం కూడా దీనికి అనుబంధ ప్రభావాలే. వ్యవసాయ రంగంలో ముందస్తు ప్రణాళిక అత్యంత కీలకం. వాతావరణ శాఖ సూచనలను అనుసరించడం, తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవడం, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించడం వంటి చర్యలు నష్టాలను కొంతవరకు తగ్గించగలవు. రైతులకు సకాలంలో శాస్త్రీయ సలహాలు, నాణ్యమైన విత్తనాలు, పంటల బీమా, ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యత. అయితే ప్రతి ఎల్‌నినో సంవత్సరంలోనే కరువు వస్తుందని భావించడం సరైంది కాదు. భారతదేశంలో వర్షపాతం అనేక ఇతర వాతావరణ కారకాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాతావరణ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు విడుదల చేసే తాజా అంచనాలు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే సహజ ప్రక్రియల్లో ఎల్ నినో ఒకటి. ఈ ప్రభావం వల్ల భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాల తీరు మారడం, వర్షపాతం తగ్గడం, వర్షాలు ఆలస్యంగా ప్రారంభం కావడం లేదా మధ్యలో దీర్ఘకాల విరామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అందువల్ల రైతులు సంప్రదాయ సాగు విధానాల కంటే పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం అత్యంత అవసరం.
తక్కువ నీటితో పెరిగే, తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే పంటలను సాగు చేయడం వల నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. జొన్న, సజ్జ, రాగి, పెసర, మినుములు, కంది, నువ్వులు, వేరుశెనగ వంటి పంటలు వర్షాభావ పరిస్థితులను కొంతవరకు తట్టుకుని రైతులకు ఆర్థిక భరోసా కల్పించే అవకాశం ఉంటుంది. వరి సాగు ప్రారంభిస్తే తీవ్ర నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అలాగే పత్తి సాగులో కూడా వర్షాలు స్థిరంగా ప్రారంభమైన తర్వాతే విత్తనాలు వేయడం మంచిది. తక్కువ వ్యవధిలో పండే వంగడాలను ఎంచుకోవడం ద్వారా పంటను కాపాడుకునే అవకాశం పెరుగుతుంది.
వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నట్లుగా రైతులు వాతావరణ శాఖ విడుదల చేసే అంచనాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సాగు నిర్ణయాలు తీసుకోవాలి. ఎల్ నినో ఒక సహజ వాతావరణ ప్రక్రియ అయినప్పటికీ, దాని ప్రభావాన్ని తగ్గించడం మన చేతుల్లోనే ఉంది. శాస్త్రీయ వ్యవసాయం, నీటి సంరక్షణ, వాతావరణ హెచ్చరికలను పాటించడం, ప్రభుత్వ ముందస్తు చర్యలు కలిసి పనిచేస్తే తెలంగాణ రాష్ట్రం ఎల్ నినో సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలదు. వాతావరణ మార్పుల యుగంలో శాస్త్రీయ అవగాహనే రైతులకు, సమాజానికి నిజమైన రక్షణగా నిలుస్తుంది. వ్యవసాయ రంగాన్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ నాణ్యమైన విత్తనాలు, శిక్షణ, ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన కింద డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులకు సబ్సిడీ అందించి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేలా రైతులను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందిస్తూ స్థానిక అవసరాలకు అనుగుణంగా పంటల ప్రణాళికలను అమలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా బీమా రక్షణ అందిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం కూడా మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి వ్యవసాయ సీజన్‌కు జిల్లా, మండలాల వారీగా పంటల ప్రణాళిక రూపొందిస్తూ రైతులకు తగిన సూచనలు అందిస్తోంది. వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, తక్కువ నీటితో సాగు చేయగల పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ శాస్త్రీయ సాగు పద్ధతులను వివరిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై అందించడం, సూక్ష్మ నీటిపారుదల పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ యాంత్రీకరణకు ఆర్థిక సహాయం అందించడం, రైతు వేదికల ద్వారా సాంకేతిక సలహాలు ఇవ్వడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది.
