Telangana: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరవు ముప్పు.. ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు..
Revanth Reddy Thanks Kharge: ఖర్గే మద్దతుకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు.. అమెరికా పర్యటన రద్దుపై త్వరలో స్పందిస్తా...
Telangana: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభమైన కరవు పరిస్థితులు వచ్చే ఏడాది జులై వరకు కొనసాగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, ఈ విపత్కర పరిస్థితిని దాచిపెడితే అది క్యాన్సర్‌లా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు డీసీసీ అధ్యక్షులతో శుక్రవారం నిర్వహించిన అత్యవసర సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో, వారి భాగస్వామ్యంతో కరవును ఎదుర్కోవడంలో వెనుకడుగు వేస్తే అన్ని విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై ప్రతిపక్ష BRS నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్రలో నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని మార్గదర్శకాలు ఇస్తున్నారని, కానీ కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చుని ప్రణాళికలు రచిస్తూ, హరీశ్‌రావు, కేటీఆర్‌ల ద్వారా కాంగ్రెస్‌పై నిందలు వేయిస్తున్నారని విమర్శించారు. గతంలో కరోనా సమయంలో ఎండ కొడితే వైరస్ పోతుందని కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. హరీశ్‌రావు మాటలు నమ్మి రైతులు పంటలు సాగుచేస్తే తీవ్రంగా నష్టపోతారని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి తిప్పికొట్టాలని ఆదేశించారు.
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం వెనుక మాజీ సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి ప్రణాళిక రచించారని సీఎం ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తి జరిగే ప్రాంతంలో కాకుండా దామరచర్లలో ప్లాంటు నిర్మించడం వల్ల ప్రజలపై వేల కోట్ల అదనపు భారం పడిందని, ప్రస్తుతం తక్కువ గ్రేడ్ బొగ్గు వాడకం వల్ల కాలుష్యం కూడా పెరుగుతోందని మండిపడ్డారు. విద్యార్థులు, యువత భవిష్యత్ కోసం సంక్రాంతి తర్వాత నాలుగు నెలల పాటు ప్రజాప్రతినిధులంతా గ్రామాల బాట పట్టాలని, గ్రామాల్లో ఉపాధి పనులు, చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధుల పర్యటనలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికల్లో ఈవీఎంలు, ఇతర కుట్రలతో గెలవాలని చూస్తున్నారని సీఎం అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు నవంబరు 1న దిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే మహాధర్నాకు తెలంగాణ నుంచి 10 నుంచి 15 వేల మందిని తరలించి మన సత్తా చాటాలని ఆదేశించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.