సిఇసి జ్ఞానేశ్ కుమార్ దిగిపోవాల్సిందే!
cec gyanesh kumar
డి.రాజా, సిపిఐ ప్రధాన కార్యదర్శి
భారత ప్రజాస్వామ్యం ఒక దయార్థుడైన పాలకుడు ప్రజలకు ఇచ్చిన బహుమతి కాదు. వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన సుదీర్ఘమైన, కఠినమైన పోరాటం ద్వారా దీనిని సాధించారు. ఆ పోరాటంలో లక్షలాది మంది పాల్గొనడమే కాకుండా, లెక్కకు అందనంతమంది స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. స్వాతంత్య్ర ఆకాంక్ష నుంచి ప్రజాస్వామ్య ఆకాంక్షను విడదీసి చూడలేము. సంపద, కులం, మతం, లింగం లేదా సామాజిక హోదాతో సంబంధం లేకుండా ప్రతీ భారతీయుని కి దేశ భవిష్యత్తును నిర్దేశించడంలో సమాన హక్కు లేకపోతే రాజకీయ స్వేచ్ఛ అసంపూర్ణంగా ఉంటుందని బ్రిటీష్ వారితో పోరాడిన ప్రజలు గ్రహించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో, వలస పాలనలో సైతం ప్రజాస్వామ్య సంస్థలు, ప్రాతినిధ్య వ్యవస్థలు ఆవిర్భవించాయి. భారతీయులకు స్వీయపాలన హక్కు ఉందనే సూత్రాన్ని అవి నొక్కిచెప్పాయి. 1885లో స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్ క్రమంగా రాజకీయ సమీకరణకు ఒక వేదికగా మారింది. అదే సమయంలో విప్లవ ఉద్యమాలు, కార్మిక సంఘాలు, రైతాంగ పోరాటాలు, వామపక్షాలు&స్వాతంత్య్రం యొక్క అర్థాన్ని బ్రిటీష్ పాలకుల నుంచి భారత పాలకులకు అధికార మార్పిడి జరగడం అనే పరిధిని మించి విస్తరించాయి. ఈ దృక్పథంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు డిమాండ్ ప్రధానమైనది. వలస పాలనలో, ఆస్తి, విద్య, పన్నులు, ఇతర అర్హతల ఆధారంగా ఓటు హక్కులను పరిమితం చేశారు. జనాభాలో కేవలం ఒక చిన్న వర్గం మాత్రమే ఎన్నికలలో పాల్గొనగలిగేది. స్వాతంత్య్ర ఉద్యమం ఈ మినహాయింపును సవాలు చేసింది. ఎందుకంటే భారతదేశ భవిష్యత్తును ప్రజలే నిర్ణయించాలి కానీ, ప్రత్యేక హక్కులు గల మైనారిటీ వర్గం కాదు అనేది దాని ప్రధాన వాగ్దానం. ఈ పాఠాన్ని జైలు శిక్ష, క్రూరమైన అణచివేత, పేద రికం, మరణం ద్వారా నేర్చుకోవలసి వచ్చింది. ఓటు హక్కు అనేది కేవలం ఒక విధానపరమైన లాంఛనం కాదు. తమ సమ్మతి లేకుండా తమ జీవితాలను పాలించడాన్ని అంగీకరించడానికి నిరాకరించిన తరతరాల భారతీయులు చేసిన త్యాగాలకు అది ఒక రాజకీయ వ్యక్తీకరణ.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, రాజ్యాంగ పరిషత్తు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగా న్ని రూపొందించి, ఈ ప్రజాస్వామ్య ఆకాంక్షకు ఒక అసాధారణమైన వ్యవస్థాగత రూపాన్ని ఇచ్చింది. రాజ్యాంగం భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా స్థాపించి, సార్వత్రిక వయోజన ఓటు హక్కుకు హామీ ఇచ్చింది. ప్రతి వయోజన పౌరుడు, స్త్రీ అయినా పురుషుడైనా, ధనికుడై నా, పేదైనా, విద్యావంతులైనా నిరక్షరాస్యులైనా, ఎన్నికలలో సమాన ప్రాతిపదికన పాల్గొనే హక్కును కలిగి ఉన్నారు.
