నిరసనల గొంతు నొక్కడం..ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
Protest
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి అధికారం ఎంత ముఖ్యమో, ఆ అధికారా న్ని ప్రశ్నించే పౌరుడి హక్కు కూడా అంతే ముఖ్యం. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించే హక్కు పౌరులకు ఉన్నట్లే, వాటిని వ్యతిరేకించే హక్కు కూడా ఉంది. పాలకుల విధానాలతో విభేదించినంత మాత్రాన పౌరులు నేరస్థులుగా మారిపోరు. ముఖ్యంగా తమ భవిష్యత్తుపై ఆందోళనతో వీధుల్లోకి వస్తున్న విద్యార్థులు, యువత గొంతును వినడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. కానీ నిరసనల వెనుక ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన వ్యవస్థే, నిరసనకారులను అణచివేసేందుకు పోలీసు బలాన్ని ప్రయోగిస్తే, అది పాలనలోని జవాబుదారీతనంపై తీవ్రమైన సందేహాలను కలిగిస్తుంది. భారతదేశంలో ఇటీవలి కాలంలో శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న యువతపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. జెనీవాలో విడుదల చేసిన ప్రకటనలో 20 మందికి పైగా ఐక్యరాజ్య సమితి నిపుణులు, గత మూడు నెలలుగా న్యూఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో యువత నేతృత్వంలో జరుగుతున్న నిరసనలపై పోలీసులు పదేపదే అతిగా బలప్రయోగం చేస్తున్నారన్న నివేదికల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, రక్షించాలని, అమలు చేయాలని భారత అధికారులను కోరారు. నిరసనకారులపై జరిగినట్లు ఆరోపణలు వచ్చిన మానవ హక్కుల ఉల్లంఘనలపై న్యాయం జరగాలని కూడా స్పష్టం చేశారు. దీనిని కేవలం ఒక అంతర్జాతీయ సంస్థ వ్యక్తం చేసిన అభిప్రాయంగా కొట్టివేయడానికి వీల్లేదు. ఈ ఆరోపణలను విచారించి వాస్తవాలను నిర్ధారించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే భారతదేశం, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ విషయంలో కూడా అదే స్థాయి నిబద్ధతను ప్రదర్శించాలి. భారత రాజ్యాంగంలోని 19వ అధికరణం పౌరులకు భావప్రకటనా స్వేచ్ఛను, నిరాయుధులుగా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పిస్తుంది. ఈ హక్కులకు ప్రజా శాంతి వంటి కారణాల పై చట్టబద్ధమైన, సమంజసమైన పరిమితులు విధించవచ్చు. అయితే, పరిమితులు విధించే అధికారం ఉందని చెప్పి నిరసన హక్కునే నిర్వీర్యం చేయడానికి వీల్లేదు. ఏదైనా నిరసన వల్ల నిజమైన శాంతిభద్రతల సమస్య తలెత్తితే, దానిని చట్టబద్ధంగా మాత్రమే పరిష్కరించాలి. నిరసనకారులందరినీ ముందుగానే శాంతిభద్రతలకు ముప్పుగా పరిగణించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం కావచ్చు.. ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు కావచ్చు.. ప్రజాస్వామ్యానికి, ప్రజల హక్కులకు విఘాతం కలిగించే అంశాలపై యువత, విద్యార్థి సంఘాలు, ఇతర వర్గాలు నిరసన చేపట్టడంలో తప్పేమీ లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఎన్నికల సంఘం తన చర్యలకు వివరణ ఇవ్వవచ్చు. ప్రభుత్వాలు తమ విధానాలను సమర్థించుకోవచ్చు. కానీ వాటిపై సందేహాలు వ్యక్తం చేసే పౌరులకు సమాధానం చెప్పడం కూడా అంతే అవసరం. నిరాయుధులైన విద్యార్థులపై లాఠీచార్జీలు జరిగాయని, వేలాది మందిని నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారని వచ్చిన నివేదికలను ఐక్యరాజ్య సమితి నిపుణులు తమ నివేదికలో ప్రస్తావించారు. ఇటీవల న్యూఢిల్లీలో యువత, జర్నలిస్టులు, న్యాయవాదులు, మానవ హక్కుల పరిరక్షకులు, రాజకీయ పార్టీల సభ్యులు సహా 7,000 మందికి పైగా