AI Heart Signal: ఈసీజీల్లో ఆకస్మిక గుండెపోటు మరణ రహస్యాన్ని ఛేదించిన ఏఐ.. షాకవుతున్న వైద్యులు..
ఈసీజీల్లో ఆకస్మిక గుండెపోటు మరణ రహస్యాన్ని ఛేదించిన ఏఐ
AI Heart Signal: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న గుండె జబ్బుల గుర్తింపులో కృత్రిమ మేధస్సు (AI) వైద్యుల మెదడుకు అందని అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. సాంప్రదాయ వైద్య పరీక్షల ప్రకారం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని భావించినప్పటికీ.. భవిష్యత్తులో ఆకస్మిక గుండెపోటు (Sudden Cardiac Arrest) తో మరణించే ప్రమాదం ఉన్న వ్యక్తులను ముందే గుర్తించగల ఒక రహస్య సంకేతాన్ని ఏఐ కనుగొంది. దశాబ్ద కాలంగా సేకరించిన లక్షలాది ఈసీజీ (ECG)లు, మరణ ధృవీకరణ పత్రాలను విశ్లేషించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. 2022లో గుండె జబ్బుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 19.8 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో చాలా మరణాలు గుండెపోటు, పక్షవాతం వల్ల జరుగుతున్నప్పటికీ, ఆకస్మిక గుండె మరణం అనేది ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా సంభవిస్తుంది. గుండెలోని విద్యుత్ వ్యవస్థ అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల వచ్చే ఈ ప్రమాదానికి వృద్ధులే కాకుండా, యువ క్రీడాకారులు, ఎలాంటి గుండె జబ్బుల చరిత్ర లేని వారు కూడా బలవుతున్నారు.
ప్రస్తుతం వైద్యులు గుండె పంపింగ్ సామర్థ్యాన్ని కొలిచే ‘లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఎజెక్షన్ ఫ్రాక్షన్’ (LVEF) విధానంపై ఆధారపడుతున్నారు. అయితే ఆకస్మిక గుండెపోటుతో మరణించే చాలా మందిలో ఈ పంపింగ్ పనితీరు సాధారణంగానే ఉండటం వల్ల ప్రస్తుత స్క్రీనింగ్ పద్ధతులు ఈ ముప్పును గుర్తించలేకపోతున్నాయి.
ఈ సవాలును అధిగమించడానికి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (UC) బర్కిలీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ జియాద్ ఓబర్‌మేయర్ నేతృత్వంలోని పరిశోధక బృందం దాదాపు పదేళ్ల పాటు విస్తృతమైన అధ్యయనం చేపట్టింది. స్వీడన్‌కు చెందిన 4,40,000 కంటే ఎక్కువ ఈసీజీ రీడింగులను వారి మరణ ధృవీకరణ పత్రాల డేటాతో అనుసంధానించి.. భవిష్యత్తులో వచ్చే గుండెపోటు సూక్ష్మ నమూనాలను గుర్తించేలా ఏఐకి శిక్షణ ఇచ్చారు. అనంతరం ఈ ఫలితాలను యునైటెడ్ స్టేట్స్, తైవాన్ దేశాల రోగుల డేటాతో సరిపోల్చి ధృవీకరించారు.
ఈ విశ్లేషణలో ఏఐ కేవలం ముప్పును అంచనా వేయడమే కాకుండా.. సాధారణ ఈసీజీ తరంగ నమూనాలలో దాగి ఉన్న, ఇంతవరకు ఏ గుండె వైద్యుడికి (కార్డియాలజిస్ట్) తెలియని ఒక సరికొత్త జీవశాస్త్ర ఆధారిత సంకేతాన్ని వెలికితీసింది. ప్రస్తుతం ఉన్న స్క్రీనింగ్ ప్రమాణాల ప్రకారం ఆకస్మిక గుండెపోటు వార్షిక ప్రమాదం 4.6 శాతంగా ఉంటే.. ఏఐ సాంకేతికత ద్వారా 7 శాతం వరకు అధిక ముప్పు ఉన్న రోగుల సమూహాన్ని ఖచ్చితత్వంతో గుర్తించగలిగారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఏఐ గుర్తించిన వారిలో 86 శాతం కంటే ఎక్కువ మంది రోగులను ప్రస్తుత వైద్య విధానాలు అసలు గుర్తించలేకపోయాయి.
వైద్య ప్రపంచంలో ఎంతో ప్రాణాంతకమైన ఈ సమస్యకు ఇప్పటికే ఇంప్లాంటబుల్ డీఫిబ్రిలేటర్లు (గుండె లయను సరిచేసే చిన్న పరికరాలు) వంటి సమర్థవంతమైన నివారణ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే సమస్య అంతా సమయం మించిపోకముందే ఆ పరికరం ఎవరికి అవసరమో గుర్తించలేకపోవడమేనని ప్రొఫెసర్ ఓబర్‌మేయర్ పేర్కొన్నారు. ఏఐ కనుగొన్న ఈ కొత్త విధానం ద్వారా ముందస్తుగా ప్రాణాపాయాన్ని అంచనా వేసి, బాధితులకు తగిన పరీక్షలు నిర్వహించడం ద్వారా లక్షలాది ఆకస్మిక మరణాలను నివారించే అవకాశం లభిస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.