భారతదేశం తన ప్రజలకు ఓటు హక్కును కల్పించేందుకు అక్షరాస్యత, శ్రేయస్సు లేదా సామాజిక సమానత్వం సాధించేంత వేచి ఉండలేదు. ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రజాస్వామ్యం అవసరమని అది గుర్తించింది. అమెరికా, ఐరోపా దేశాలతో సహా అనేక సుస్థిర ప్రజాస్వామ్య దేశాలు ఆస్తి, జాతి, లింగం, సామాజిక హోదా ఆధారిత ఆంక్షలను అధిగమించడానికి తరతరాల సమయం తీసుకున్నాయి. భారతదేశం సార్వత్రిక వయోజన ఓటు హక్కుతో తన రాజ్యాంగ ప్రస్థానాన్ని
ప్రారంభించింది.
ఆ నిర్ణయం సామాన్య ప్రజలపై స్వాతంత్య్ర సమరయోధులకు ఉన్న విశ్వాసాన్ని, రాజకీయ సమానత్వాన్ని గణతంత్రానికి పునాదిగా నిలపాలనే వారి సంకల్పాన్ని ప్రతిబింబించింది. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు వేసే అర్హతా వయస్సును 21 నుండి 18కి తగ్గించడం భాగస్వామ్యాన్ని మరింత విస్తరించింది. తద్వారా లక్షలాది మంది యువ భారతీయులు ప్రజాస్వామ్య ప్రక్రియలోకి వచ్చారు. విస్తృత ఓటు హక్కు కోసం జరిగిన ప్రచారం, సిపిఐ నాయకుడు సి.కె. చంద్రప్పన్తో సహా రాజకీయ నాయకుల ప్రయత్నాలు ఈ విస్తృత ప్రజాస్వామ్య పురోగతిలో భాగంగా ఉన్నాయి. దశాబ్దాలుగా, ఎన్నికలు కార్మికులు, రైతులు, దళితులు, ఆదివాసులు, మహిళలు, చారిత్రాత్మకంగా అణగారిన ఇతర వర్గాలకు తమ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి వీలు కల్పించాయి. భారత ప్రజాస్వామ్యం లోపాలు లేకుండా ఎప్పుడూ లేదు. ధనబలం, కుల వివక్ష, మతపరమైన సమీకరణ, రాజకీయ వనరులకు అసమాన ప్రాప్యత వంటివి ప్రజాస్వామ్య ప్రక్రియ ను పదేపదే వక్రీకరించాయి. అయినప్పటికీ, ప్రజలు ప్రభుత్వాలను ఓడించి తొలగించగలగడం, ఉద్యమాలను నిర్వహించగలగడం, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయగలగడం, సంస్కరణల కోసం పోరాడగలగడంతో ఈ వ్యవస్థ తనను తాను సరిదిద్దుకునే సామర్థ్యాన్ని నిలుపుకుంది. భారత ప్రజాస్వామ్యం వాగ్దానం పరిపూర్ణతలో కాకుండా, పౌరులు పాల్గొని తమ గళాన్ని వినిపించగల సామర్థ్యంలో ఉంది. నేడు, ఆ వాగ్దానం ప్రత్యక్ష దాడికి గురవుతోంది.
ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని నిలబెట్టే సంస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రమపద్ధతిలో బలహీనపరుస్తోంది. ఎన్నికలలో గెలవడంతోనే ప్రజాస్వామ్యంపై దాని అవగాహన మొదలై, అంతమైపోతున్నట్లుగా రోజు రోజుకీ కనిపిస్తోంది. స్వతంత్ర సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు, అసమ్మతి వ్యక్తం చేసే పౌరులు, ప్రజా పరిశీలనను అధిగమించాల్సిన అడ్డంకులుగా అది పరిగణిస్తోంది. ఎన్నికల పవిత్రతను పరిరక్షించే బాధ్యతను రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్న భారత ఎన్నికల సంఘం ఎన్నడూలేనంతగా పరీక్షకు గురైంది. ఓటర్ల జాబితాల తయారీ, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణ, నిర్దేశం, నియంత్రణ బాధ్యతలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ఎన్నికల సంఘానికి కట్టబెట్టింది. ఈ ఆదేశం స్వాతంత్య్రం, నిష్పాక్షికత, ప్రజా విశ్వాసాన్ని కోరుతుంది. అయితే, నిర్ణేత (రెఫరీ)నే అధికార పార్టీకి ఒక సాధనంగా మారాడని పౌరులు భావిస్తే, ఎన్నికల సంఘం ఆ బాధ్యతను నెరవేర్చలేదు. ధనబలం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం, వ్యవస్థాగత నియంత్రణలను బలహీనపరచడం ద్వారా బిజెపి అనుభవిస్తున్న అపారమైన ప్రయోజనాల కారణంగా ఎన్నికలు నానాటికీ ఏకపక్షమవుతున్నాయి. 