Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Rain Forecast: తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..

jagan 31 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Rain Forecast: తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..

Andhra Pradesh Rains

Telangana Rain Forecast: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం నుంచి నవంబర్ 4వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. వర్షాల తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో వార్నింగ్’ (Yellow Warning) జారీ చేసింది.

వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో శనివారం సాయంత్రం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు , గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం (నవంబర్ 1) నాడు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

ముఖ్యంగా నవంబర్ 2 , 3 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది. నవంబర్ 2న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ , వరంగల్ జిల్లాల్లో… అలాగే నవంబర్ 3న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాల నేపథ్యంలో పౌరులు, ముఖ్యంగా నివాసితులు , శ్రామికులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ఎత్తైన చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.