Skip to content
తెలంగాణ › వార్తలు

Fake Rythu Bharosa Messages: రైతు భరోసా పేరుతో నకిలీ ఎస్‌ఎంఎస్‌ల కలకలం.. 2.73 లక్షల మంది రైతులకు మెసేజ్‌లు, సైబర్ క్రైమ్ డీజీపీకి ఫిర్యాదు చేసిన వ్యవసాయ శాఖ

jagan 05 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Fake Rythu Bharosa Messages: రైతు భరోసా పేరుతో నకిలీ ఎస్‌ఎంఎస్‌ల కలకలం.. 2.73 లక్షల మంది రైతులకు మెసేజ్‌లు, సైబర్ క్రైమ్ డీజీపీకి ఫిర్యాదు చేసిన వ్యవసాయ శాఖ

Telangana Agriculture: రైతులకు గుడ్‌న్యూస్‌.. రాయితీపై విత్తనాలు.. యాసంగిలో ఆరుతడి పంటలకు ప్రోత్సాహం!

Fake Rythu Bharosa Messages: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకం పేరుతో వేలాది మంది రైతుల మొబైల్ ఫోన్లకు అనధికార ఎస్‌ఎంఎస్‌లు (Fake SMS) రావడం తీవ్ర కలకలం రేపింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేరిట పెట్టుబడి సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఏకంగా 2,73,128 మంది రైతుల ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లాయి. ప్రస్తుతం రైతు భరోసా నిధుల విడుదల సమయం కాకపోవడంతో సందేహించిన రైతులు బ్యాంకులకు వెళ్లి విచారించగా, ఖాతాల్లో ఎలాంటి నగదు జమ కాలేదని వెల్లడైంది. దీంతో ఈ ఉడాయింపు సందేశాలపై వ్యవసాయ శాఖ తీవ్రంగా స్పందించింది.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లి, రాజేశ్వరపురం, పైనంపల్లి , రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ కోనరావుపేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల రైతులకు బుధవారం ఈ నకిలీ సందేశాలు వచ్చాయి. “రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు పెంచామని, మీ ఖాతాలో రూ.6,450 జమయ్యాయని.. మీ రేవంత్‌రెడ్డి” అనే సారాంశంతో ఉన్న మెసేజ్‌లు చూసి రైతులు ఒకింత గందరగోళానికి గురయ్యారు. ఈ ఘటనపై నేలకొండపల్లి వ్యవసాయాధికారి ఎం. రాధ స్పందిస్తూ.. ఇవి తప్పుడు మెసేజ్‌లని తేలిందని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ లేదా మెసేజ్‌లకు ఎలాంటి ఓటీపీ (OTP) లు చెప్పవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి సైబర్ క్రైమ్ విభాగం డీజీపీకి బుధవారం అత్యవసర లేఖ రాశారు. రైతులకు అధికారిక సమాచారం చేరవేసేందుకు వ్యవసాయ శాఖ ‘సీడాక్’ (C-DAC) ఎస్‌ఎంఎస్‌ సర్వీస్ పోర్టల్‌ను ఉపయోగిస్తుందని, అయితే ప్రస్తుతం రైతులకు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లతో తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థను లేదా ఎస్‌ఎంఎస్‌ ఐడీలను దుర్వినియోగం చేసి ఈ సందేశాలు పంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

సందేశాలు పంపిన సెండర్ ఐడీ (Sender ID), ట్రాన్స్‌మిషన్ లాగ్‌లు , ఐపీ అడ్రస్‌లను సాంకేతికంగా పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది. రైతులను అయోమయానికి గురిచేయడమే కాకుండా రైతు భరోసా పథకం విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్న ఈ నకిలీ నెట్‌వర్క్‌ను త్వరితగతిన ఛేదించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆశ్రయించారు.