జైలు గోడల మధ్యా కులగోడలేనా…
జైలు గోడల మధ్యా కులగోడలేనా...
జైలు అంటే నేరం చేసిన వ్యక్తికి చట్టప్రకారం శిక్ష అమలయ్యే ప్రదేశం. నేరం చేసిన వ్యక్తి స్వేచ్ఛను పరిమితం చేయవచ్చు కానీ అతడి మానవ గౌరవాన్ని కాదు. న్యాయస్థానం విధించిన శిక్షకు మించి కులం పేరుతో అదనపు శిక్ష విధించే అధికారం ఎవరికీ లేదు. కానీ దేశంలోని కొన్ని జైళ్లలో కులవివక్ష, అంటరానితనం, వృత్తిపరమైన వివక్ష కొనసాగుతున్నాయన్న వాస్తవం భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తోంది. జైళ్లలో కులవివక్షపై స్పందించని రాష్ట్రాల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడం ఈ వ్యవస్థలోని లోపాలను మరోసారి బయటపెట్టింది.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వపు హక్కును కల్పించింది. కులం, మతం, ప్రాంతం ఆధారంగా వివక్షను నిషేధించింది. అంటరానితనాన్ని పూర్తిగా రద్దు చేసింది. గౌరవప్రదమైన జీవితం ప్రతి మనిషి ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ రాజ్యాంగ సూత్రాలు జైలు గేటు దగ్గరికి వచ్చేసరికి వర్తించవా..? నేరం చేశాడనే కారణంతో ఒక వ్యక్తికి స్వేచ్ఛను నిరాకరించవచ్చు. కానీ అతడి కులం ఆధారంగా పనులు కేటాయించడం, సామాజిక నేపథ్యాన్ని బట్టి వివక్ష చూపడం ఏ న్యాయసూత్రం ప్రకారం సమర్థనీయం..? నేరం వ్యక్తిగతమైనది. కులం జన్మతో ఆపాదించబడిన సామాజిక గుర్తింపు. ఈ రెండింటినీ కలిపి చూడటమే అసలు సమస్య.
2024 అక్టోబర్లో సుకన్య శాంతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయంలో కీలకమైనది. వివిధ రాష్ట్రాల జైలు నిబంధనల్లో ఉన్న కులవివక్షాపూరిత నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించింది. ఖైదీలకు కులం ఆధారంగా పనులు కేటాయించడం, పారిశుద్ధ్య పనులను నిర్దిష్ట వర్గాలకే పరిమితం చేయడం, సామాజిక నేపథ్యం ఆధారంగా ఖైదీలను వేరుచేయడం వంటి పద్ధతులను తప్పుబట్టింది. జైలు నిబంధనల్లో మార్పులు చేసి కులవివక్షకు తావులేకుండా చూడాలని రాష్ట్రాలను ఆదేశించింది. అయినప్పటికీ ఆదేశాల అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం కొనసాగుతుండటం ఆందోళనకరం.
తాజాగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర హోంశాఖ కోరిన సమాచారాన్ని సమర్పించకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలు సమర్పించకపోతే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను వ్యక్తిగతంగా కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని హెచ్చరించింది. 2027 జనవరి 13లోగా నివేదికలు సమర్పించాలని తుది గడువు విధించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన రాజ్యాంగపరమైన ఆదేశాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చిన్న విషయం కాదు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పాలకులు తమ పరిధిలోని సంస్థల్లోనే కొనసాగుతున్న వివక్షను తొలగించడానికి ఎందుకు చొరవ చూపడం లేదన్నది ప్రశ్న.
ఖైదీలకు పనులు కేటాయించే విధానం, వంటశాలలు, పారిశుద్ధ్య నిర్వహణ, బ్యారక్లలో నివాస ఏర్పాట్లు, అధికారుల ప్రవర్తన.. ప్రతి అంశంలోనూ వివక్షకు తావులేకుండా చూడాలి. జైళ్లలో కులవివక్షపై స్వతంత్ర పర్యవేక్షణ ఉండాలి. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వివక్షకు పాల్పడే అధికారులపై బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలి.
నిజానికి జైళ్లలో కులవివక్ష అనేది జైలు వ్యవస్థకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. సమాజంలో పాతుకుపోయిన కులాధిపత్య భావజాలం ప్రభుత్వ సంస్థల్లోకి ఎలా చొరబడుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నేరం చేసినవారు చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. అదే సమయంలో వారికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కూడా కొనసాగాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన అంశం కాదు. అది రాజ్యాంగబద్ధమైన బాధ్యత. జైళ్లలో వాస్తవ పరిస్థితులను సమీక్షించి, వివక్షకు కారణమవుతున్న విధానాలను పూర్తిగా తొలగించాలి. ఈ విషయంలో న్యాయస్థానం పర్యవేక్షణ కూడా నిరంతరం కొనసాగాలి. జైలు గోడల మధ్య కులగోడలు కూలినప్పుడే రాజ్యాంగ సమానత్వానికి నిజమైన అర్థం లభిస్తుంది.