Indian Railways: రైల్వేల్లో భారీ చోరీ.. నాలుగేళ్లలో రూ. 104 కోట్ల బెడ్షీట్లు, తువ్వాళ్లు, దుప్పట్లు మాయం
Indian Railways: రైల్వే ప్రయాణాల్లో మాయమవుతున్న బెడ్షీట్లు, తువ్వాళ్లు, దుప్పట్లు.. నాలుగేళ్లలో రూ. 104 కోట్ల నష్టం
Indian Railways: భారత రైల్వే నుంచి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించే సమయంలో స్టేషన్ రాగానే బెడ్షీట్లు, తువ్వాళ్లు, దుప్పట్లు తమ వెంట ఎత్తుకుని పోతున్నారు. దీనికి సంబంధించి ఇండియన్ రైల్వేకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. భారతీయ రైల్వేలో ప్రయాణించే ఏసీ కోచ్ ప్రయాణికులకు అందించే బెడ్‌రోల్స్‌కు సంబంధించి ఈ ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే ప్రతిరోజూ లక్షలాది బెడ్‌రోల్స్‌ను పంపిణీ చేస్తుండగా.. వాటిలో గణనీయమైన సంఖ్యలో అవన్నీ మాయమవుతున్నట్లు లేదా దొంగిలించబడుతున్నట్లు స్పష్టమైంది. సమాచార హక్కు చట్టం (RTI) కింద అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ ఇచ్చిన సమాధానంలో ఈ షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.
రైళ్లలో ప్రయాణించే వారి కోసం రైల్వే ప్రతిరోజూ సుమారు 8 లక్షల బెడ్‌రోల్ సెట్లను అందిస్తోంది. ఒక పూర్తి సెట్లో సాధారణంగా రెండు బెడ్షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, ఒక దిండు కవర్, ఒక ఫేస్ టవల్ ఉంటాయి. అంటే రైల్వే వ్యవస్థ ప్రతిరోజూ సుమారుగా 16 లక్షల షీట్లు, 8 లక్షల దుప్పట్లు, 8 లక్షల దిండ్లు, 8 లక్షల దిండు కవర్లు, 8 లక్షల ఫేస్ టవల్స్‌ను సిద్ధం చేసి నిర్వహించాల్సి ఉంటుంది.
ఇంత భారీ స్థాయిలో నడిచే ఈ వ్యవస్థలో అన్నింటికంటే ఎక్కువగా చిన్న పరిమాణంలో ఉండే ఫేస్ టవల్స్ మాయమవుతున్నాయి. ప్రయాణికులు పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా వీటిని బ్యాగులలో వేసుకోవడం, లేదా ప్రయాణంలో అవి విపరీతంగా మురికిగా మారి వాడటానికి పనికిరాకుండా పోవడం ఇందుకు కారణాలుగా మారుతున్నాయి. టవల్స్ తర్వాత బెడ్షీట్లు ఎక్కువగా కనిపించకుండా పోతున్నాయి. ఈ దొంగతనాల నేపథ్యంలో థర్డ్ ఏసీ కోచ్‌లలో టవల్స్ ఇవ్వడం నిలిపివేస్తారని లేదా వాటి స్థానంలో పేపర్ టవల్స్‌ను తెస్తారనే ప్రచారం సాగినప్పటికీ.. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని రైల్వే శాఖ తెలిపింది.
ఈ వస్తువుల భద్రత, జవాబుదారీతనం కోసం రైల్వే ఒక ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోంది. ప్రయాణికులు రైలు దిగిన వెంటనే లినెన్ అటెండెంట్ ఈ బెడ్రోల్లన్నింటినీ సేకరిస్తారు. వీటి పంపిణీ, సేకరణ బాధ్యతలు చూసే కాంట్రాక్ట్ ఏజెన్సీయే ఈ సామాను లెక్కలకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. తనిఖీ సమయంలో ఏవైనా వస్తువులు కనిపించకుండా పోతే, వాటి పూర్తి ఖర్చును సదరు ఏజెన్సీ బిల్లుల నుంచే రైల్వే మినహాయిస్తుంది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం లినెన్ దొంగతనాలలో దాదాపు 67 శాతం కేవలం ఏడు జోన్లలోని 10 డివిజన్లలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో బికానెర్, జోధ్‌పూర్, జైపూర్..అలాగే బీహార్ రాష్ట్రంలో సోన్పూర్, దానాపూర్, రాంచీలతో పాటు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బిలాస్పూర్ డివిజన్లలో ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 2022 సంవత్సరం నుండి ఈ కేసులు గణనీయంగా పెరిగాయి. అత్యధికంగా బికానెర్ డివిజన్లో దొంగిలించబడిన వస్తువుల సంఖ్య 2.99 లక్షల నుండి ఏకంగా 12.34 లక్షలకు చేరగా.. బీహార్‌లోని సోన్పూర్ డివిజన్లో ఈ సంఖ్య 36,448 నుండి 3.01 లక్షలకు పెరిగింది. అయితే ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం దొంగతనాల సంఖ్య తగ్గడం కొంత ఉపశమనం కలిగించే అంశం.