విభిన్న రచనల కేంద్రం అహ్మదాబాద్ పుస్తకోత్సవం
One day is enough to read it.
గుజరాత్‌లో ప్రారంభమైన అహ్మదాబాద్ అంతర్జాతీయ పుస్తకోత్సవం నవంబర్ ఒకటో తేదీ వరకు పాఠకులకు విభిన్న రచనలను అందుబాటులో ఉంచుతుంది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బిటి) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ 12వ పుస్తకోత్సవం సబర్మతి రివర్‌ఫ్రంట్‌లోని ఈవెంట్ సెంటర్‌లో కొనసాగుతుంది. ఇందు 700 పుస్తక విక్రయ స్టాళ్లను ఏర్పాటు చేశారు. సాహిత్యం, కవిత్వం, గజల్స్, సంగీతం, బాలసాహిత్యం, రచనా ప్రక్రియలు, పుస్తక ప్రచురణ, మేధో చర్చలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. కాగా, పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడం నేటి సమాజంలో అత్యంత అవసరం. అందుకే, ఇలాంటి బుక్‌ఫెయిర్స్ విరివిగా జరగాలి. అహ్మదాబాద్ పుస్తకోత్సవం భాషలు, సంస్కృతుల మధ్య వారధిగా నిలుస్తుంది. గుజరాత్ సాహిత్య, సాంస్కృతిక గుర్తింపును జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. అంతేగాక, వివిధ భాషలకు చెందిన ఎంతో మంది రచయితలు కూడా పరిచయమవుతారు. ఉత్సవంలో పిల్లల కోసం ప్రత్యేక పెవిలియన్, రచయితల సమావేశాల కోసం కార్నర్, ‘జ్ఞాన గంగా’, ‘విచార్ మంథన్’ చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సనాతన ధర్మంలోని ప్రాచీన జ్ఞానం, విలువలను యువతకు పరిచయం చేసే ‘సనాతన్ బోధ్’ పుస్తక శ్రేణిని కూడా ప్రదర్శిస్తున్నారు. పుస్తకాలతోపాటు హస్తకళలు, వస్త్ర కళలను ప్రోత్సహించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ‘ఛాప్’ పేరుతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ పుస్తకోత్సవంలో పాల్గొనేవారు రచయితలతో ముఖాముఖి చర్చలు, పఠన కార్యక్రమాల ద్వారా సాహిత్య ప్రపంచాన్ని మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం పొందవచ్చు.