Skip to content
జాతీయం వార్తలు

Heavy Rains Batter Mumbai: ముంబైని వణికిస్తున్న భారీ వర్షాలు..4 రోజుల్లో 13 మంది మృతి.. మహారాష్ట్రకు రెడ్ అలర్ట్..

Prajapaksham 06 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Heavy Rains Batter Mumbai: ముంబైని వణికిస్తున్న భారీ వర్షాలు..4 రోజుల్లో 13 మంది మృతి.. మహారాష్ట్రకు రెడ్ అలర్ట్..

Today Weather

Heavy Rains Batter Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో సోమవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా దైనందిన జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీ నష్టం వాటిల్లింది. మహారాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుండగా.. వర్ష సంబంధిత ప్రమాదాల వల్ల ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ వెల్లడించారు.

ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాల ధాటికి ముంబైలోని మంఖుర్డ్ ప్రాంతంలో మూడు అంతస్తుల చాల్ కూలిపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అటు పూణే జిల్లా మావల్ తహసీల్‌లోని పటాన్ గ్రామంలో తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు శిథిలాల కింద కూరుకుపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు చిక్కుకుపోగా.. ఒకరి మృతదేహాన్ని ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. పూణేకు వెళ్లే దూరప్రాంత రైళ్లతో పాటు, రాయగఢ్ మార్గంలో సబర్బన్ రైలు సర్వీసులు సైతం నిలిచిపోయాయి. ముంబై-గోవా హైవేపై కొండచరియలు విరిగిపడటంతో సుమారు 12 గంటల పాటు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ముంబై, పూణే, థానే, పాల్ఘర్‌లలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రాలయంలోని విపత్తు నియంత్రణ గదిలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించగా.. వర్షాల తీవ్రత కారణంగా మహారాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు కూడా వాయిదా పడ్డాయి. ముంబైకి ‘రెడ్’ అలర్ట్ జారీ కావడంతో, ప్రమాదకరమైన నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని బిల్డర్లు, కాంట్రాక్టర్లను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. అటు థానే నగరంలో బలమైన గాలులకు 110 కి పైగా చెట్లు, బిల్‌బోర్డులు, గోడలు కూలిపోయాయి. పాల్ఘర్ జిల్లాలోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ రేకుల షెడ్లు కొట్టుకుపోయినప్పటికీ, అక్కడి 350 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.

ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో కూడా రాత్రిపూట మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల చంబా, కుల్లు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించి కీలక రహదారులు మూసుకుపోయాయి. చంబా జిల్లాలోని పంగోలా నాలా వద్ద వరద తాకిడికి చంబా-టిస్సా రహదారి, అలాగే కుల్లు జిల్లాలోని పాగల్ నాలా వద్ద లార్జీ-సైంజ్ రహదారి బ్లాక్ అయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా మండి జిల్లా జోగిందర్‌నగర్‌లో 97 మిమీ, కాంగ్రాలో 74.8 మిమీ వర్షపాతం నమోదైంది.

మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ రీజియన్‌లో మేఘ విస్ఫోటనం సంభవించింది. దీనివల్ల ఒక్కసారిగా విరుచుకుపడిన ఆకస్మిక వరదల్లో అనేక వాహనాలతో పాటుగా రోడ్లు కొట్టుకుపోయి, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.