Skip to content
జాతీయం వార్తలు

ప్రతిఘటన, పునరుద్ధరణ, ఇండియా కూటమి భవిష్యత్తు

Prajapaksham 18 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ప్రతిఘటన, పునరుద్ధరణ, ఇండియా కూటమి భవిష్యత్తు

రచయిత: దీపాంకర్‌ భట్టాచార్య -ప్రధాన కార్యదర్శి సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌

ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌ (ఇండియా) కూటమి నాయకులతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగాన్ని విడుదల చేయడం బహుశా ఇదే మొదటిసారి. భారతీయ గణతంత్ర పునాదులు, కోట్లాది భారతీయుల స్వేచ్ఛ, జీవనోపాధులపై సంఘ్‌ భారతీయ జనతా పార్టీ(బిజెపి)ల దాడి కి వ్యతిరేకంగా ఐక్య ప్రతిఘటన నిర్మించటంపై ఆయన దృష్టి సారించటం ఆహ్వానించదగిందే. అలాగే నిజమైన శక్తిమంతమైన సుస్థిర ప్రతిఘటనకు కొన్ని నిర్మాణాత్మక అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేశారు.
ఇండియా పేరు నిర్ణయించేందుకు ముందు 2023 జూన్‌లో బిహార్‌లోని పట్నా లో జరిగిన ఆరంభ దశ సమావేశం సహా ఇండియా కూటమికి సంబంధించిన అన్ని సమావేశాలకు నేను (వ్యాసకర్త)కూడా హాజరయ్యాను. బిజెపి ‘డబుల్‌ ఇంజిన్‌’ / నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డిఎ) ప్రభుత్వా లు 20కిపైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించిన సమయంలో రాహుల్‌ గాంధీ చేసిన ఉత్తేజపూరిత ప్రసంగం అటు అభయమిచ్చినట్లు, ఇటు కొంతవరకు ఆందోళన కలిగించినట్లు రెండు విధాలుగా ఉంది. ఈ ప్రసంగం కాంగ్రెస్‌ సమావేశంలో నైతే గట్టిగా ప్రతిధ్వనించి ఉండేది. అయితే, భారతదేశ సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర గణతంత్ర పరిరక్షణ కోసం విభిన్న సైద్ధాంతిక స్రవంతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 పార్టీలు ఒక్కటై వచ్చిన సమావేశంలో ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలు మాత్రం అసంబద్ధంగా ఉన్నవి.
పూర్ణ స్వరాజ్‌ (సంపూర్ణ స్వాతంత్య్రం) కాంగ్రెస్‌ అధికారిక లక్ష్యంగా మారిన తరువాత కాంగ్రెస్‌ ఒక ప్రతిఘటనా ఉద్యమంగా మారిందని రాహుల్‌గాంధీ చెప్పటం సరైందే. ఆ మేరకు 1927లో మద్రాస్‌ సమావేశం లో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, రెండేళ్ళ తరువాత 1929లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో అది ఆమోదం పొందింది. తద్వారా కాంగ్రెస్‌ పార్టీ భారత స్వాతంత్య్రోద్యమంలో నాయకత్వ స్థానంలోకి ముందుకు వెళ్ళగా, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ప్రస్తుత ఫూలే అంబేడ్కర్‌ పెరియార్‌ స్రవంతులు సైతం అందులో ఇతర ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు. 1921లో అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో తొలిసారిగా మౌలానా హస్రత్‌ మొహానీ, స్వామి కుమారానంద అనే ఇద్దరు కమ్యూనిస్టు ప్రతినిధులు పూర్ణ స్వరాజ్య భావనను తొలిసారిగా వ్యక్తం చేసిన విషయాన్ని మనం మరవరాదు. భగత్‌సింగ్‌, ఆయన ఇతర సహచరులు 1928లో హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా స్పష్టంగా, నిర్భీతిగా సైద్ధాంతిక ప్రకటన వెలువడింది.
