World Water Monitoring Day: మానవాళికి నీరే జీవనాధారం
World Water Monitoring Day
(18 సెప్టెంబర్ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినం సందర్భంగా)
World Water Monitoring Day : జీవులకు ప్రాణాధారం నీరు మాత్రమే. నీరు ఒక సార్వత్రిక ద్రావణి. జలం లేకుండా జీవనం సాగదు. ప్రకృతి ప్రసాదించిన సహజ అమూల్య వనరులుగా నీటి నిల్వలు కలిపిస్తాయి. నదులు, సరస్సులు, చెరువులు, వాగులు, సముద్రాలు, భూగర్భజలాలు లాంటి పలు నీటి వనరులు సకల ప్రాణికోటికి అందుబాటులో ఉన్నాయి. రసాయనశాస్త్రపరంగా నీటిని త్రిపరమాణుక విజాతీయ అణువుగా నామకరణం చేశారు. రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసి H2O అను రసాయన ఫార్ములాతో సూచించడం జరుగుతోంది. కలుషిత నీరు తాగితే కలరా, డయేరియా, టైఫాయిడ్, డిసెంట్రీ, హెపటైటిస్, మలేరియాసిస్ లాంటి తీవ్రమైన వ్యాధులు సోకుతాయి. మానవాళి ఎదుర్కొంటున్న 80 శాతం రోగాలకు కలుషిత తాగు నీరే కారణమని తెలుస్తున్నది. ప్రపంచ మరణాల్లో 5 శాతం వరకు కలుషిత నీటివల్ల కలుగుతున్నట్లు నిర్థారించారు. భారత్‌లో 70 మిలియన్ల మరణాలు డయేరియా కారణంగా నమోదు అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, విశ్వవ్యాప్తంగా ప్రతి ముగ్గురు జనాభాలో ఒక్కరు సురక్షిత నీటికి దూరంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
సురక్షిత తాగు, సాగు నీటి కోసం యుద్ధాలు వద్దు:
నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తరుచు గా నీటి నాణ్యతను పరీక్షించుకోవడం, సురక్షిత తాగు నీటి అవసరాలను అవగాహన పరచడం, సభలు/ సమావేశాలు నిర్వహించి నీటి పర్యవేక్షణ ప్రాధాన్యాన్ని వివరించడం లాంటి కార్యక్రమాలను చేపట్టాలి. నీటి రవాణాలో లీకేజీల ను అడ్డుకోవడం, నల్లా నీరు వృధా కాకుండా చూసుకోవడం, సూక్ష్మ సేద్యం చేయడం, స్ప్రింక్లర్లను వాడడం, నీటి పొదుపు పట్ల విద్యార్థులకు అవగాహన కలిపించడం లాంటివి వివరించాలి. గ్రామీణ భారతంలో 83 శాతం, పట్టణ జనాభాలో 91 శాతం జనాభాకు సురక్షిత నీరు లభిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పేదరి కం, అధిక జనాభా, నిరక్షరాస్యత వంటి కారణాలు కూడా సురక్షిత నీటి లభ్యతకు ప్రతిబంధకాలుగా పనిచేస్తున్నాయి. విద్య, వైద్యం, సురక్షిత తాగు నీరు లభించడం ఒక ప్రాథమిక హక్కు అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద అధికంగా ఉన్నది. నీటిని పొదుపుగా వాడుకుంటూ, కలుషితం కాకుండా చూసుకుంటూ, ఆయురారోగ్యాలతో మనుగడ సాగిద్దాం, నీటి ఆధార అనారోగ్యాలకు అడ్డుకట్ట వేద్దాం.