Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

ఇలాంటి వారు గవర్నర్లా!?

Prajapaksham 16 Oct 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఇలాంటి వారు గవర్నర్లా!?

dushyanth gautham

మోదీ ప్రభుత్వ సిఫార్సు మేరకు నాలుగు రోజుల క్రితం రాష్ట్రపతి నియమించిన నలుగురు గవర్నర్‌లలో ఇద్దరు వివాదాల్లో చిక్కుకున్నారు. వారు ఒడిశా గవర్నర్‌ బ్రజ్‌ మోహన్‌ రామ్‌, సిక్కిం గవర్నర్‌ దుష్యంత్‌ గౌతమ్‌. ఇందులో ముఖ్యంగా దుష్యంత్‌ గౌతమ్‌ నియామకం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఈయన ఒక యువతి అత్యాచారం, హత్య కేసులో తన ప్రమేయంపై సిబిఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. సిక్కిం గవర్నర్‌గా ఈయన నియామకం జరిగిన వెంటనే, దానిని వ్యతిరేకిస్తూ బాధితురాలు అంకితా భండారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఇండియా గేట్‌ ఎదుట బుధవారం నిరసనకు దిగారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ వచ్చి వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. ఒక యువతికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న తరుణంతో దుష్యంత్‌ గౌతమ్‌ నియమకంపై పునరాలోచన చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు లేఖ రాశారు.
మరో వ్యక్తి జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన బ్రజ్‌ మోహన్‌ రామ్‌ ఒడిషా గవర్నర్‌గా నియమితులైన వెంటనే, తాను నిబద్ధత కలిగిన బిజెపి కార్యకర్తను అని అన్నారు. అంతే కాకుండా గవర్నర్‌గా నియమితుడైన వ్యక్టి ఒడిషాలో బిజెపిని సంస్థాగతంగా క్రియాశీలం చేసి, మరిన్ని ఓట్లు లభించేందుకు కృషి చేస్తానంటూ చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలు దూమారం రేపాయి. ఒకసారి ఎంఎల్‌ఏ, మూడు సార్లు ఎంపిగా గెలిచిన వ్యక్తికి గవర్నర్‌ పదవి, బాధ్యతల గురించి తెలియదనుకోవడం పొరపాటే. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా పార్టీలకు అతీతంగా నిష్పాక్షికంగా ఉండాల్సిన గవర్నరే ఆ రాష్ట్రంలో అధికార పార్టీని బలోపేతం చేస్తాననడం ఎలాంటి సంకేతాన్నిస్తోంది. గవర్నర్‌గా నియమితుడైన వ్యక్తి, తన గత రాజకీయ కార్యకలాపాలకు, భవిష్యత్‌ రాజ్యాంగ విధులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రదర్శించగలగాలి. ఒడిషాలో బిజెపి ప్రభుత్వమే ఉన్నందున పెద్ద ఇబ్బంది లేనప్పటికీ, సిక్కింలో పరిస్థితి వేరు. అక్కడ గతంలో బిజెపి మిత్రపక్షంగా ఉన్న సిక్కిం క్రాంతికారి మోర్చ(ఎస్‌కెఎం) మొత్తం 32 ఎంఎల్‌ఎల స్థానాలలో అన్నిటినీ గెలుచుకొని తిరుగులేని
మెజారిటీతో అధికారంలో ఉంది. తక్కువ స్థానాలు ఉండడంతో ఏమైనా జరగ
వచ్చనే అభిప్రాయం ఉంది.
మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ళలో గవర్నర్‌లు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వత్తాసుగా వ్యవహరిస్తున్నారు. బిజెపి, దాని మిత్రపక్షాల యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక అంశాలలో మోకాలడ్డడమే కాకుండా, పరిపాలనకు ఆటంకాలు సృష్టిస్తున్నారు. అలాంటి వారిలో తమిళనాడు గవర్నర్‌గా వ్యహరించిన ఆర్‌.ఎన్‌.రవి, కేరళ గవర్నర్‌గా వ్యవహరించిన రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ వంటి వారు ముఖ్యమంత్రులతో ప్రత్యక్షంగా తలపడడం చూశాము. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై సంతకం చేయకుండా ఏళ్ళ తరబడి నాన్చడం, వైస్‌ ఛాన్‌్సలర్‌ల నియామకాలలో తలదూర్చడం వంటి సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్యలకు ఒడిగట్టారు. రవి కుమార్‌ అయితే, తమిళులకు అత్యంత ప్రీతిపాత్రమైన తమిళ భాషపై ఉద్దేశ్యపూర్వక వివక్ష ప్రదర్శిస్తూ, హిందీకి ప్రాముఖ్యతనిచ్చేవారు.
శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయం ప్రకారం రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదిత ప్రసంగాన్ని కాకుండా తమకు నచ్చి న పంక్తులను చేర్చడమో, లేదా ఉన్నవాటిని విస్మరించటమో చేసేవారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం తమిళసై సౌందర్‌రాజన్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వం పంపిన ఫైళ్ళను ఆపిన ఉదంతం మరుగునపడలేదు. అలాగే గతంలో పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీలో సిఎంలుగా మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌లు ఉండగా, గవర్నర్‌లే ప్రత్యక్ష పరిపాలనలో తలదూర్చడం తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్‌ వాది అయిన ఆర్లేకర్‌ను తమిళనాడుకు పూర్తికాలం గవర్నర్‌గా నియమితులు కావటం విజయ్‌ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించక మానదు.
నిజానికి గవర్నర్‌గా వివిధ రంగాలలో నిష్ణాతులు, అనుభవజ్ఞులు, నైతిక విలువలతో గౌరప్రదులుగా గుర్తింపు ఉన్న వారిని నియమిస్తుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో రాజ్యాంగాధిపతిగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటూనే, సమాఖ్యవాదానికి పట్టంగట్టిన రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్ర సంబంధాలను సుహృద్భావ వాతావరణంలో నడపాల్సిన బాధ్యతలు గవర్నర్‌ భుజాలపైన ఉంటాయి. గవర్నర్‌ ప్రధానమంత్రికి రాజకీయ ప్రతినిధి కాదు, అలాగే ముఖ్యమంత్రికి బేషరతు మద్దతుదారుడు కూడా కాదు. ఆ పదవి రాజ్యాంగ పరిమితుల్లో పనిచేయాలి, న్యాయ నిర్ణయాలను గౌరవించాలి, అలాగే కేంద్ర అధికారానికి, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పాటించాలి. కానీ, ఇటీవల నియామకాలు లోక్‌భవన్‌లు అధికార పార్టీకి అనుబంధంగా మారుతున్నాయా అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒకే దేశం ఒకే ఎన్నిక వంటి కేంద్రీకృత చట్టాలను తీసుకురావాలని తలపోస్తున్న కేంద్రానికి రాష్ట్ర గవర్నర్‌ల పాత్ర కీలకంగా మారింది.
రాజ్యాంగబద్ధమైన పదవుల భర్తీలో అనుసరిస్తున్న తీరును, రాజ్యాంగ సంస్థలు, పదవులపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. నిజానికి బ్రిటీష్‌ పాలన నాటి అవశేషం లాంటి గవర్నర్‌ పదవి కొనసాగింపుపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం నియమించే గవర్నర్‌ పెత్తనమేమిటనే ప్రశ్న ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రస్ఫుటమవుతోంది. అందుకే గవర్నర్‌ వ్యవస్థను తొలగించాలనే డిమాండ్‌ కూడా ఉపందుకున్నది.
ఒడిషా గవర్నర్‌గా నియమితులైన బ్రజ్‌ మోహన్‌ రామ్‌ తన రాజకీయ అస్థిత్వాన్ని బహిరంగంగా చాటుకోవడం అందోళనకరం. ఒక సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్‌ గౌతమ్‌ నియామకం నైతిక విలువల పతనానికి పరాకాష్ఠ. ఆయన గవర్నర్‌గా ఉన్న కాలంలో సిబిఐ దర్యాప్తు నుంచి ఆయనకు రక్షణ ఉంటుంది. అలాంటప్పుడు ఒక యువతి దారుణ హత్యకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది. భేటీ బచావో అని నినాదాలు చేసే మోదీ ప్రభుత్వం ఈ నియామకం ద్వారా ఎలాంటి సంకేతాలిస్తోంది. ఈ రెండు నియామకాలు మోదీ ప్రభుత్వంలోని నైతిక పతనానికి నిదర్శనం. ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా సర్‌ పేరిట 13 కోట్ల ఓట్లను గాలిలో దీపంలాగా మార్చిన మోదీ సర్కార్‌, తాజాగా గవర్నర్‌ల నియమకాల ద్వారా మరో అడుగు పాతళంలోకి వేసింది. ఇప్పటికైనా ఆ రెండు నియామకాలను ఉపసంహరించుకుంటే గుడ్డిలో మెల్లలాగా పరువు దక్కుతుంది.