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం
స్వాతంత్య్రోద్యమానికి దూరంగా ఉన్న, తరచూ వ్యతిరేకించిన ఏకైక సైద్ధాంతిక స్రవంతికి, పోరాటం ద్వారా భారత స్వాతంత్య్రాన్ని సాధించిన విభిన్న సైద్ధాంతిక స్రవంతులకు మధ్య నేడు పోరాటం జరుగుతోంది. తమ సైద్ధాంతిక ఎజెండాను ముందుకు తీసుకెళ్ళే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిర్మాణాన్ని మార్చాలని కోరుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) బిజెపికి సంబంధించిన హిందూత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పునఃసమీకృతమైన శక్తులకు ఇండియా కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది.
బిజెపికి ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అమలుకు అధికారం లభిస్తే, ఏ ఇతర రాజకీయ పార్టీలకన్నా కాంగ్రెస్‌ పార్టీకి జరిగే నష్టం తక్కువేమీ కాదు. నిజానికి కాంగ్రెస్‌ మరింత దుర్బలమైనదని తరచూ నిరూపించబడింది. పూర్తిస్థాయి ఫాసిస్టు దాడి, సైద్ధాంతిక దాడి జరుగుతున్న ప్రస్తుత
తరుణంలో స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఉజ్వల అధ్యాయాల కలిగిన మనలోని ఏ పార్టీకి ఎలాంటి సమీకృతమైన సైద్ధాంతిక కవచం, లేదా రక్షణ ఉండబోదు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న నాయకుల తో బిజెపి నిండిపోయింది. బిజెపిని ప్రతిఘటించాల్సిన ఆవశ్యకతను రాహుల్‌గాంధీ నొక్కి చెబుతున్నప్పటికీ, తెలంగాణలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి మాత్రం వివాదాస్పదమైన కూల్చివేతల పర్వాన్ని సమర్ధించుకునేందుకు హిట్లర్‌ను గర్వంగా గుర్తు చేసుకుంటున్నారు.
ఒకవేళ వ్యవస్థలను స్వాధీన పరుచుకుంటే, ఓటర్ల జాబితాల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటించే వరకు ఎన్నికల వ్యవస్థను దుర్వినియోగపరిస్తే, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర గణతంత్రం అని చెప్పే రాజ్యాంగాన్ని వారసత్వంగా పొందిన ప్రజలకు ఇంకా ఏ ప్రత్యామ్నాయం మిగిలి ఉంటుంది? దీనికి జవాబు ప్రతిఘటన మాత్రమేనని రాహుల్‌గాంధీ చేసిన వాదన అత్యంత వాస్తవమైనది. అయితే, అది చెదురుమదురుగా లేదా సంకేతాత్మక వ్యతిరేకత మాదిరిగా కాకుండా, విస్తృత ప్రాతిపదికన, నిర్ధిష్టమైన ప్రజాస్వామ్య ప్రతిఘటనగా ఉండాలి.
న్యాయమైన గణతంత్రం దిశగా
దేశానికి, విశాల ప్రజానీకానికి వినాశకరంగా నిరూపితమైన విధానాలను ఇక ఏమాత్రం మనం భరించలేము. భారతదేశ వనరులను గుప్పెడు కార్పొరేషన్‌లకు బదిలీ చేసి, జనసమూహాలను పేదరికంలోకి నెట్టేవేసే, పర్యావరణాన్ని ధ్వంసం చేసే ఆశ్రిత పెట్టుబడిదారి ఆర్థిక నమూనా పోవాల్సిందే. అమెరికా క్షిపణులకు భారతీయ నావికులు బలైనప్పటికీ, అమెరికా ఇజ్రాయెల్‌ దురాక్రమణ కూటమికి భారతదేశ స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టిన విదేశాంగ విధానం తక్షణమే మారాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ భూములు, అటవీ హక్కులపై దాడులు, వారి రాజ్యాంగ రక్షణల ను లాగేసుకునే యత్నాలు తప్పక ఆగిపోవాలి. బుల్‌డోజర్‌లను, ఎన్‌కౌంటర్‌లను గొప్పగా చూపిస్తూ, అసమ్మతిని నేరంగా మార్చేసిన పరిపాలన నమూనాకు ప్రజాస్వామ్య గణతంత్రంలో స్థానం లేదు. అదే స్థాయిలో, మతపరమైన ఆధిపత్యం, వెలివేత ద్వారా జాతీయతను నిర్వచించే సాంస్కృతిక జాతీయవాద సిద్ధాంతాన్ని తప్పక తిరస్కరించాలి. చివరగా, విశ్వస
నీయత, పారదర్శకతలను త్యజించిన ఎన్నికల వ్యవస్థను తక్షణమే,
సమగ్రంగా సంస్కరించాలి.
