Skip to content
బిజినెస్ › వార్తలు

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్‌పై రూ.15 నుంచి రూ.75 వరకు తగ్గే అవకాశం..

jagan 06 Nov 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్‌పై రూ.15 నుంచి రూ.75 వరకు తగ్గే అవకాశం..

Indian Railways

Indian Railways: భారతీయ రైల్వే శాఖ 2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రముఖ రైళ్లకు వర్గీకరణ మార్పులు చేపట్టనుంది. ఈ నిర్ణయంలో భాగంగా మహానగరి, ప్రగతి, తులసి, సప్త క్రాంతి వంటి ప్రజాదరణ పొందిన రైళ్లకు ఉన్న ‘సూపర్‌ఫాస్ట్’ హోదాను తొలగించి.. వాటిని సాధారణ ‘ఎక్స్‌ప్రెస్’ రైళ్లుగా నడపనున్నారు.

రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం సూపర్‌ఫాస్ట్ హోదా కలిగి ఉన్న రైలు తన పూర్తి ప్రయాణంలో గంటకు కనీసం 55 కిలోమీటర్ల సగటు వేగాన్ని అందుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవలి సమీక్షలో అదనపు స్టాపులు పెరగడం, ట్రాక్ రద్దీ , కొన్ని మార్గాల్లో సింగిల్ లైన్లు ఉండటం వల్ల ఈ రైళ్లు నిర్దేశిత సగటు వేగాన్ని అందుకోలేకపోతున్నాయని స్పష్టమైంది. అందుకే సదరు ప్రమాణాలు అందుకోని రైళ్ల వర్గీకరణను సాధారణ ఎక్స్‌ప్రెస్ కేటగిరీకి మారుస్తున్నారు.

ఈ మార్పు వల్ల ప్రయాణికులకు టికెట్ ధరల్లో స్పష్టమైన ఊరట లభించనుంది. సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్ మినహాయింపు లభించడం వల్ల రెండో తరగతికి ₹15, స్లీపర్ క్లాస్‌కు ₹30, ఏసీ చైర్ కార్/3-టైర్/2-టైర్ తరగతులకు రూ. 45 , ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ.75 వరకు ఛార్జీలు తగ్గనున్నాయి. హోదా మార్పు వల్ల రైళ్ల ప్రయాణ సమయం లేదా వేగంలో పెద్దగా తేడా ఉండదు గానీ, ’12xxx/22xxx’ తో ప్రారంభమయ్యే వాటి రైలు నంబర్లు సాధారణ ఎక్స్‌ప్రెస్ సిరీస్‌కు (’11xxx/15xxx’) మారతాయి. జనవరి ప్రయాణాల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) లో టికెట్లు బుక్ చేసుకునే ముందు ప్రయాణికులు మారిన నంబర్లు , సవరించిన ధరలను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.