Telangana Urban Projects: తెలంగాణకు మరో రూ.3,892 కోట్లు.. ఐదు పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Telangana Urban Projects: తెలంగాణ రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో అతిపెద్ద ఆర్థిక ఉద్దీపనను ప్రకటించింది. ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ (Urban Challenge Fund) కింద రాష్ట్రానికి చెందిన 5 కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు రూ. 3,892.38 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో రూ. 873.49 కోట్లను కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష సహాయంగా అందించనుంది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన 4వ జాతీయ ఉన్నతస్థాయి కమిటీ (National High Level Committee) సమావేశంలో ఈ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు.
హైదరాబాద్ తాగునీటికి రూ. 1,992 కోట్లు – 2035 వరకు నిరంతర నీటి సరఫరా
ఆమోదం పొందిన ప్రాజెక్టులలో అత్యంత కీలకమైన హైదరాబాద్ మహానగర గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2, ఫేజ్-3 పనులకు రూ. 1,992 కోట్లను కేటాయించారు. ఘన్పూర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల వరకు 120 కిలోమీటర్ల మేర భారీ వాటర్ పైప్లైన్ల నిర్మాణంతో పాటు, 120 ఎంఎల్డీ , 70 ఎంఎల్డీ సామర్థ్యంతో రెండు ఆధునిక నీటి శుద్ధి కేంద్రాలు (WTP), 102.5 మిలియన్ లీటర్ల నీటి నిల్వ రిజర్వాయర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తయితే ఓఆర్ఆర్ (ORR) పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలతో కలిపి కోర్ అర్బన్ పరిధిలోని 1.74 కోట్ల మందికి 2035 సంవత్సరం వరకు తాగునీటి కొరత లేకుండా సరఫరా జరగనుంది. ఈ ప్రాజెక్టుకు హడ్కో (HUDCO) రుణ ప్రక్రియ పూర్తయి పనులు వేగంగా సాగుతున్నాయి.
గ్రేటర్ వరంగల్ డ్రైనేజీ, కాకతీయ వారసత్వ కందకం పునరుద్ధరణ
మిగిలిన నాలుగు ప్రాజెక్టులు వరంగల్, హనుమకొండ, అలంపూర్ పట్టణాల స్మార్ట్ , పర్యాటక అభివృద్ధికి కేటాయించబడ్డాయి:
గ్రేటర్ వరంగల్ సమగ్ర వర్షపు నీటి కాలువలు: రూ. 1,465 కోట్లతో 407.70 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 24 ప్రధాన వరద ప్రభావిత ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ 10 చెరువుల కట్టల పటిష్టీకరణ, 100 కిమీ నాలాలకు ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించనున్నారు.
వరంగల్ కోట కందకం పునరుద్ధరణ: కాకతీయుల కాలం నాటి చారిత్రక కోట కందకాన్ని (Moat) రూ. 209.08 కోట్లతో పునరుద్ధరించి వాకింగ్ ట్రాక్స్, వ్యూ పాయింట్లు , గ్రీనరీతో పర్యాటక ప్రాంగణంగా మార్చనున్నారు.
హనుమకొండ కమర్షియల్ హబ్, అలంపూర్ జోగుళాంబ టెంపుల్ కారిడార్
హనుమకొండ పాత వాణిజ్య కేంద్రాన్ని రూ. 168.80 కోట్లతో ఆధునీకరిస్తూ సమగ్ర బస్ టెర్మినల్, వాణిజ్య సముదాయం, మల్టీ లెవల్ పార్కింగ్తో పాటు భద్రకాళి, వేయిస్తంభాల గుడి పరిసరాల మాడవీధులను సుందరీకరించనున్నారు. అలాగే జోగుళాంబ శక్తిపీఠం ఉన్న అలంపూర్‌లో రూ. 57.50 కోట్లతో వారసత్వ నడక మార్గం (Heritage Walk), పుష్కర ఘాట్ , పర్యాటక ప్రాంగణాలను నిర్మించనున్నారు.
తెలంగాణ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ. 9,573 కోట్లకు చేరిక
తాజా నిధులతో కలిపి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తెలంగాణకు మంజూరైన మొత్తం 8 ప్రాజెక్టుల ప్రాజెక్టు వ్యయం రూ. 9,573.42 కోట్లకు చేరింది. ఇందులో కేంద్రం అందించే మొత్తం సహాయం రూ. 2,293.75 కోట్లు కాగా, మిగిలిన నిధులను హడ్కో రుణాలు, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) , రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా సమకూర్చనున్నారు.