నిజానికి ఇప్పటికే ఇలాంటి ప్రతిఘటన మొదలైంది. 2014లో భూసేకరణ ఆర్డినెన్స్‌ను వదిలి వేసేలా, ఏడేళ్ళ తరువాత మూడు సాగు చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనక్కితీసుకునేలా రైతులు చేయగలిగారు. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని అనేకమంది భావించిన పౌరసత్వ
(సవరణ) చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా 2019లో షహీన్‌బాగ్‌ నేతృత్వం వహించిన ఉద్యమం జాతీయస్థాయి వ్యతిరేకతను రాజేసింది. ఈ మధ్య కాలంలో పెరుగుతున్న పనిభారం, తగ్గుతున్న వేతనాలకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో జరిగిన కార్మికుల నిరసనలు పెరుగుతున్న ఆర్థిక దురవస్థలను ఎత్తిచూపింది. నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా
(ఎన్‌ఎస్‌యుఐ) మొదలు లేదా ఎఐఎస్‌ఎ, ఎస్‌ఎఫ్‌ఐ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు లేదా కొత్తగా డిజిటల్‌ లక్షణంగా ముందుకు వచ్చిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) నాయకత్వంలో విద్యార్థుల ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇవి విద్య, పరీక్షా వ్యవస్థలో గంభీరమైన సంక్షోభంపై
జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.
ఇందుకు ప్రజలు చెల్లించుకున్న మూల్యాన్ని మనం గుర్తించాలి. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన చారిత్రాత్మక రైతు ఆందోళన సందర్భంగా 700 మందికి పైగా రైతులు మరణించారు. ఫాదర్‌ స్టాన్‌ స్వామి కస్టడీలో చనిపోయారు. ఎల్గార్‌ పరిషద్‌, సిఎఎ నిరసనలకు సంబంధించిన సురేందర గాడ్లింగ్‌, ఉమర్‌ ఖాలీద్‌, షర్జీల్‌ ఇమామ్‌ వంటి ఉద్యమకారులు ఏళ్ళ తరబడి జైళ్లలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీస హక్కులు, మెరుగైన వేతనాలు డిమాండ్‌ చేసినందుకు కార్మికులు, ఉద్యమకారులు నిర్బంధాలను ఎదుర్కొంటున్నారు. ఎలాంటి స్పష్టమైన వివరణ లేకుండా జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించబడిన ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌ , అనేక మాసాల తరువాత విడుదల కావడం అరుదైన మినహాయింపు. జర్నలిస్టు లు సైతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నా రు. ప్రబీర్‌ పురకాయస్థ సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత ఊరట పొందారు.
