Bajrang Bagra: అయోధ్య ట్రస్ట్ కొత్త ప్రధాన కార్యదర్శిగా బజరంగ్ బాగ్రా.. ఎవరీ చార్టర్డ్ అకౌంటెంట్..
అయోధ్య ట్రస్ట్ కొత్త ప్రధాన కార్యదర్శిగా బజరంగ్ బాగ్రా
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల దుర్వినియోగం వివాదం నేపథ్యంలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్ సమర్పించిన రాజీనామాను సోమవారం (జూలై 6, 2026) అధికారికంగా ట్రస్ట్ ఆమోదించింది. ఆయన స్థానంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ బాగ్రాను నూతన ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియమించింది.
అయోధ్యలో అత్యవసరంగా సమావేశమైన శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆలయ విరాళాల లెక్కింపు, నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ఉత్తర ప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్న తరుణంలో ఈ నాయకత్వ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎవరు ఈ బజరంగ్ బాగ్రా?
నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న బజరంగ్ బాగ్రాకు కార్పొరేట్ నిర్వహణలో.. ఆర్థిక వ్యవహారాల్లో, వీహెచ్‌పీ సంస్థాగత నిర్మాణంలో దశాబ్దాల కాలం నాటి సుదీర్ఘ అనుభవం ఉంది. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అయిన బాగ్రా.. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందినవారు. ఆయన 2024 ఫిబ్రవరి నుండి వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.
పూర్తిస్థాయిలో ఆధ్యాత్మిక, సంస్థాగత బాధ్యతల్లోకి రాకముందు బాగ్రా ప్రభుత్వ రంగంలో అత్యున్నత పదవులను నిర్వహించారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్’ (NALCO) కు ఆయన గతంలో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) గా పని చేశారు. అంతకుముందు నాల్కో (NALCO) తో పాటు ‘రైట్స్ లిమిటెడ్’ (RITES) సంస్థల్లో డైరెక్టర్ (ఫైనాన్స్) గా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) గా సేవలు అందించారు. అక్కడ ఆర్థిక నిర్వహణ, కార్పొరేట్ పాలనలో విశేష నైపుణ్యం సంపాదించారు.
నాల్కో సంస్థ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) పొందిన అనంతరం ఆయన విశ్వహిందూ పరిషత్తులో పూర్తి సమయం కేటాయించారు. సంస్థలో సంయుక్త ప్రధాన కార్యదర్శి వంటి పలు కీలక పదవులతో పాటు ‘ఏకల్ అభియాన్’ ప్రాజెక్టుకు ప్రెసిడెంట్, సీఈఓగా కూడా వ్యవహరించారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ట్రస్ట్ ఇమేజ్ దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో, ఒక సీనియర్ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ అయిన బాగ్రా చేతికి నిధుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడం ద్వారా భక్తుల్లో మళ్లీ నమ్మకాన్ని నింపవచ్చని ట్రస్ట్ భావిస్తోంది.