Konda Surekha: కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. గత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ ట్వీట్..
Konda Surekha
Konda Surekha: తెలంగాణ మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు చింతిస్తున్నానని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలోనే ఆ వ్యాఖ్యలు చేశానని, కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం తనకు ఎంతమాత్రం లేదని తెలుపుతూ తన వ్యాఖ్యలను అధికారికంగా ఉపసంహరించుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
తన ఎక్స్ పోస్టులో ఈ అంశంపై పూర్తి వివరణ ఇచ్చిన కొండా సురేఖ, ఆనాడు కేటీఆర్‌పై నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌ను గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు కేటీఆర్‌ను లేదా ఆయన కుటుంబ సభ్యులను మనస్థాపానికి గురిచేసి ఉంటే అందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నానని, ఆ రోజు చేసిన వ్యాఖ్యలన్నింటినీ పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు.
కేటీఆర్‌పై కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యం
మాజీ మంత్రి కొండా సురేఖ గతంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్రమైన వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ఆమె వ్యాఖ్యానిస్తూ, సినీ నటులు అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆరే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ సినీ నటీనటుల ఫోన్లను ట్యాపింగ్ చేసి, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని బ్లాక్‌మైల్ చేసేవారని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపడమే కాకుండా, అక్కినేని నాగార్జున కుటుంబం, సినీ ప్రముఖులు, కేటీఆర్ నుంచి తీవ్ర అభ్యంతరాలకు దారితీశాయి. తమ పరువుకు భంగం కలిగించారంటూ కేటీఆర్ కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపగా, కోర్టులో పరువు నష్టం దావా కూడా దాఖలైంది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడం , న్యాయపరమైన చర్యలు తలెత్తడంతో, అప్పట్లోనే సినీ వర్గాలకు కొంత వివరణ ఇచ్చిన సురేఖ.. తాజాగా కేటీఆర్‌పై చేసిన ఆ నిరాధారమైన వ్యక్తిగత వ్యాఖ్యలన్నింటినీ అధికారికంగా ఉపసంహరించుకుంటూ క్షమాపణపూర్వక ట్వీట్ చేశారు.