ప్రజల్లో కనబడుతున్న ధైర్యం, పట్టుదలల కు భిన్నంగా బెదిరింపులు, ఒత్తిళ్ళు లేదా అధికార ప్రలోభాల కారణంగా చీలికలు లేదా అంతర్గత విచ్ఛితి చెందడం వంటి కలవరపాటుకు గురిచేసే స్థితి రాజకీయ పార్టీల్లో నెలకొంది. ప్రతిఘటనను నిర్మించటంపై మాట్లాడే సమయంలో మనం ఎంత వినయంగా ఉండాలనేది ఇది గుర్తు చేస్తుంది. ఇటువంటి పోరాటాలను కలుపుకొని, ప్రజల్లో కుతకుతమంటున్న ఆగ్రహం, ఆకాంక్షలు, వీడిపోయిన భ్రమలను ఉపయోగించుకొని, న్యాయం కోసం చేసే డిమాండ్‌లను విస్తృత పరచి, ప్రజాస్వామ్యం కోసం ఉమ్మడి పోరాటాన్ని బలోపేతం చేయడమే ఇండియా కూటమి ఎదుట ఉన్న సవాలు.
ప్రతిపక్షాన్ని పునరుత్తేజపరచటం
సమాన పౌరసత్వంకోసం ప్రచారం, చారిత్రక రైతుల ఉద్యమం అనే రెండు వరుస శక్తిమంతమైన పోరాటాల ప్రభావం, భారత్‌ జోడో యాత్ర సందేశం, బిజెపికి 2020లో బిహార్‌లో తృటిలో తప్పిన ఓటమి, పశ్చిమ బెంగాల్‌(2021), కర్నాటక (2023)లో పరాజయాలు వంటి వరుస ఎన్నికల ఫలితాలు.. 2023లో ఇండియా కూటమి ఆవిర్భావానికి ఆదర్శవంతమైన నేపథ్యాన్ని సృష్టించాయి. జనతాదళ్‌ (యునైటెడ్‌), రాష్ట్రీయ లోక్‌దళ్‌ బైటికి వెళ్ళిపోయినప్పటికీ, పశ్చిమ బెంగాల్‌, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాలలో ఎన్నికల సమన్వయం లేకపోయినప్పటికీ 2024లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎను ఇండియా కూటమి దాదాపు ఓటమి అంచులకు తీసుకెళ్ళింది. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కొంతవరకు బిహార్‌ ఫలితాలు ఇండియా కూటమి సామర్థ్యాన్ని చాటిచెప్పటమే కాకుండా కాంగ్రెస్‌ సంఖ్యను 100 సీట్లకు, కూటమి మొత్తం బలాన్ని 234కు పెంచాయి.
నాటినుంచి 2024లో మహారాష్ట్ర, హర్యానాలలో ఓటములతో మొదలై, 2025లో ఢిల్లీలో పరాజయంతో ఎన్నికల ఎదురుదెబ్బలు ఇండియా కూటమి శక్తిని, ప్రభావాన్ని క్షీణింపజేశాయి. ఈ తిరోగమనాలు, బహుముఖ ఎన్నికల మోసాలు భారత ఎన్నికల ప్రజాస్వామ్యం అవశేషాల పై బిజెపి పట్టును మరింత బిగించాయి. ఇండియా కూటమికి కచ్చితంగా కొత్త ఊపు, సమూల మార్పు అవసరం. దీనికి కాంగ్రెస్‌ పునరుత్తేజీకరణతో పాటు, పరస్పర మర్యాద, విశ్వాసం ఉండేలా చూడటం, వైవిధ్య చరిత్రలు, సైద్ధాంతిక ధోరణులు కలిగిన పార్టీలను సర్దుబాటు చేసుకునే విస్తృత ఇండియా వేదిక కోసం దోహదకారిగా రాహుల్‌గాంధీ కీలకమైన రెండు పాత్రలను పోషించాలి. భారతదేశం ఒక దేశంగా భిన్నత్వంలో ఏకత్వం ఆధారంగా లేదా దాని ద్వారానే ఎదిగినప్పుడు, ఒక రాజకీయ కూటమిగా ‘ఇండియా’కు ఇదే సూత్రం వర్తిస్తుంది.
సౌజన్యంః ‘ది హిందూ’ దినపత్రిక, (15.6.2026)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *