Skip to content
క్రైమ్ › వార్తలు

SD Pay Scam: గుజరాత్‌లో రూ. 1,200 కోట్ల ‘SD Pay’ సైబర్ స్కామ్ కలకలం.. 15 లక్షల మందిని ముంచిన డిజిటల్ వ్యాలెట్ యాప్..

jagan 02 Nov 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
SD Pay Scam: గుజరాత్‌లో రూ. 1,200 కోట్ల ‘SD Pay’ సైబర్ స్కామ్ కలకలం.. 15 లక్షల మందిని ముంచిన డిజిటల్ వ్యాలెట్ యాప్..

SD Pay

SD Pay Scam: తక్కువ పెట్టుబడితో రోజువారీ భారీ రాబడులు ఇస్తామని ఆశజూపి, మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) ద్వారా లక్షలాది మంది ఇన్వెస్టర్లను బురిడీ కొట్టించిన భారీ సైబర్ కుంభకోణం గుజరాత్‌లో వెలుగు చూసింది. అమ్రేలి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘SD Pay’ (అప్నా పే) అనే డిజిటల్ వ్యాలెట్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు రూ. 1,211 కోట్ల మేర విపరీతమైన మోసానికి పాల్పడ్డారు. చివరికి యాప్‌ను ఆకస్మికంగా నిలిపివేయడంతో (షట్‌డౌన్) తమ సొమ్ము పోయిందని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ధవల్ పటేల్, 2024లో ‘SD Pay’ మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించాడు. ఉచిత కరెంట్, గ్యాస్ బిల్లు చెల్లింపులు, మొబైల్ రీచార్జ్‌లు, పెట్టుబడులపై అధిక రాబడులు ఇస్తామని నమ్మించి ప్రచారం చేశారు. ఆకర్షణీయమైన సెమినార్లు, జూమ్ (Zoom) వీడియో కాల్స్ నిర్వహించడంతో పాటు ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించేందుకు సంతకాలు చేసిన ఖాళీ చెక్కులు, నకిలీ ఎస్క్రో వ్యాలెట్ (Escrow Wallet) పత్రాలను అందించారు. ఈ మాయమాటలు నమ్మి దాదాపు 15 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా, నిందితులు సుమారు 6.52 లక్షల బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా రూ. 1,211 కోట్లు దారి మళ్లించారు. త్వరలోనే కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కూడా తెస్తోందని ఇన్వెస్టర్లను నమ్మించారు.

ఈ మోసంలో అనేక మంది మధ్యతరగతి ప్రజలు, సింగిల్ మదర్లు తమ జీవితకాల పొదుపును కోల్పోయారు. వడోదరకు చెందిన 48 ఏళ్ల సింగిల్ మదర్, తన కొడుకు కాలేజీ చదువు కోసం 2025లో ఉన్న ఒకే ఒక్క 1BHK అపార్ట్‌మెంట్‌ను అమ్మి రూ. 9.5 లక్షలను ఈ యాప్‌లో పెట్టుబడిగా పెట్టారు. అంతేకాకుండా మరో 31 మంది స్నేహితులు, బంధువులను కూడా ఇందులో చేర్పించారు. 2026 మధ్య నాటికి ఆమె యాప్ వ్యాలెట్‌లో రూ. 50 లక్షలు ఉన్నట్లు వర్చువల్‌గా చూపించినప్పటికీ.. సడన్‌గా యాప్ మూతపడటంతో వీధి పాలు అయ్యారు. మరో కేసులో, సురేంద్రనగర్‌కు చెందిన ఒక బాధితుడు సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే ఆశతో పర్సనల్ లోన్, గోల్డ్ లోన్‌లు తీసి రూ. 60 లక్షలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారు. సూరత్‌కు చెందిన ఒక ఇన్వెస్టర్ రూ. 1,000తో ప్రారంభించి దాదాపు 1.6 లక్షల మందితో నెట్‌వర్క్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.

2026 సెప్టెంబర్‌లో అమ్రేలి జిల్లాలో తొలిసారిగా ఈ కుంభకోణం బయటపడటంతో బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు 18 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో 12 మంది ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ మోసం కేవలం గుజరాత్‌కే పరిమితం కాకుండా పలు పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. నిందితులు సొమ్మును దారిమళ్లించేందుకు వినియోగించిన 6 కంపెనీలకు చెందిన 38 బ్యాంక్ ఖాతాలను, కంపెనీ డైరెక్టర్లు నిర్వహిస్తున్న మరో 72 ఖాతాలను (మొత్తం 110 ఖాతాలు) సీజ్ చేసి తదుపరి విచారణ వేగవంతం చేశారు.