Mega El Niño: ప్రపంచాన్ని వణికిస్తున్న మెగా ఎల్‌నినో.. పసిఫిక్ సముద్రంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల.. కరువులు, వరదలు, తీవ్ర ఉష్ణోగ్రతల ముప్పు..
Super El Niño Warning: 2027 Could Rewrite Earth's Heat Records
Mega El Niño: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న అసాధారణ వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా గాలాపగోస్ దీవులు, పెరూ తీరానికి సమీపంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి.
కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, తీవ్రరూపం దాల్చుతున్న ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మౌ, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ (ECMWF) డేటా ఆధారంగా రూపొందించిన మ్యాప్‌ను పంచుకుంటూ, ఈ పరిణామాన్ని ‘మెగా ఎల్ నినో’గా అభివర్ణించారు.
అయితే, ఈ అత్యధిక వేడి తూర్పు పసిఫిక్‌లోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి (హాట్‌స్పాట్‌కు) మాత్రమే పరిమితమైందని, మొత్తం పసిఫిక్ మహాసముద్రం 10 డిగ్రీలు వేడెక్కిందని దీని అర్థం కాదని శాస్త్రవేత్తలు స్పష్టతనిచ్చారు. పసిఫిక్ మహాసముద్రపు విస్తృత మధ్య ప్రాంతాల్లో ప్రస్తుతం సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత అక్టోబర్ నెలలోనే పెరూ తీరం , గాలాపగోస్ పశ్చిమ జలాల్లో 6 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల కనిపించినట్లు యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ డేటా ఇప్పటికే వెల్లడించింది.
ఈ ఎల్ నినో గణనీయంగా బలపడిందని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ధ్రువీకరించింది. 1950 నుంచి ఇప్పటివరకు నమోదైన ఎల్ నినో రికార్డులను ఇది అధిగమించే అవకాశం 60 శాతం ఉందని నోవా అంచనా వేస్తోంది. ముఖ్యంగా 1997-98, 2015-16 సంవత్సరాల్లో సంభవించిన అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోల తీవ్రతను కూడా ఇది మించిపోవచ్చని పేర్కొంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, చరిత్రలో నమోదైన అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోలలో ఇది ఒకటిగా నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఈ మెగా ఎల్ నినో ప్రభావం 2027 ప్రారంభం వరకు కొనసాగే అవకాశం ఉందని, దీనివల్ల రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా భూఉష్ణోగ్రతలు మరింత ప్రమాదకర స్థాయికి పెరిగే ముప్పు పొంచి ఉందని డబ్ల్యూఎంవో ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్ నినో సమయంలో ఉష్ణమండల సముద్ర జలాల్లో నిల్వ ఉన్న భారీ వేడి వాతావరణంలోకి విడుదల కావడమే ఈ అసాధారణ ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు.