Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

తెలంగాణ పొద్దు పొడుపు మన కాళోజీ

Prajapaksham 09 Sep 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
తెలంగాణ పొద్దు పొడుపు మన కాళోజీ

Kaloji Narayana Rao

డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌ రెడ్డి

(09 సెప్టెంబర్‌ తెలంగాణ భాషా దినోత్సవం శుభ సందర్భంగా)

దేశ భాషల్లో తెలుగు భాష కడు తియ్యన. తెలుగు భాషలో ప్రాంతీయ మట్టి వాసనలు, శ్రమజీవుల ఆత్మీయ కలయికతో పలు రకాల యాసలు పుట్టుకొచ్చాయి. తెలంగాణ ప్రాంతం శతాబ్దాలుగా పలు రాచరిక పాలనలు, ముఖ్యంగా నిజాం పాలనతో ఇక్కడి ప్రజల తెలుగు భాషలో ఉర్దూ, హిందీ, పర్షియన్‌, కన్నడ, మరాఠీ పదాలు మిళితమై ఈ భాష విలక్షణ రూపం దాల్చడం విశేషం. తెలంగాణ తెలుగు భాష, యాస, అందుకోని పలుకుబడులు ఇక్కడి జనుల జీవన విధానాలతో మమేకమై తియ్యదనాన్ని, అమాయకత్వాన్ని సంతరించుకున్నాయి. ఈ ప్రాంత ప్రజల సంస్కృతి, వారసత్వం, చారిత్రక వైభవం, పరాయి భాషా పదాల చేరికతో తెలంగాణ తెలుగుకు ప్రత్యేక సుగంధాలు అద్దబడ్డాయి.
తెలంగాణ భాషా దినోత్సవం – 2026 :
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రముఖ తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా 09, సెప్టెంబర్‌ రోజున తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం ఓ అద్భుత ఆచారంగా మారింది. కాళోజీ 100వ జయంతి సందర్భంగా 2014 నుంచి ఆయన జయంతి రోజు తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవ డం కొనసాగుతున్నది. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భం గా ఆంధ్రప్రదేశ్‌లో 29 ఆగష్టు రోజున తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తున్నారని మనకు తెలుసు. తెలంగాణ పొద్దుపొడుపు కాళోజీ. తెలంగాణ తెలుగు భాష అస్తిత్వం నిలపడానికి కాళోజీ చేసిన కృషి మరువలేనిది. 09, సెప్టెంబర్‌ 1914 రోజు రంగారావు- రామాబాయమ్మలకు కర్ణాటకలో జన్మించిన కాళోజీ నారాయణ రావు కుటుంబం వరంగల్‌ మడికొండలో స్థిరపడిన ఒక నడిచే తెలంగాణ తెలుగు నిఘంటువు. ఒక కవన శిల్పి. రాజకీయ చైతన్య ప్రజాకవి. నిర్భయంగా భాషతో వాతలు పెట్టిన ప్రజావాది. పుట్టుక, చావు నీది -జీవితం అంతా దేశానిది అన్న తెలంగాణ ఉద్యమ కెరటం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలంతో గళమెత్తిన ధీరుడు. తెలంగాణ శ్రమజీవుల పక్షపాతి, మహా వైతాళికుడు మన కాలేజీ. స్వాతంత్య్ర సమరయోధుడు. తెలంగాణ ఉద్యమకారుడు.
బహుభాషావేత్త ప్రజాకవి కాళోజీ :
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అన్న కాళోజీ కలం అక్షరాలకు ఆవేశం పుట్టించిన తీరు అనన్యసామాన్యం. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం పొందిన బహుభాషావేత్త మన కాళోజీ. రాజకీయ వ్యంగ్య కవిత్వం, తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆచారవ్యవహారాలు, ఆగ్రహం, పరాయి పాలకుల వ్యతిరేకి అయిన కాళోజీ తన రచనలను ఆయుధాలుగా సాధించడంలో దిట్ట అని నిరూపించుకున్నారు. హైదరాబాద్‌, హన్మకొండల్లో చదివి ఉస్మానియా నుంచి న్యాయపట్టా పొందారు. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారు. 1940లో రుక్మిణీబాయిని వివాహం చేసుకున్నారు. పి.వి నర్సింహారావుతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. నిజాం పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తల్లి చనిపోయిన తర్వాత అన్న ఉర్దూ కవి కాళోజీ రామేశ్వరరావు పెంపకంలో ఎదిగారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నిక అయ్యారు.
విశిష్ట పురస్కారాల సుగంధ మాల :
సాహితీవేత్తగా కాళన్న చేసిన పలు రచనల్లో నా గొడవ, ఇదీ నా గొడవ, జీవన గీత, తుది విజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు, బాపు బాపు బాపు, కాళోజీ కథలు లాంటివి ముఖ్యమైనవి. కాళోజీ నారాయణ రావు జీవితం తెలంగాణ ప్రజలకే అంకితం. ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వ పద్మ విభూషణ్‌(1992), తామ్రపత్రి పురస్కారం(1972), ఎపి ప్రభుత్వ అనువాద పురస్కారం (1969), బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్‌ పురస్కారం (1981), తెలంగాణ ప్రజలకే ప్రేమగా ప్రజా కవి బిరుదు, పలు సాహితీ సంఘాల పురస్కారా లు, కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌(1992), రామినేని/గాడిచర్ల పౌండేషన్‌ అవార్డు, గురజాడ అవార్డు (1996), మద్రాస్‌ కళాసాగర్‌ పురస్కారం (1996) లాంటివి ఎన్నో కాళోజీ చేతుల్లోకి చేరి మురిసిపోయాయి.
‘హింస తప్పు – రాజ్య హింస మరీ తప్పు అంటూ సామాన్యుడే నా దేవుడు’ అన్న కాళోజీ 13 నవంబర్‌ 2002 రోజు తుది శ్వాస విడిచారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు ప్రతిగా ప్రభుత్వం వరంగల్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ, హనుమకొండలో సమావేశ మందిరానికి కాళోజీ కళాక్షేత్రం అని పేరు పెట్టడం జరిగింది.