Skip to content
Uncategorized › వార్తలు

ఉన్నత విద్యలో కుల వివక్షకు అడ్డుకట్ట ఎప్పుడు?

Prajapaksham 07 Nov 2026 0 నిమిషాల పఠనం Uncategorized
ఉన్నత విద్యలో కుల వివక్షకు అడ్డుకట్ట ఎప్పుడు?

TGPSC Exams: నిరుద్యోగులకు అలర్ట్...అసిస్టెంట్ సైంటిస్ట్, ఏఈఈ, డీఈఓ తదితర పరీక్షల తేదీలు విడుదల...ఇక్కడ చెక్ చేసుకోండి..

భారతదేశంలో విద్యాసంస్థలు జ్ఞానాన్ని అందించే కేంద్రాలు. అంతేకాదు,సామాజిక మార్పుకు, సమానత్వానికి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పునాదులుగా నిలవాల్సిన ప్రదేశాలు. కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత వాటిపై ఉంది. అయితే, రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష పూర్తిగా తొలగిపోలేదన్నది చేదు నిజం. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల్లో కుల ఆధారిత వివక్షను అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) తీసుకొచ్చిన తాజా నిబంధనలపై నెలకొన్న వివాదం, కేంద్ర ప్రభుత్వం వాటిపై పునరాలోచన చేయాలన్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా, యుజిసి ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ ప్రోత్సాహానికి సంబంధించిన నిబంధనలను పునఃసమీక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనానికి తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిబంధనలను పునఃసమీక్షించడమా, లేక వాటి అసలు లక్ష్యమైన కుల వివక్ష నిర్మూలనను నీరుగార్చడమా? అన్నది ప్రధాన ప్రశ్న. ఈ ఏడాది జనవరిలో నోటిఫై చేసిన యుజిసి నిబంధనల్లో, ప్రతి ఉన్నత విద్యాసంస్థలో సమాన అవకాశాల కేంద్రం, ఈక్విటీ కమిటీ, ఈక్విటీ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయడం, విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 24 గంటల ఈక్విటీ హెల్ప్‌లైన్‌ను అందుబాటులో ఉంచడం, ఈక్విటీ అంబాసిడర్లను నియమించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. నిబంధనలను అమలు చేయని విద్యాసంస్థలపై యుజిసి చర్యలు తీసుకోవడంతోపాటు నిధులు, ఇతర ప్రయోజనాలను నిలిపివేసే అవకాశం కూడా కల్పించారు. విద్యార్థులు కుల వివక్షకు గురికాకుండా చూడటం, బాధితులకు ఫిర్యాదు చేసే వేదికను కల్పించడం, విద్యాసంస్థలను జవాబుదారీగా మార్చడం వీటి ప్రధాన ఉద్దేశంగా కేంద్రం ప్రకటించింది. అయితే, ఈ నిబంధనలపై అగ్రవర్ణాలకు చెందిన కొందరు విద్యార్థులు, సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వీటివల్ల జనరల్‌ కేటగిరీ విద్యార్థులు అనవసర వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని, క్యాంపస్‌లలో కుల విభజనలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు వాదించారు.
మరోవైపు, దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పనిచేసే సంఘాలు మాత్రం ఈ నిబంధనలు కూడా సరిపోవని అభిప్రాయపడుతున్నాయి. కుల వివక్షకు గురైన విద్యార్థులకు నిజమైన న్యాయం జరగాలంటే మరింత పటిష్టమైన రక్షణ వ్యవస్థ అవసరమని కోరుతున్నాయి. ఈ రెండు వాదనల మధ్య కేంద్ర ప్రభుత్వం నిబంధనలను ఉపసంహరించుకోవడం, ఇప్పుడు వాటిపై పునరాలోచనకు సిద్ధపడటం అనేక
సందేహాలకు తావిస్తోంది.
వాస్తవానికి భారతీయ సమాజంలో కుల వివక్ష అనేది కేవలం సామాజిక సంబంధాలకు మాత్రమే పరిమితం కాలేదు. అది విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాలు, వ్యక్తిగత గౌరవం వంటి అనేక అంశాలను సైతం ప్రభావితం చేస్తోంది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందినంత మాత్రాన అణగారిన వర్గాల విద్యార్థులకు సమానమైన వాతావరణం లభిస్తోందని చెప్పలేం. తరగతి గదుల్లో అవమానకర వ్యాఖ్యలు, కులపరమైన వివక్ష, వసతి గృహాల్లో అసమాన ప్రవర్తన, అధ్యాపకుల పక్షపాత ధోరణి, సహ విద్యార్థుల నుంచి ఎదురయ్యే అవహేళనలు వంటి సమస్యలు విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా గ్రామీణ, పేద కుటుంబాల నుంచి వచ్చిన మొదటి తరం విద్యార్థులు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారి చదువుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి కుల వివక్షను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయడం అనవసర చర్య కాదు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును ఆచరణలోకి తీసుకురావడానికి అత్యవసరం. అదే సమయంలో జనరల్‌ కేటగిరీ విద్యార్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను కూడా పూర్తిగా తోసిపుచ్చడం ప్రజాస్వామ్యబద్ధమైన విధానం కాదు. ఏ చట్టం లేదా నిబంధన అయినా నిర్దోషులను అన్యాయంగా వేధించడానికి సాధనంగా మారకూడదు. కుల వివక్షపై వచ్చే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా విచారించాలి. తప్పుడు ఫిర్యాదులకు అవకాశం లేకుండా స్పష్టమైన విచారణ విధానం, ఆధారాల పరిశీలన, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమ వాదన వినిపించే అవకాశం ఉండాలి. అయితే తప్పుడు ఫిర్యాదుల భయాన్ని చూపించి నిజమైన బాధితులకు రక్షణ కల్పించే వ్యవస్థను బలహీనపరచడం కూడా అంతే ప్రమాదకరం. ఒక వర్గం ఆందోళనలను పరిష్కరించే పేరుతో మరో వర్గం హక్కులను దెబ్బతీయకూడదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ బాధ్యత అత్యంత కీలకమైనది. యుజిసి నిబంధనలను రూపొందించే సమయంలో అన్ని వర్గా ల విద్యార్థులు, విద్యావేత్తలు, సామాజిక న్యాయ నిపుణులు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి ఉండాల్సింది. నిబంధనల అమలులో ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. ఒకవైపు కుల వివక్ష నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూ, మరోవైపు నిరసనల ఒత్తిడితో నిబంధనలను వెనక్కి తీసుకోవడం ప్రభుత్వ విధాన స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది.
సామాజిక న్యాయం విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయ ఒత్తిళ్లకు కాకుండా రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉండాలి. ప్రస్తుతం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కమిటీ కేవలం నిబంధనల్లోని పదజాలాన్ని మార్చే పనికే పరిమితం కాకూడదు. విద్యాసంస్థల్లో కుల వివక్ష ఏ రూపాల్లో కొనసాగుతోంది? బాధితులు ఫిర్యాదు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఇప్పటికే ఉన్న ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు ఎందుకు సమర్థంగా పనిచేయడం లేదు? బాధితులకు న్యాయం అందించడంలో ఎదురవుతున్న అడ్డంకులేమిటి? అనే అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. కమిటీలో అణగారిన వర్గాల ప్రతినిధులకు, విద్యార్థి సంఘాలకు, స్వతంత్ర సామాజిక న్యాయ నిపుణులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. విచారణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఫిర్యాదుల పరిష్కారానికి కాలపరిమితి, అప్పీల్‌ అవకాశం, బాధితుల గోప్యత, ప్రతీకార చర్యల నుంచి రక్షణ వంటి అంశాలకు చట్టబద్ధమైన ప్రాధాన్యతనివ్వాలి. కేవలం కమిటీలు, హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసినంత మాత్రాన కుల వివక్ష అంతరించిపోదు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిపాలనా సిబ్బందిలో రాజ్యాంగ విలువలు, మానవ హక్కులు, సమానత్వ భావనపై అవగాహన పెంచాలి. విద్యాసంస్థల్లో సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించాలి. కులపరమైన వివక్షకు పాల్పడేవారిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో నిరాధార ఆరోపణలతో ఎవరికీ అన్యాయం జరగకుండా తగిన రక్షణ కల్పించాలి. ప్రతి విద్యార్థి ఎలాంటి భయం, అవమానం, వివక్ష లేకుండా చదువుకునే వాతావరణాన్ని నిర్మించాలి. సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో కేంద్రం చేపట్టే పునఃసమీక్ష సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సాగాలి. విద్యాసంస్థ లు కుల గోడలను నిర్మించే కేంద్రాలుగా కాకుండా, వాటిని కూల్చివేసే జ్ఞాన మందిరాలుగా మారినప్పుడే రాజ్యాంగం ఆశించిన సమానత్వ భారతం సాకారమవుతుంది.