2024లో సుప్రీంకోర్టు కొట్టివేసిన ఎలక్టోరల్ బాండ్ల పథకం, రాజకీయ నిధుల సమీకరణకు ఉన్న పారదర్శకరహిత వ్యవస్థ, అజ్ఞాత విరాళాల ద్వారా అధికార పార్టీ అసమానంగా లబ్ధి పొందేందుకు ఎలా వీలు కల్పించిందో బట్టబయలు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టం మరో తీవ్రమైన ఎదురుదెబ్బను సూచించింది. ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన ఎంపిక విధానాన్ని తొలగించి, కార్యనిర్వాహక వర్గ ఆధిపత్యం ఉండేలా కమిటీని ఏర్పాటు చేసింది. తద్వారా దాని నాయకత్వ ఎంపికపై అధికారంలో ఉండే ప్రభుత్వానికి నిర్ణయాత్మక అధికారాన్ని కల్పించింది. ఎన్నికల సంఘం పర్యవేక్షించాల్సిన కార్యనిర్వాహక వర్గమే దాని నాయకత్వ ఎంపికపై ఇంతటి నియంత్రణను చెలాయిస్తున్నప్పుడు, కేవలం హామీలతో దాని స్వాతంత్య్రం నిలబడలేదు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చుట్టూ పెరుగుతున్న వివాదం, ఓటర్ల జాబితాల నిర్వహణ, కమిషన్ పనితీరులో దీని పర్యవసానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సంస్థ విశ్వసనీయతపై మాజీ ఎన్నికల కమిషనర్లు సైతం ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై బిజెపి ప్రతిస్పందన పారదర్శకత, జవాబుదారీతనం ద్వారా విశ్వాసాన్ని పునరుద్ధరించడంపై కాకుండా ఎన్నికల సంఘం నిర్ణయాలను ప్రశ్నించకుండా అంగీకరించాలని అనే విధంగా ఉంది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) ఈ ఆందోళనలను ఒక ప్రమాదకరమైన కొత్త స్థాయికి తీసుకెళ్ళింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో 13 కోట్లకు పైగా పేర్లు తొలగించబడ్డాయి. ప్రతి తొలగింపును ఎలా ధృవీకరించారో, అర్హులైన పౌరులను ఓటు హక్కు కోల్పోకుండా ఎలా కాపాడతారో ఎన్నికల సంఘం వివరించాలి. ఈ సంఖ్యల వెనుక ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికులు, పత్రాల కోసం ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలు, పారదర్శకత రహిత పరిపాలనా ప్రక్రియను భరించలేని మైనారిటీలు, ఇతర బలహీన వర్గాలు వంటి అసలైన ప్రజల ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణ అనేది ఓటు హక్కు సమగ్రతను కాపాడాలే కానీ, చట్టబద్ధమైన ఓటర్లను తొలగించే యంత్రాంగంగా మారకూడదు. మౌలిక ప్రశ్న చాలా సులభం. ప్రజాస్వామ్యం లో, ఓటర్లు తమ పాలకులను ఎన్నుకోవాలి, అంతేగాని దీనికి విరుద్ధంగా కాదు. ఓటర్ల జాబితాల నుండి లక్షలాది పేర్లు అదృశ్యమైనప్పుడు,ఇప్పటికే ప్రతికూలతలను ఎదుర్కొంటున్న పౌరులపై రుజువు భారాన్ని మోపలేము. అలాగే, పారదర్శకమైన విధానాలు, ధృవీకరించదగిన రికార్డులు, స్వతంత్ర పరిశీలన లేకుండా ప్రజలు తమ హామీలను అంగీకరిస్తారని ఎన్నికల సంఘం ఆశించకూడదు. ఫామ్ ఏకపక్షంగా చేసిన మార్పులపై తలెత్తిన వివాదం విశ్వాస సంక్షోభాన్ని మరింత జఠిలం చేసింది. కాబట్టి, జవాబుదారీతనం కోసం చేసే డిమాండ్ ప్రజాస్వామ్యంపై దాడి కాదు, అది సంస్థాగత వైఫల్యం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే డిమాండ్.
శాంతియుత నిరసనల పట్ల ప్రభుత్వ స్పందనలో ఈ ఉద్యమం పట్ల మోదీ ప్రభుత్వ ఆందోళన స్థాయి స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీని బారికేడ్లతో, భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందితో దుర్భేద్యంగా మార్చేశారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ గుమిగూడిన విద్యార్థులను, యువకులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసు లు అదుపులోకి తీసుకుని, దుర్భాషలాడి కొట్టారు. ఈ ప్రదర్శనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను కూడా నిర్బంధించడంపై పత్రికా స్వేచ్ఛను ఆకాంక్షించే సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ఎన్నికల సమగ్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న విద్యార్థులకు ప్రజాదరణ ఉందని చెప్పుకునే ప్రభుత్వం ఎందుకు భయపడాలి? జవాబుదారీతనం కోరుతున్న పౌరుల నుంచి ఒక రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థకు ఇంతటి అసాధారణ రక్షణ ఎందు కు అవసరం? ఎన్నికల పోటీ నిబంధనలను నిర్ధారించే సంస్థలపై నియంత్రణను నిలుపుకోవడానికి బిజెపి ఇస్తున్న రాజకీ య ప్రాధాన్యతలోనే దీనికి సమాధానం ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరణకు పెరుగుతున్న ప్రజా ఉద్యమంలో ఇండియా బ్లాక్, చురుకైన భాగస్వామ్యంతో వామపక్షం చేరింది. ఈ ఉద్యమం జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేయడంతో ఆగకూడదు. ఎన్నికల సంఘానికి స్వతంత్ర, పారదర్శక నియామకాలు, ఓటర్ల జాబితా నుంచి తొలగింపులపై సమీక్ష, ఏకపక్ష తొలగింపుల కు జవాబుదారీతనం, రాజకీయ నిధులలో పారదర్శకత, అర్థవంతమైన ఎన్నికల సంస్కరణల కోసం ఈ ఉద్యమం తప్పక ఒత్తిడి చేయాలి. ఓటర్లలోని కొన్ని వర్గాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థలపై నెలకొన్న విస్తృత అపనమ్మకాన్ని ప్రతిబింబిస్తూ, పేపర్ బ్యాలెట్లకు తిరిగి రావాలనే డిమాండ్‌ను కూడా ముందుకు తీసుకువెళ్లాలి. తమ ఓట్లను లెక్కించే యంత్రాంగాన్ని పౌరులు తప్పక విశ్వసించాలనే వాదనతో విశ్వసనీయమైన ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు.
ఎన్నికల సంఘం విశ్వసనీయత పునరుద్ధరణ దిశగా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా మొదటి అడుగు కావాలి. ఇది నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రత్యామ్నాయం కాదు, కానీ ప్రస్తుత విశ్వాస సంక్షోభంలో ఇది ఒక అనివార్యమైన డిమాండ్. ప్రజాస్వామ్యం అనేది నరేంద్ర మోదీ, అమిత్ షా లేదా ఏ అధికార పార్టీ సొంత సొత్తు కాదని బిజెపి అర్థం చేసుకోవాలి. ప్రతి సంస్థను తన రాజకీయ ప్రయోజనాలకు ఆధీనంలోకి తీసుకునేందుకు రాజ్యాంగ ం ప్రభుత్వానికి అధికారం ఇవ్వదు. నిరసన తెలిపే హక్కు, అసమ్మతి హ క్కు, ఓటు వేసే హక్కు అనేవి గణతంత్రానికి విడదీయరాని పునాదులు. వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారు, స్వతంత్ర భారతదేశం ఆ నిరంకుశ అధికార పునరుద్ధరణ చేయడం కోసం తమ ప్రాణాలను త్యాగం చేయలేదు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడికీ భాగస్వామ్యం ఉండే దేశం కోసం వారు పోరాడారు. ఆ వాగ్దానాన్ని తప్పక పరిరక్షించాలి.
ఎన్నికల సంఘాన్ని జవాబుదారీగా చేసేవరకు, ఎన్నికల ప్రక్రియలు నిజంగా పారదర్శకంగా మారే వరకు, అర్హత ఉన్న ప్రతీ భారతీయుడు నిర్భయంగా లేదా ఆటంకం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇండియా బ్లాక్, వామపక్షాలు నిశ్చయించుకున్నాయి. ఢిల్లీలో దాడులకు గురైన విద్యార్థులు, ఓటర్ల జాబితాలో పేర్లు లేని కార్మికులు, తమ ప్రజాస్వామ్య హక్కులను వదులుకోవడాన్ని నిరాకరిస్తున్న పౌరులు వీరందరూ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ప్రారంభమైన అదే పోరాటంలో భాగం. భయమనే తెర తొలగిపోతోంది. డిమాండ్ అనేది స్పష్టం. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. ఎన్నికల సంస్కరణలు జరగాలి. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే ప్రజల హక్కు నెగ్గాలి. అప్పటి వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది.