Skip to content
జాతీయం › వార్తలు

Rahul Gandhi: మహిళల హక్కులపై ఆర్‌ఎస్‌ఎస్‌ను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ.. పిల్ల చేష్టలంటూ ఎదురుదాడికి దిగిన బీజేపీ..

jagan 21 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Rahul Gandhi: మహిళల హక్కులపై ఆర్‌ఎస్‌ఎస్‌ను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ.. పిల్ల చేష్టలంటూ ఎదురుదాడికి దిగిన బీజేపీ..

Rahul Gandhi and Modi Amit shah

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆర్ఎస్ఎస్ అనేది కేవలం పురుషులతో మాత్రమే కూడిన ఒక రాజ్యాంగ వ్యతిరేక సంస్థ అని.. అది మహిళలను పురుషుల ఆస్తిగా భావిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన.. “నేను శివ శక్తిని తీవ్రంగా నమ్ముతాను. అందుకే మహిళలను చులకనగా చూసే ఆర్ఎస్ఎస్‌ వంటి సంస్థలతో సిద్ధాంతపరంగా పోరాడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా.. ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఉన్న చాలా మంది మహిళలు కూడా ప్రస్తుతం నా పక్షానే నిలిచారని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్‌కు అసలు విషయాలపై సరైన అవగాహన లేదని, ఆయన వ్యాఖ్యలు పూర్తిగా పిల్లచేష్టలను తలపిస్తున్నాయని మండిపడ్డారు. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ స్పందిస్తూ.. ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు చేసే ముందు ఆ సంస్థ నిర్మాణం, సమాజంలో అది పోషిస్తున్న పాత్రపై అధ్యయనం చేయాలని హితవు పలికారు. ఆర్ఎస్ఎస్‌లో మహిళల ప్రాతినిధ్యం కోసం ‘రాష్ట్ర సేవికా సమితి’ పేరిట ప్రత్యేక విభాగం సుదీర్ఘకాలంగా పనిచేస్తోందని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు పర్యావరణ, సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని గుర్తుచేశారు.

అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎంతవరకు ప్రాధాన్యం ఉందో స్పష్టం చేయాలని సవాలు విసిరారు. సొంత పార్టీలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎంపీ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉందో, ఎలాంటి చర్యలు తీసుకుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ రకమైన అసత్య ప్రచారాల ద్వారా ఆర్ఎస్ఎస్ ప్రతిష్టను దిగజార్చలేరని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.