నిజాం నిరంకుశ పాలనను గడగడలాడించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం
The Telangana Peasants' Armed Struggle that shook the Nizam's autocratic rule.
కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నిజాం ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఫ్యూడల్ ప్రభువుల అణిచివేత దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన మహోన్నతమైన జనం నడిపి న విప్లవ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. “బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాం సర్కారోడ అంటూ”, “దొర ఏందిరో నీ దొరతనం ఏంటిరో” అంటూ నిజాం నవాబ్, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ ప్రజలను అందరినీ ఏకం అయ్యే లా చేసింది.
కష్టాలు, కన్నీళ్లు, వెట్టిచాకిరీ, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అవమానాలే ఆ మట్టి మనుషులను తట్టి లేపాయి. ఆలోచనలే పునాదులు అయ్యాయి. పనిముట్లే ఆయుధాలయ్యాయి. గడ్డి కోసిన చేతులే గొడ్డళ్లను ఎత్తాయి. దండం పెట్టిన చేతులే కొడవళ్లను పట్టాయి. ‘బాంచన్ దొర, కాల్మొక్తా’ అన్న గొంతులే భూస్వాములు, పటేళ్లు, దొరల అరాచకాలపై గర్జించాయి. ఈ పరిణామాలే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారాయి. జనం నడిపిన విప్లవమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని ఒక్క మాటలో అనవచ్చు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, నిజాం నవాబ్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం చరిత్రలో మరువలేనిది.
నిజాం పాలనలో గ్రామాలన్నీ భూస్వాములు, పెత్తందార్లు, పట్లేళ్లు, పట్వారీల చేతుల్లో ఉండేవి. జమిందార్, దేశ్ ముఖ్ పేరుమీద రెవెన్యూ వ్యవస్థ నడిచేది. వీరందరూ నిజాం సర్కార్‌కు తొత్తులుగా ఉండేవారు. అసలు వీరి పేరు చెబితేనే తెలంగాణ పల్లెలు గజగజ వణికిపోయేవి. వీరు పల్లెల్లో ఉంటూ నిట్టనిలువునా దోచుకునేవారు. నైజాం ప్రభుత్వం విధించే పన్నులను దేశ్‌ముఖ్‌లు, దేశ్ పాండేలు వసూలు చేసే వారు. ఈ క్రమంలో అనేక ఘోరాలకు పాల్పడేవారు. రైతుల పంటను శిస్తు కింద గుంజుకునేవారు. భూమలను గుంజుకోవటమే కాదు కౌలు రైతులను చిత్రహింసలకు గురి చేసేవారు. ప్రతిదానికి పన్ను కట్టాల్సిందే. గ్రామాల్లో ఉండే దొరలు, భూస్వాములు, పటేళ్లు, పట్వారీల ఇళ్లలో ఏదైనా పండగ జరిగినా వీరు పన్ను కట్టాల్సిందే. వీరి అరాచకాలను భరించలేకనాటి తెలంగాణ ప్రాంతంలోని గ్రామాల్లో వెట్టిచాకిరీ వ్యవస్థను నిర్మూలించడం, దున్నేవాడికి భూమి దక్కాలనే నినాదంతో పోరాడారు. భూస్వాములకు, దేశ్‌ముఖ్‌లకు, జాగీర్దార్లకు, దేశ్‌పాండేల కు వ్యతిరేకంగా ప్రజలు కమ్యూనిస్టు నాయకత్వం పిలుపుతో ఉద్యమించారు. రజాకార్ల అరాచకాలకు, నిజాం నవాబుల దమనకాండకు విరుగుడుగా సాయుధ పోరాటం ఆరంభమయ్యింది. రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి సాయుధ పోరాటానికి పిలుపునివ్వగా, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దొడ్డి కొమురయ్య, చిట్యాల ఐలమ్మ, అనభేరి ప్రభాకర్ రావు, బొమ్మగాని ధర్మ బిక్షం లాంటి వారు పాల్గొనడంతో తెలంగాణ సాయుధ పోరాటం పతాకస్థాయికి చేరింది.
దేశానికి ఆగస్టు15న స్వాతంత్య్రం వచ్చినా
నిజాం పాలనలోనే ఉన్న తెలంగాణ
భారతదేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్ట్ 15న వచ్చిన నాటి హైదరాబాద్ సంస్థానం ఇంకా నిజాం అధీనంలో ఉంది. 16 జిల్లాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందినవి 8 జిల్లాలు ఉండేవి. మిగతావి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల పరిధిలో ఉండేవి. ఈ ప్రాంతాలన్నీ నిజాం చేతుల్లో ఉండేవి. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ముగ్గురు కమ్యూనిస్టు నాయకుల పిలుపుతో సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రజలు గ్రామాల్లో ప్రజా ఉద్యమాలు మొదలు పెట్టారు. చాలా పల్లెల్లో గ్రామ దళాలు ఏర్పడ్డాయి. జనం ఏకమయ్యారు. పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకొని దున్నేవాడికే భూమి అనే నినాదంతో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో భూపోరా టం కొనసాగింది. సాయుధ దళాలు ప్రజలకు దిశా నిర్దేశం చేస్తూ దొరల, భూ స్వాముల కబంధ హస్తాల నుండి ఒక్కొక్క గ్రామాన్ని విముక్తి చేస్తూ 3000 గ్రామాలలో పది లక్షల ఎకరాలను ప్రజలకు పంచిన ఘనమైన చరిత్ర ఈ మహోత్తర పోరాటానిది. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దాదాపు 4వేల మందికి పైగా అసువులు బాసారు. పోరాటపటిమకు తలొగ్గిన నిజాం రాజు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం లో విలీనం చేశారు. అంటే ఒక సంవత్సరం కాలం అనంతరం 1948 సెప్టెంబర్ 17న ఒక సంవత్సరం ఆలస్యంగా తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రావడం జరిగింది.
