Skip to content
ప్రపంచం వార్తలు

Iran-US War: నాగరికత తెలియని మూర్ఖులు మీరు.. అమెరికా మీద విరుచుకుపడిన ఇరాన్..

Prajapaksham 06 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Iran-US War: నాగరికత తెలియని మూర్ఖులు మీరు.. అమెరికా మీద విరుచుకుపడిన ఇరాన్..

Iran-US War: నాగరికత తెలియని మూర్ఖులు మీరు.. అమెరికా మీద విరుచుకుపడిన ఇరాన్..

Iran-US War: అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్ మీద సాగించిన యుద్ధంలో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల సందర్భంగా రాజధాని టెహ్రాన్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టెహ్రాన్‌లోని ప్రసిద్ధ ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మందిరం వేదికగా ఇరాన్ అగ్రశ్రేణి రాజకీయ, సైనిక నాయకత్వం సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చింది.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు మరణించిన సంగతి విదితమే. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం కారణంగా గత నాలుగు నెలల పాటు ఆలస్యమైన ఖమేనీ అంత్యక్రియల యాత్రను ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు ఒక వారం పాటు అధికారికంగా అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తోంది.

ఈ అంత్యక్రియల ప్రార్థనలు పూర్తిగా రాజకీయ రంగును సంతరించుకున్నాయి. లక్షలాది మంది ప్రజలు తెల్లవారుజామునే ప్రార్థనా స్థలానికి చేరుకుని.. ఇరాన్ జాతీయ జెండాలతో పాటు ప్రతీకారానికి చిహ్నంగా భావించే ఎరుపు రంగు జెండాలను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చాలంటూ రాసిన పోస్టర్లు అక్కడ భారీగా వెలిశాయి.

ఈ సందర్భంగా వేదికపై ఉన్న ప్రముఖ కవి మహ్మద్ రసూలీ మైకులో ప్రసంగిస్తూ.. ఇకపై కఫనమే తమ వస్త్రమని, ట్రంప్‌ను మట్టుబెట్టడం తమ తక్షణ బాధ్యత అని పిలుపునిచ్చారు. ప్రార్థనలకు వచ్చిన ఘోలామ్రేజా సాబూని అనే సాధారణ పౌరుడు కూడాజజ తమ ఇమామ్‌ను చంపిన ట్రంప్‌ను వదిలిపెట్టేది లేదని వ్యాఖ్యానించాడు. మరోవైపు అర్మేనియాలో ఇరాన్ రాయబారి ఖలీల్ షిర్‌ఘోలామి ఈ ఘటనపై ఎక్స్‌లో స్పందిస్తూ.. శత్రువులు మనుషులను చంపగలరు కానీ ఆదర్శాలను కాదని.. అయాతొల్లా ఖమేనీని చంపి వారు ఒక పరిమళాల సీసాను పగలగొట్టారని, ఆ సువాసన ఇప్పుడు అంతటా వ్యాపించిందని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ నుంచి తీవ్ర ప్రాణాపాయ బెదిరింపులు ఉన్నప్పటికీ ఇరాన్ అగ్రనేతలు ఈ వేడుకకు హాజరై తమ ఐక్యతను చాటారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ ఖలీబాఫ్, కుద్స్ ఫోర్స్ అధిపతి ఇస్మాయిల్ ఖానీ, రివల్యూషనరీ గార్డ్ హెడ్ జనరల్ అహ్మద్ వాహిదీలతో పాటు ఖమేనీ కుమారులు మసౌద్, మేసమ్, ముస్తఫాలు చాలా కాలం తర్వాత ఇక్కడ కనిపించారు.

అయితే, ఆ దాడుల్లో గాయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు భావిస్తున్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇజ్రాయెల్ గతంలో ఇలాంటి బహిరంగ కార్యక్రమాలను బట్టి నేతల లోకేషన్లను కనిపెట్టి దాడులు చేసిన దాఖలాలు ఉండటమే ఆయన రాకపోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

97 ఏళ్ల ప్రముఖ షియా మతగురువు అయాతొల్లా జాఫర్ శోభాని నేతృత్వంలో ఈ అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయి. ప్రధాన వేదికపై ఖమేనీ శవపేటికతో పాటు ఆ దాడిలో మరణించిన ఆయన కోడలు జహ్రా హద్దాద్ అడెల్, 14 నెలల వయసున్న మనవరాలు జహ్రా మొహమ్మది గొల్పాయిగాని శవపేటికలను కూడా గాజు కవచాల కింద ఉంచారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాన్, ఇరాక్‌లోని వివిధ పవిత్ర నగరాల్లో ఊరేగించిన తర్వాత.. గురువారం ఆయన జన్మస్థలమైన మషాద్‌లోని ప్రసిద్ధ ఇమామ్ రెజా బలిపీఠం వద్ద అధికారిక లాంఛనాలతో ఖననం చేయనున్నారు.

ట్రంప్ వన్ షాట్ వ్యాఖ్యలపై విరుచుకుపడిన ఇరాన్..

ఇరాన్ దివంగత సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేడుకలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఖమేనీ పార్థివ దేహాన్ని చూసి ఇరాన్ ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించడంపై స్పందిస్తూ.. అవి ‘దొంగ ఏడుపులు (నకిలీ కన్నీళ్లు) కావచ్చు’ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాకు అసలు నాగరికత, చరిత్రే లేవంటూ ఇరాన్ రాయబార కార్యాలయం అత్యంత ఘాటుగా బదులిచ్చింది.

ఒక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఖమేనీ అంత్యక్రియలకు లక్షలాది మంది జనం తరలిరావడం తనకు తీవ్ర ఆశ్చర్యం కలిగించిందన్నారు. అక్కడి ప్రజలు ఖమేనీని తీవ్రంగా ద్వేషిస్తారని తాను భావించానని, కానీ ఇప్పుడు టెహ్రాన్ వీధుల్లో కనిపిస్తున్నదంతా కేవలం నకిలీ శోకం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఇరాన్ ఉన్నత స్థాయి రాజకీయ, సైనిక నాయకత్వం మొత్తం ప్రస్తుతం అంత్యక్రియల వేదికగా ఒకేచోట ఉందని, అమెరికా అనుకుంటే వారిని ఒక్క దెబ్బతో లేపేయగలదని హెచ్చరించారు. అయితే ఆ తర్వాత తమతో చర్చలు జరపడానికి ఇరాన్ వైపు ఎవరూ మిగలరనే ఉద్దేశంతోనే తాము ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

ట్రంప్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై అర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మీరు శారీరకంగా వ్యక్తులను చంపగలరు, కానీ వారి ఆశయాలను ఎప్పటికీ చంపలేరు. మీరు అయతొల్లా ఖమేనీని చంపడం ద్వారా ఒక సుగంధ ద్రవ్యాల (పరిమళాల) సీసాని పగులగొట్టారు. దానివల్ల ఆ సువాసన ఇప్పుడు ప్రతిచోటా వ్యాపించింది. ఆ సువాసనను మీరు ఏమాత్రం పగులగొట్టలేరని ఇరాన్ పేర్కొంది. ఇదే సమయంలో అమెరికాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆ దేశానికి కనీస నాగరికత, చరిత్ర, ఎదుటివారికి ఇచ్చే గౌరవం కూడా లేవని ఎండగట్టింది.

ట్యాగ్‌లు: Donald Trump Iran Iran-US War

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *