వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో 10+2 విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా చర్చించారు. విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మార్పుల వల్ల ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. 12వ తరగతి తర్వాత విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే నైపుణ్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యగా పరిగణించి, విద్యార్థుల అవసరాలు, ఆసక్తులకు అనుగుణంగా ప్రత్యేక విద్య (Specialised Education) అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇందుకు అనుగుణంగా పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.