Skip to content
జాతీయం వార్తలు

UPI Charges Row: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపు.. మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గిందంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..

jagan 15 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
UPI Charges Row: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపు.. మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గిందంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..

Women Reservation: షరతులు లేకుండా మహిళా కోటా అమలు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్

UPI Charges Row: కేంద్ర ప్రభుత్వ నూతన డిజిటల్ చెల్లింపుల మార్గదర్శకాలపై రాజకీయ దుమారం రేగుతోంది. రూ. 2,000 దాటిన యూపీఐ (UPI) వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా తలుపులు తెరిచిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘X’ వేదికగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు మొత్తం యూపీఐ పరిమాణంలో కేవలం 5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, లావాదేవీల విలువ పరంగా చూస్తే ఏకంగా 65 శాతం వాటాను కలిగి ఉన్నాయని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. బ్యాంకులు వ్యాపారులపై ఎండీఆర్‌ రుసుము విధించినప్పటికీ, ఆ అదనపు ఖర్చును వ్యాపారులు వస్తువుల ధరల్లో కలిపి చివరికి వినియోగదారులపైనే ఆ భారాన్ని మోపుతారని ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికా చెల్లింపుల సంస్థలు చాన్నాళ్లుగా వ్యతిరేకిస్తున్న ‘జీరో-ఎండీఆర్’ విధానాన్ని పక్కనపెట్టి కేంద్రం వారి ఒత్తిడికే తలొగ్గుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా స్పందిస్తూ, ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న సామాన్యుల జేబులకు చిల్లు పొడిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

మరోవైపు, ఈ విమర్శలపై స్పందిస్తూ యూపీఐ వ్యవస్థ సుస్థిరత కోసమే ఈ నిర్ణయమని కేంద్ర వర్గాలు వివరణ ఇచ్చాయి. యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ భద్రత, మోసాల నివారణ, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం నిధులు అవసరమవుతున్నాయని స్పష్టం చేశాయి. కేవలం ప్రభుత్వ సబ్సిడీలపైనే ఆధారపడి డిజిటల్ చెల్లింపుల తదుపరి దశ వృద్ధిని సాధించడం సాధ్యం కాదని, కొత్త సంస్థలు పోటీలోకి రావాలన్నా స్థిరమైన ఆదాయ నమూనా అవసరమని పేర్కొన్నాయి. ఎండీఆర్ రేట్లను నిర్ణయించే బాధ్యతను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్టీరింగ్ కమిటీకి అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.