Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖపట్నం పేరు.. గందరగోళానికి తెరదించిన IATA

jagan 30 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖపట్నం పేరు.. గందరగోళానికి తెరదించిన IATA

ASR International Airport

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రాంతానికి , విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్‌కు సేవలందించే నూతన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ లొకేషన్ , కేటాయింపులపై ప్రయాణికుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ఆధునికంగా నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, గత ఆగస్టు 17వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో వాణిజ్య విమాన కార్యకలాపాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లు , గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (GDS)లలో విమానాశ్రయం కోడ్ , లొకేషన్ వివరాలపై ఇప్పటివరకు ప్రయాణికుల్లో కొంత అయోమయం కొనసాగుతోంది.

గతంలో విశాఖపట్నం నగరంలో ఐఎన్ఎస్ డేగా (INS Dega) నావికాదళ స్థావరం వద్ద ఉన్న సివిల్ ఎన్‌క్లేవ్ ఎయిర్‌పోర్ట్ నుంచి పౌర విమాన సర్వీసులు నడిచేవి. ఆ విమానాశ్రయానికి ఐఏటీఏ కేటాయించిన అధికారిక కోడ్ ‘VTZ’. భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో పాత ఎయిర్‌పోర్ట్‌ను వాణిజ్య రాకపోకలకు మూసివేసి, ప్రామాణిక ‘VTZ’ కోడ్‌ను భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేశారు. అయితే, ఈ కొత్త విమానాశ్రయం భౌగోళికంగా విశాఖ నగర కేంద్రానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం పరిధిలో ఉన్నప్పటికీ, బుకింగ్ పోర్టళ్లలో కోడ్ ‘VTZ’గా ఉండి నగరం పేరు ‘భోగాపురం’ అని కనిపించడంతో చాలామంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు అయోమయానికి గురవుతున్నారు.

ఈ గందరగోళాన్ని సవరించేందుకు ఐఏటీఏ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐఏటీఏ గ్లోబల్ డేటాబేస్‌లో ఈ విమానాశ్రయం లొకేషన్ సిటీ పేరును ‘భోగాపురం’ నుంచి అధికారికంగా ‘విశాఖపట్నం’గా మారుస్తున్నట్లు వెల్లడించింది. ఈ నూతన మార్పు ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. నవంబర్ 21 నుంచి ఎయిర్‌పోర్ట్ కోడ్ ‘VTZ’గానే కొనసాగుతున్నప్పటికీ, బుకింగ్ వెబ్‌సైట్లలో నగరం పేరు మాత్రం భోగాపురం స్థానంలో ‘విశాఖపట్నం’గా ప్రత్యక్షమవుతుంది. ఐఏటీఏ తీసుకున్న ఈ చర్య వల్ల దేశ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాన్ని సులభంగా గుర్తించి ఎలాంటి సందేహాలు లేకుండా టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలు కలుగుతుందని ప్యాసింజర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.