Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ప్రైవేటు విద్యతో ప్రభుత్వ విద్య పోటీపడాలంటే…

Prajapaksham 01 Aug 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ప్రైవేటు విద్యతో ప్రభుత్వ విద్య పోటీపడాలంటే…

Students

ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీనుంచి సామాన్య ప్రజలను కాపాడటం ఎలా? ప్రభుత్వ విద్యను మౌలికవసతులు, బోధన, ఫలితాల విషయంలో ప్రైవేటు విద్యకు దీటుగా నిలపటం ఎలా? ప్రభుత్వం విద్యపై భారీగా వెచ్చిస్తున్నా, అర్హతగల అధ్యాపకులు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోనే ఉన్నా ప్రభుత్వ విద్య ప్రాథమిక స్థాయినుంచి కాలేజి స్థాయివరకు ఎందుకు కునారిల్లుతున్నది. దీన్ని ఉద్ధరించటం ఎలా? అన్న సమస్య కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను వేధిస్తున్నది. కొన్ని ఆరంభ చర్యలు తీసుకున్నా, ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య లభిస్తుందనీ, తమ పిల్లల భవిష్యత్‌కు భరోసా ఏర్పడుతుందనే విశ్వాసం తల్లిదండ్రుల్లో కలిగించటంలో వైఫల్యం కొనసాగుతున్నది. తెలంగాణలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (విద్యాశాఖ ఆయనే నిర్వహిస్తున్నారు), ఆంధ్రప్రదేశ్‌లో విద్యామంత్రి నారా లోకేశ్‌ నిజంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరంభ ఫలితాలు సాధించారు కూడా. అయితే ప్రభుత్వ విద్య దుస్థితికి కారణాలను లోతుగా అధ్యయనం చేసి, చిత్తశుద్ధితో దిద్దుబాటు చర్యలు తీసుకోనిదే పరిస్థితిని తిరోముఖం పట్టించి ప్రభుత్వ విద్యపట్ల విశ్వాస పునరుద్ధరణ సాధ్యంకాదు. ప్రభుత్వం నియమించిన ఆకునూరి మురళి కమిషన్‌ సిఫారసులు ఈ సందర్భంగా ప్రయోజనకరంగా ఉంటాయి.
దేశంలోకి 1990వ దశకం ఆరంభంలో ఆర్థిక సంస్కరణలతోపాటే విద్యారంగం సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రభుత్వ విధానంగా అమలులోకి వచ్చింది. అప్పటివరకు నిరుద్యోగ విద్యావంతులు జీవనోపాధిగా ట్యుటోరియల్స్‌ పద్ధతిలో చెదురుమదురుగా విద్యాసంస్థలు నడుపుతుండేవారు. ఎప్పుడైతే ప్రభుత్వం ఒక విధానంగా ప్రైవేటు విద్యకు ద్వారాలు బార్లా తెరిచిందో, ఇంగ్లీషు మీడియం ఆకర్షణగా ప్రైవేటు విద్యాసంస్థలు ముందు పట్టణ ప్రాంతాల్లో మొదలై క్రమంగా మండలస్థాయి వరకు వ్యాపించాయి. యూనిఫారాలు, టై, బూట్లు, రవాణాకు బస్సులతో అదొక ఆకర్షణగా తయారైంది. ఆర్థిక స్థోమత కలిగిన స్కూళ్ల యజమానులు 10 వ తరగతిలో మంచి ఫలితాలు సాధించివ్యాపారాన్ని పెంచుకునేందుకై అధిక మొత్తాల చెల్లింపుతో రిటైర్డ్‌, వర్కింగ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలు సంపాదించుకోవటం మొదలైంది. ముమ్మరంగా రుబ్బుడు విద్యతో, వారంవారం పరీక్షలతో మార్కుల ఆర్జనకు పదును పెట్టారు. ఇది ఆర్థికంగా తమకు భారమైనప్పటికీ సామాన్యులు సైతం కడుపుగట్టుకుని తమ పిల్లల్ని కాన్వెంట్‌ బడులకు పంపటం మొదలుపెట్టారు. ప్రభుత్వ స్కూళ్లు ఎస్‌సి, ఎస్‌టి, కొద్దిమంది బిసిలకే పరిమితమై ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య వ్రేళ్లపై లెక్కించదగిన