తెలంగాణ సాయుధ పోరాటంలో విద్యార్థుల పాత్ర కీలకమైనది
తెలంగాణ సాయుధ పోరాట సంగ్రామంలో ప్రజలకు సామాజిక చైతన్యం కల్పించడం కోసం విద్యార్థులు రైతుల బస్తీల్లోకి వెళ్లి అణగారిన ప్రజలకు జమీందారీ వ్యవస్థ అన్యాయాలను తెలియజేశారు. అక్షరాస్యత పెంచేందుకు చిన్న చిన్న బడి తరగతులు వారి ఇంట్లోనే రహస్యంగా నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ నిజాం పాలనకు వ్యతిరేకంగా నినాదాలు, ప్రదర్శనలు, మానవహక్కుల కోసం నిరసనలు చేపట్టారు. ప్రజలతో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు నేరుగా గెరిల్లా దళాలలో చేరి పోరాటంలో పాల్గొని అమరులయ్యారు.
కొంతమంది విద్యార్థులు సమాచారం సేకరించ డం, రహస్య పత్రికలు పంపించడం, ఆయుధాలను తరలించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు పాటలు, నాటకాలు, వీధి నాటకాల ద్వారా రైతుల్లో చైతన్యం రేకెత్తించారు. 1948 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు అని ఉమ్మడి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని పాఠశాల విద్యార్థులు పాఠశాల లో జాతీయ జెండా ఎగురవేస్తే నిజాం పాలకులు 10మంది విద్యార్థులను సజీవదహనం చేశారు.
కర్నాటక, మహారాష్ట్రలో అధికారికంగా విలీన దినం జరుపుతున్నా తెలంగాణలో ఎందుకు జరపడం లేదు?
సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండి నేడు కర్ణాటక, మహారాష్ట్ర కలిసిన జిల్లాల్లో హైదరాబాద్ విలీన దినోత్సవాలను ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పటినుండో అధికారికంగా నిర్వహిస్తున్నాయి. కానీ ఉమ్మడి ఆంధ్రాలో సాధ్యం కాలేదు. వారు ఆంధ్ర పాలకులు తెలంగాణను విస్మరించారు. ఆనాటి సాయుధ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం ఉద్యమిద్దాం. వచ్చే మన రాష్ట్రంలో మన సాయుధ పోరాట వీరులను మనం స్మరించుకుందామని మాట్లాడిన కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సెప్టెంబర్ 17 విలీన దినోత్సవం అధికారికంగా నిర్వహించలేకపోయాడు. కనీసం తెలంగాణ సాయుధ పోరాట యోధులను గుర్తించలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సాయుధ పోరాట యోధులను గుర్తించి సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
చరిత్రను మతాల మధ్య ఘర్షణగా చిత్రీకరించకూడదు
నేడు ఓట్ల కొరకు తెలంగాణ సాయుధ పోరాటం హిందూ, ముస్లింలకు మధ్య జరిగినట్టు బిజెపి చేస్తున్న ప్రచారం పూర్తి గా అవాస్తవం. సెప్టెంబర్ 17 చరిత్ర గురించి మాట్లాడుతున్న కొన్ని పార్టీలు ఆ ఉద్యమంలో మీ ఆనవాలు ఎక్కడ అంటే చెప్పలేని స్థితి. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను మతపరమైన కోణంలో వక్రీకరించకుండా, వాస్తవ చారిత్రక నేపథ్యాన్ని ప్రజలకు తెలుపాలి. ఈ పోరాటం ప్రధానంగా నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం తప్ప మతాల మధ్య జరిగింది కాదు.
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, సెప్టెంబర్ 17ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అంటున్న కాంగ్రెస్ నేడు రాష్ట్రంలో అధికారంలో ఉంది వారే కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఊరూ వాడా ఉత్సవాలు ప్రభుత్వపరంగా నిర్వహించాలి.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సభలు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పోరాట యోధుల త్యాగాలను ప్రజలకు తెలియజేయాలి. తెలంగాణ సాయుధ పోరాట యోధుల వర్ధంతి, జయంతులను అధికారికంగా నిర్వహించేలా కృషి చేయాలి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా నేటితరం విద్యార్థులకి ఆనాటి చరిత్ర తెలుస్తుంది. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.