వ్యక్తులను ఏకపక్షంగా నిర్బంధించినట్లు వచ్చిన సమాచారంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో చాలామందిని 24 గంటల్లో విడుదల చేసినట్లు పేర్కొన్నారు. నిరసనల సమయంలో, నిర్బంధాల సందర్భంలో లైంగిక హింస, ఇతర లింగ ఆధారిత వేధింపులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజా సమావేశాలపై విస్తృత నిషేధాలు, ఇంటర్నెట్ నిలిపివేతలు, బయోమెట్రిక్ సమాచారంతో సహా డిజిటల్ నిఘా వ్యవస్థల దుర్వినియోగంపైన కూడా నిపుణులు ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ నివేదిక మొత్తాన్ని తప్పుడు ఆరోపణలుగా భారత ప్రభుత్వం అభివర్ణించడం, ఇప్పుడు కొనసాగుతున్న దుష్ట సంప్రదాయానికి పరాకాష్ట. అయితే, వాస్తవ పరిస్థితులు వివిధ మాధ్యమాల ద్వారా ప్రపంచం ముందుకు వస్తునే ఉన్నాయి. ‘దాచేస్తే దాగని సత్యం’ బయటపడుతునే ఉంది. ఐక్యరాజ్య సమితి నిపుణుల నివేదిక నూరు శాతం వాస్తవమేనని చెప్పలేం. కానీ, వాస్తవాలు ఉన్నాయన్నది నిజం. పోలీసులు చేపట్టిన చర్యలు బహిరంగమే. కేసులు.. కోర్టు లు కూడా బహిరంగమే. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నాయకులకు బెయిల్ విషయంలో, పాలనాపరమైన అడ్డంకులు ఎదురవుతున్న మాట కూడా అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణుల హెచ్చరికను భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం తీవ్రమైన సమస్యగానే పరిగణించాలి. యువత లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. నిరసనలను శత్రు చర్యలుగా కాకుండా, ప్రజల ఆందోళనలను అర్థం చేసుకునే అవకాశంగా చూడాలి. చట్టాన్ని అమలు చేసే సంస్థలు కూడా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. ప్రభుత్వాన్ని విమర్శించడం దేశాన్ని వ్యతిరేకించడం కాదు. అధికారుల నిర్ణయాలను ప్రశ్నించడం రాజ్యాంగ వ్యవస్థను కూలదోయాలనే ప్రయత్నం కాదు.
ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే హక్కు పౌరులకు ఉంటుంది. ఆ హక్కును వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ
విధానాలతో ఏకీభవించాల్సిన అవసరం లేదు. విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, న్యాయవాదులు, పౌరసమాజ ప్రతినిధులు లేవనెత్తే ప్రశ్నలు పాలనా వ్యవస్థలోని లోపాలను గుర్తించేందుకు కూడా ఉపయోగపడతాయి. ప్రజల అసంతృప్తిని పోలీసు చర్యలతో అణచివేయవచ్చని పాలకులు భావిస్తే,
సమస్యలు అసలుకే పరిష్కారం కాకుండా మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. నిరసనలను నిరోధించడం వల్ల తాత్కాలికంగా వీధుల్లో నిశ్శబ్దం ఏర్పడవచ్చు. కానీ ప్రజల మనసుల్లోని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.
సమస్యల పరిష్కారానికి చర్చలు, పారదర్శకత, బాధ్యతాయుతమైన నిర్ణయాలే సరైన మార్గాలు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలే తమ చర్యలను తామే సమర్థించుకోవడం కాకుండా, నిష్పాక్షిక విచారణకు అవకాశం కల్పించాలి. తప్పులు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బాధితులకు న్యాయం, తగిన పరిహారం అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలి. ప్రభుత్వాలు కావచ్చు… సంస్థలు కావచ్చు…వ్యక్తులు కావచ్చు. పొరపాట్లను సరిదిద్దుకుంటేనే భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకాన్ని కోల్పోతే, సర్వస్వం కోల్పోయినట్టే. మరింతగా నైతిక పతనం జరగక ముందే భారత ప్రభుత్వం మేల్కోవాలి. చర్చలకు ప్రాధాన్యతనివ్వాలి. సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ. ప్రభుత్వానికి గౌరవం.