మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఎన్నికల చోరీ
మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఎన్నికల చోరీ
గోకుల్ డెయిరీ చైర్మన్‌గా రాజేశ్ పాటిల్ ఎన్నిక.. అప్రజాస్వామిక పద్ధతిలో పదవిని దక్కించుకున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో అత్యంత వివాదాస్పదంగా మారిన గోకుల్ డెయిరీ చైర్మన్ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించింది. ఎన్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాజేశ్ పాటిల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార కూటమి ఓట్ల చోరీకి పాల్పడిందని, ప్రజాస్వామ్య విరుద్ధంగా పదవిని దక్కించుకుందని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.
రాజేశ్ పాటిల్‌కు 16 ఓట్లు వచ్చినట్లు బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ధనంజయ్ మహాదిక్ మీడియాకు వెల్లడించారు. చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం రాజేశ్ పాటిల్ మాట్లాడుతూ.. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి మొత్తం 25 మంది డైరెక్టర్లు, నలుగురు ప్రభుత్వ ప్రతినిధులు, ఇద్దరు కో-ఆప్టెడ్ డైరెక్టర్లతో కలిసి పనిచేస్తానని తెలిపారు.
తన ఏడాది పదవీకాలంలో పాడి రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు సహకార వ్యవస్థను, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. గత ఏడాది కాలంగా సహకార సంస్థ ఎదుర్కొంటున్న నష్టాలను రికవరీల ద్వారా భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. రాజకీయాలు, విభేదాలను పక్కనపెట్టి పాడి రైతుల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో గోకుల్ డెయిరీ వార్షిక సమావేశం జరగనుందని వెల్లడించారు.
మరోవైపు ఎన్నికల్లో ఓటమి చెందిన ‘రాజర్షి షాహు షేత్కరీ సంవిచారి అఘాడీ’ అభ్యర్థి శశికాంత్ ఛుయేకర్ తీవ్రంగా స్పందించారు. మహాయుతి కూటమి అప్రజాస్వామిక, అక్రమ పద్ధతుల ద్వారా చైర్మన్ పదవిని స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై వారికి నమ్మకం లేదని, బలం, అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు.
మెజార్టీ ఉన్నా కాంగ్రెస్‌కు దక్కని చైర్మన్ పదవి
అక్టోబర్ 19న గోకుల్ డెయిరీ పాలకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలను గెలుచుకుని స్వల్ప మెజార్టీ సాధించింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 12 స్థానాలకే పరిమితమైంది. అయితే పాలకవర్గంలో మెజార్టీ సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవి దక్కలేదు.
ప్రభుత్వం ఐదుగురు ప్రతినిధులను నామినేట్ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. వీరిలో నలుగురికి డైరెక్టర్ల బోర్డులో ఓటు హక్కు కల్పించింది. ఈ నిర్ణయం ద్వారా మహాయుతి కూటమికి చైర్మన్ ఎన్నికల్లో ఆధిక్యం లభించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుల మెజార్టీని పక్కనపెట్టి అధికార కూటమి పదవిని దక్కించుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
రాజేశ్ పాటిల్‌కు ఎన్నికల్లో గెలిచిన 12 మంది డైరెక్టర్ల ఓట్లతోపాటు ప్రభుత్వం నామినేట్ చేసిన నలుగురు ప్రతినిధుల ఓట్లు కూడా లభించాయి. దీంతో ఆయనకు మొత్తం 16 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ ఛుయేకర్కు ఎన్నికల్లో గెలిచిన సభ్యుల నుంచి 13 ఓట్లు లభించాయి.
హైకోర్టు నిర్ణయంతో ఎన్నికకు మార్గం
ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటం కూడా జరిగింది. గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ అమలును నిలిపివేయాలని కోరగా, సోమవారం బాంబే హైకోర్టు అందుకు నిరాకరించింది. అయితే నామినేటెడ్ ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొనవచ్చని, వారి కోసం ప్రత్యేక బ్యాలెట్ బాక్సును ఏర్పాటు చేయాలని ఔరంగాబాద్‌లోని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీంతో మంగళవారం జరిగిన చైర్మన్ ఎన్నికల్లో రాజేశ్ పాటిల్ విజయం సాధించారు.
పాడి రైతుల ఆగ్రహం.. భారీ ర్యాలీ
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొల్హాపూర్‌లో పాడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరించిందని, అక్రమ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం వేలాది మంది పాడి రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. సహకార ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభుత్వం పట్టపగలే దాడి చేసిందని విమర్శించారు.
ప్రతిపక్ష నాయకులు, డెయిరీ రైతుల నుంచి కాంగ్రెస్‌కు భారీ మద్దతు లభించినప్పటికీ, అధికార బలంతో మహాయుతి కూటమి చైర్మన్ పదవిని దక్కించుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
మహాయుతి నిర్ణయాన్ని సమర్థించిన మంత్రి
గోకుల్ డెయిరీ చైర్మన్‌గా ఎన్నికైన రాజేశ్ పాటిల్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధుల నియామకాన్ని ఆయన సమర్థించారు. ఈ నియామకాల వల్ల డెయిరీ పాలకవర్గ సమావేశాల్లో కోరం సమస్య తలెత్తకుండా ఉంటుందని పేర్కొన్నారు.
గతంలో కోరం లేక సమావేశాలు నిర్వహించలేని పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు నామినేటెడ్ సభ్యుల నియామకంతో ఆ సమస్య తొలగిపోయిందని రాజ్యసభ సభ్యుడు ధనంజయ్ మహాదిక్ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేలకు దక్కుతుందని ఆయన అన్నారు.
గోకుల్ డెయిరీ చైర్మన్ పదవిని మహాయుతి కూటమి పార్టీల మధ్య వంతులవారీగా నిర్వహించే విధంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.