స్థాయికి పడిపోయింది. రెండోవైపున, ప్రపంచీకరణ మోజులో మార్కెట్‌కు అవసరమైన ఇంజనీర్‌ ల తయారీకి ఇంటర్‌ విద్యనుంచి ఇంజనీరింగ్‌ విద్యవరకు ప్రభుత్వాలు ప్రైవేటు కాలేజీలను ప్రోత్సహించాయి. ప్రభుత్వ విద్యను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశాయి. దీనితో ఇంటర్‌ విద్య పూర్తిగా కార్పొరేటీకరణ పొందగా, ప్రధానంగా రాజకీయ నాయకులే వృత్తి విద్య కళాశాలలు నెలకొల్పారు. అవి బతికిబట్టకట్టేందుకు ప్రభుత్వ నాయకత్వం అవసరార్థులకే కాకుండా అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టింది. అది ఏటా పెరుగుతూ తడిసిమోపెడై ప్రభుత్వాలకు మోయలేని భారమైంది. రెండోవైపున, వృత్తివిద్యలో నాణ్యత తగ్గింది. పరిశ్రమలతో అనుసంధానం లేనందున మార్కెట్‌ అవసరాలకు తగిన నైపుణ్యాలు కరవైనాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ విద్య మెరుగుదలకు, ఆకర్షణీయమైన ఫలితాలతో తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు తెచ్చి, పిల్లలను ప్రభుత్వ స్కూళ్లవైపు మళ్లించేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు నిర్మాణం ఒక పద్ధతి ప్రకారం చేబట్టారు. ఈ సంవత్సరం అటువంటి కొన్ని స్కూళ్లలో ‘నో అడ్మిషన్‌’ బోర్డులు పెట్టటం ప్రభుత్వ కృషికి కితాబు. విద్య మెరుగుదల చర్యల్లో మొదటి పార్శ్వం ప్రభుత్వ స్కూలు విద్యను తీర్చిదిద్దటం. నామమాత్రపు విద్యార్థుల సంఖ్యతో స్కూళ్లు నడపటంకన్నా ఒక్కో నియోజకవర్గంలో ఆధునిక వసతులతో స్కూళ్లు ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు మంచి చదువు అందించటం. దీనిపై కొన్ని విమర్శలున్నా తల్లిదండ్రులను, టీచర్లను మోటివేట్‌ చేస్తే ఈ ప్రయోగం హర్షించదగిందే. పాఠశాలనుంచి ఇంటర్‌ కాలేజీలవరకు బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం భోజనం అందించటం మంచి ప్రోత్సాహమేగాని, నాణ్యమైన బోధన, క్రమశిక్షణ అంతకన్నా ముఖ్యం. ఇందుకుగాను ముఖ్యమంత్రి చేస్తున్న మరో ప్రయోగం ఆహ్వానించదగింది. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేసి విదేశాలకు విద్యాయాత్రకు పంపుతున్నారు. ప్రపంచ విద్యారంగంలో వస్తున్న మార్పులను స్వయంగా తిలకించటం వారిని మోటివేట్‌ చేస్తుందని, దానివల్ల విద్యావ్యవస్థ మెరుగవుతుందని ఆయన విశ్వాసం. అలా యాత్రకు వెళ్లి వచ్చిన టీచర్లతో ముఖ్యమంత్రి గురువారం నిర్వహించిన సమావేశంలో
నిర్మొహమాటంగా మాట్లాడారు.
ఉపాధ్యాయులు ఎప్పుడూ తమ కోర్కెలపై ప్రభుత్వంతో కొట్లాడటమేకాదు, విద్యను మెరుగుపరచాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి వారిపై పెట్టారు. ప్రతి మండలంలో టీచర్లు సమావేశాలు జరిపి పాఠశాలల్లో వసతుల మెరుగుదలతోపాటు విద్యార్థులను ప్రభుత్వ స్కూలుకు ఆకర్షించేందుకు తీసుకోవలసిన చర్య లు, హేతుబద్దీకరణ వంటి అంశాలపై డిసెంబర్‌లోగా నివేదికలివ్వాలని కోరారు. వాటిని క్రోడీకరించి వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేందుకు తనకు మూడు మాసాలు సమయం లభిస్తుందన్నారు. ఈ ప్రయత్నం గ్రామీణ విద్యలో ఒక మలుపు కావాలని ఆశించుదాం.