రైతు బంధు ద్వారా సాగు పెట్టుబడి సహాయం, రైతు బీమా ద్వారా రైతు కుటుంబాలకు భద్రత కల్పించడం కూడా రైతులకు ఆర్థికంగా తోడ్పడుతున్నాయి. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయా లు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతులకు పంటల ఎంపిక, తేమ సంరక్షణ, పురుగు నివారణ, నీటి యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. డిజిటల్ వేదికల ద్వారా వాతావరణ హెచ్చరికలు, వ్యవసాయ సూచనలు కూడా రైతులకు చేరవేస్తున్నారు.
అయితే కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రమే సరిపోవు. రైతులు కూడా మారుతున్న వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకొని శాస్త్రీయ సూచనలను పాటించాలి. ప్రాంతానుకూలమైన పంటలను ఎంచుకోవడం, నీటిని పొదుపుగా వినియోగించడం, తక్కువ కాలంలో పండే రకాలను సాగు చేయడం వంటి చర్యలు అవసరం.వాతావరణ మార్పులు భవిష్యత్ వ్యవసాయానికి పెద్ద సవాలుగా నిలుస్తున్న ఈ సమయంలో ప్రత్యామ్నాయ పంటల సాగు ఒక అవసరంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకొని రైతులు పంటల వైవిధ్యాన్ని పెంచితే నష్టాలను తగ్గించుకోవడమే కాకుండా స్థిరమైన ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, రైతులు సమన్వయంతో పనిచేసినప్పుడే వాతావరణ మార్పుల సవాళ్లను అధిగమించి వ్యవసాయాన్ని సుస్థిరంగా ముందుకు తీసుకెళ్లడం సాధ్యమవుతుంది.సమాజమంతా అప్రమత్తం కావాలి. ఇది కేవలం రైతుల సమస్య మాత్రమే కాదు. విద్యాసంస్థలు, పట్టణ ప్రజలు, అపార్ట్‌మెంట్ నివాసులు, పారిశ్రామిక రంగం, స్థానిక సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం ఒక్కరూ తమవంతు బాధ్యతను నిర్వర్తించినప్పుడే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
రైతులు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సాగు ప్రణాళికరూపొందించాలి. అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో పెరిగే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను ఉపయోగించడం, వర్షపు నీటిని పొలాల్లోనే నిల్వ చేసే చర్యలు చేపట్టడం, నేలలో తేమను కాపాడే సాగు పద్ధతులను అనుసరించడం అవసరం. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సూచనలను పాటించడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం, తాగునీటి వనరులను సంరక్షించడం, చెరువుల పునరుద్ధరణ, అటవీ విస్తీర్ణం పెంపు, సూక్ష్మ నీటిపారుదల, పునరుత్పాదక ఇంధన వినియోగానికి ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలి. ఎల్‌నినో ప్రభావాన్ని పూర్తిగా నివారించడం మన చేతుల్లో లేకపోయినా, దానివల్ల కలిగే నష్టాలను తగ్గించడం మాత్రం మనందరి చేతుల్లోనే ఉంది.
రైతు పొలంలో నీటిని కాపాడితే దేశానికి ఆహార భద్రత లభిస్తుంది. విద్యార్థి ఒక మొక్కను పెంచితే పర్యావరణానికి రక్షణ లభిస్తుంది. ప్రతి కుటుంబం ఒక చుక్క నీటిని ఆదాచేస్తే నీటి భద్రత లభిస్తుంది. ప్రకృతిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమే. అందుకే ఎల్‌నినోను ఎదుర్కోవాలంటే ప్రభుత్వం ఒక్కటే కాదు… ప్రజల భాగస్వామ్యమే విజయానికి అసలైన మార్గం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి, బాధ్యతాయుతంగా
వ్యవహరించాలి.