అతిగా ఆలోచించే జబ్బు ‘రుమినిజం’
Rumination: A Cycle of Negative Thinking
మానవ మనస్సు అత్యంత సంక్లిష్టమైనది. కొన్నిసార్లు ఆలోచనలు మన నియంత్రణలో లేకుండా ఒకే విషయాన్ని పదే పదే తిప్పుతూ ఉంటాయి. దీనినే మానసిక శాస్త్రంలో రుమినిజం లేదా అతిగా నెమరువేయడం అంటారు. పశువులు ఆహారాన్ని తిన్న తర్వాత మళ్లీ నోట్లోకి తెచ్చుకుని నమలడాన్ని ’నెమరువేయడం’ అంటారు. సరిగ్గా అదే విధంగా, ఒక వ్యక్తి తన మనస్సులోని ప్రతికూల ఆలోచనలను, గతంలో జరిగిన చేదు అనుభవాలను లేదా భవిష్యత్తు గురించిన ఆందోళనలను పదే పదే తలచుకుంటూ ఆ ఆలోచనల వలయంలో చిక్కుకుపోవడాన్ని మానసిక రుమినిజం అని పిలుస్తారు. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, తీవ్రమైన మానసిక రుగ్మతలకు దారితీసే ఒక మానసిక ప్రవర్తన.
రుమినిజం అనేది సాధారణ ఆలోచన కంటే భిన్నమైనది. ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ఆలోచించడం వేరు, కేవలం ఆ సమస్య ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ బాధపడటం వేరు. రుమినిజంలో వ్యక్తి సమస్య పరిష్కారం వైపు కాకుండా, సమస్య తీవ్రత వైపు మాత్రమే దృష్టి పెడతాడు. ఈ రుగ్మతతో బాధపడేవారు గతంలో తాము చేసిన తప్పులను, ఇతరులు తమకు చేసిన అన్యాయాలను పదే పదే గుర్తుచేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మెదడులో నిరంతరం ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఫలితంగా, వ్యక్తి మానసికంగా మరింత కుంగిపోతాడు. ఇది ఒక విషవలయంలాంటిది. ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంతగా బాధ పెరుగుతుంది, ఆ బాధ మళ్లీ మరిన్ని ప్రతికూల ఆలోచనలకు దారితీస్తుంది.
రుమినిజం ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయి. వ్యక్తిత్వ లోపాలు,అధిక సున్నితత్వం,గతంలో అనుభవించిన తీవ్రమైన మానసిక గాయాలు, ఆత్మవిశ్వాస లోపం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఆధునిక కాలంలో ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా దీనిని పెంచుతోంది. ఈ రుగ్మత యొక్క ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి.నిరంతరం ప్రతికూల ఆలోచనలు చేయడం వల్ల వ్యక్తి క్రమంగా డిప్రెషన్‌లోకి జారుకుంటాడు. భవిష్యత్తు గురించి ఊహాజనిత భయాలు పెరిగిపోయి తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. ఒక చిన్న విషయాన్ని కూడా విశ్లేషించలేక, ఏ నిర్ణయమూ తీసుకోలేక నిద్రలేమి,తలనొప్పి, అలసట, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
రుమినిజం అనేది మౌనంగా మనశ్శాంతిని హరించే ఒక మానసిక రుగ్మత. ఒక వ్యక్తి తన ఆలోచనల స్వభావాన్ని స్వయంగా గమనించడం ద్వారానే దీనిని గుర్తించగలడు. ప్రతికూల ఆలోచనల వలయం నుండి బయటపడటానికి సంకల్పం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఎంతైనా అవసరం. అవసరమైతే సంకోచించకుం డా మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని తిరిగి పొందవచ్చు.
సుధాకర్ ఎవి.