Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

సునామీలు ఎదిరించే ప్రయత్నాలను కొనసాగిద్దాం

Prajapaksham 05 Nov 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
సునామీలు ఎదిరించే ప్రయత్నాలను కొనసాగిద్దాం

Cyclone Murasu: ఏపీకి మురసు ముప్పు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో హై అలర్ట్.. 120 కి.మీ వేగంతో ప్రచండ గాలులు...భారీ వర్షాలు...

బి.ఎం. రెడ్డి

(05 నవంబర్‌ ‘ప్రపంచ సునామీ అవగాహన దినం’ సందర్భంగా)
సముద్రంలో భూకంపాలు రావడం, వాల్కనో విస్ఫోటనాలు జరగడం, కొండచరియలు విరిగిపడడం, అగ్నిపర్వతాలు బద్దలు కావడం, ఉల్కాపాతం ఉద్భవించడం లాంటి విపత్తులు సంభవించినపుడు సముద్రపు అలలు నోళ్లు తెరుచుకొని ఉవ్వెత్తున 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతూ, గంటకు 800 కిమీ వేగంతో రాకాసి అలలు ప్రయాణిస్తూ, తీర ప్రాంత జనావాసాలను మహా విపత్తు ముంచేయడాన్నే సునామీ అని అంటాం. 26 డిసెంబర్‌ 2004 తొలిసారి హిందూ మహాసముద్రంలో భూకంపం రావడంతో ప్రపంచ చరిత్రలో ఓ అత్యంత విధ్వంసకర సునామీ రావడం, 14 దేశాలకు చెందిన 2,83,000 మందిని పొట్టన పెట్టుకోవడం చూసాం. అక్టోబర్‌ 2026లో
‘అర్నాబ్‌’, నవంబర్‌ 2026లో ‘మురసు’ పేర్లతో తుఫాన్ల దుష్ప్రభావాన్ని కూడా నేడు చవిచూస్తున్నాం.
సునామీ అనబడే జపానీస్‌ పదానికి హార్బర్‌ కెరటం అని అర్థం. పసిఫిక్‌ మహాసముద్రంలో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కారణంగా 80 శాతం వరకు సునామీలు సంభవిస్తున్నాయి. ఇలాంటి అత్యంత ప్రమాదకర సునామీ ప్రళయాల్లో నష్టాన్ని తగ్గించడానికి ముందస్తు గుర్తించడం, హెచ్చరికలు జారీ చేయడం, సత్వరమే చర్యలకు పూనుకోవడం, ఆధునిక పరిశోధనలతో సునామీ రాకను ముందే పసిగట్టడం, తీర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి లక్ష్యాలను పెట్టుకొని 2015లో ఐరాస సభ్యదేశాలు తీసుకున్న నిర్ణయం ప్రకారం 2016 నుంచి ప్రతి ఏట 05 నవంబర్‌ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సునామీ అవగాహన దినం పాటించడం ఆనవాయితీగా మారింది. ప్రపంచ సునామీ అవగాహన దినం ఇతివృత్తంగా సునామీలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ మన ప్రయత్నాలను చేద్దాం అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నారు.
సునామీ విపత్తుల పట్ల విషయ పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం, విపత్తు ప్రమాదపు అంచున నివసిస్తున్న తీర ప్రాంత ప్రజలను సన్నద్ధంచేయడం, గత సునామీ చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం, సునామీ బాధితులకు సంఘీభావం తెలియజేయడం, ఆధునిక డిజిటల్‌ శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో సునామీలను ముందస్తు అంచనాలతో హెచ్చరికలు జారీ చేయడం, ప్రపంచ దేశాలు సమన్వయంతో పనిచేయడం, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని ఏకరువు పెట్టడం, రాబోయే తరాలకు సునామీ పట్ల కనీస జ్ఞానాన్ని అందించడం లాంటి అంశాలు సునామీ వల్ల జరిగే ప్రాణ ఆస్తి నష్టాలను పూర్తిగా తగ్గిస్తాయని గమనించాలి.
పర్యావరణ కాలుష్యంతో సంభవిస్తున్న ప్రతికూల వాతావరణ మార్పుల కారణంగా కూడా సునామీలు ఎగిసిపడవచ్చని తెలుసుకుందాం. సునామీ విపత్తుల గూర్చి పూర్తి అవగాహనను ఆకళింపు చేసుకుందాం. సునామీలు నేర్పిన గత గుణపాఠాలను మరువకుండా రాబోయే రోజుల్లో రాకాసి అలల వలలో పడకుండా తీర ప్రాంత మానవాళిని కాపాడుదాం. సునామీ సృష్టించే విధ్వంసానికి అడ్డుకట్ట వేద్దాం.

ట్యాగ్‌లు: Cyclone cyclonic circulation