Telangana Assembly Session: 59 వేల నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన..
Ponguleti
Telangana Assembly Session: తెలంగాణలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా గుడిసెల్లో జీవిస్తున్న సుమారు 59 వేల నిరుపేద కుటుంబాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శాసనసభలో గురువారం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ గృహ నిర్మాణ పథకం అమలు తీరును సభకు వివరించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొత్తం 8 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వంపై సుమారు రూ. 40 వేల కోట్ల ఆర్థిక భారం పడుతుందని మంత్రి తెలిపారు. ఇందులో తొలివిడతగా మంజూరు చేసిన 4.5 లక్షల ఇళ్లకు రూ. 22,500 కోట్లు, రెండో విడతలోని 2.5 లక్షల ఇళ్లకు రూ. 11,000 కోట్లు, అలాగే పట్టణ ప్రాంతాల్లో నిర్మించే లక్ష ఇళ్లకు సుమారు రూ. 5,500 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఎకరం రూ. 150 నుండి 200 కోట్ల విలువ చేసే ఖరీదైన ప్రాంతాల్లో కూడా పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే సంకల్పంతో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఇళ్లను మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు.
‘క్యూర్’ (CURE) పరిధిలోని 16 నియోజకవర్గాల్లో తుది జాబితాను 2-3 రోజుల్లో పూర్తి చేసి, ఒక్కో నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున నిర్మాణాలు ప్రారంభించి వచ్చే బోనాల నాటికి లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. నగరంలో ఒక నియోజకవర్గానికి చెందిన వారు మరో నియోజకవర్గ డ్రాలో ఎంపికైతే వారిని తొలగిస్తామని, పాతబస్తీలో ప్రభుత్వం నిర్మించిన పాత ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని తెలిపారు.
లబ్ధిదారులకు నిర్మాణ ఖర్చులు తగ్గించేందుకు సిమెంట్ బస్తా మార్కెట్ ధర రూ. 320 వరకు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్లకు రూ. 230కే సరఫరా చేసేలా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. త్వరలోనే స్టీల్ కంపెనీలతో కూడా చర్చించి రాయితీ ధరలను వర్తింపజేస్తామని చెప్పారు. మొదటి విడతలో చిన్నపాటి లోపాలతో ఆగిపోయిన 3,200 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బకాయి ఉన్న చెల్లింపులను వారంలోగా పూర్తి చేస్తామన్నారు.
ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన జాబితా నుండి కూడా కేవలం అర్హతనే ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులను పారదర్శక డ్రా ద్వారా ఎంపిక చేస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో పాటు గతంలో నిర్మించిన రెండు పడక గదుల (డబుల్ బెడ్‌రూమ్) ఇళ్ల మరమ్మతుల కోసం రూ. 750 కోట్లు కేటాయించామని, సొంతంగా ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని డ్వాక్రా మహిళలకు రూ. లక్ష అడ్వాన్సుగా అందించే వెసులుబాటు కల్పించామని వివరించారు.
- Voter List Revision: ఓటర్ల జాబితా సవరణ.. సినీ ప్రముఖులకు నోటీసులు..లిస్టులో రాజమౌళి, మహేష్ బాబు, సమంత, విజయ్ దేవరకొండ ఇతరులు..
- Telangana Assembly Session: సభను అడ్డుకునేందుకు కేసీఆర్ ఫాంహౌస్‌లో కుట్రలు.. సిఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
- Telangana Assembly Session: 59 వేల నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన..
- Telangana Assembly Session: ఉద్యోగులకు దేశంలోనే ఉత్తమ ప్రమాద బీమా పథకం అందిస్తున్నాం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
- 15 ఏళ్ల నా కల ‘పంచనామా’.. ఉదయభాను