జీవితం అమూల్యం… జిందగీని ప్రేమించండి !
జీవితం అమూల్యం… జిందగీని ప్రేమించండి !
వై. సంజీవ కుమార్
ఫౌండర్ & ప్రెసిడెంట్, ఫౌండేషన్
రోజురోజుకూ సమాజంలో వినిపిస్తున్న ఆత్మహత్యల వార్తలు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు అరుదుగా కనిపించే ఈ ఘటనలు ఇప్పుడు దాదాపు ప్రతి వయసు, ప్రతి వర్గం, ప్రతి వృత్తిలో కనిపిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, గృహిణులు, యువత, వృద్ధులు… ఎవ్వరూ ఈ సమస్యకు అతీతులు కారు.
సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందుకు సాగింది. సమాచార విప్లవం, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష విజయాలు, డిజిటల్ జీవనం అన్నీ మనిషి జీవితాన్ని సులభతరం చేశాయి. కానీ, అదే సమయంలో మానసిక ఒత్తిడి, ఒంటరితనం, పోటీ, అంచనాలు కూడా పెరిగాయి. ఫలితంగా ఎదురయ్యే చిన్న సమస్యలను కూడా భరించలేని పరిస్థితికి కొందరు చేరుకుంటున్నారు.
ఆత్మహత్యకు ఒకే ఒక్క కారణం ఉండదు. అనేక వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆర్థిక, మానసిక అంశాలు కలిసి ఒక వ్యక్తిని తీవ్ర నిరాశలోకి నెట్టవచ్చు. చాలా సందర్భాల్లో సమస్య కంటే, ‘దీనికి పరిష్కారం లేదనే భావన’ ప్రమాదకరంగా మారుతుంది.
విద్యార్థుల్లో పెరుగుతున్న ఆందోళన నేటి విద్యా వ్యవస్థలో మార్కులు, ర్యాంకులు, ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. పిల్లలపై తల్లిదండ్రుల అంచనాలు, సమాజం చూపే పోలికలు, సోషల్ మీడియా ప్రభావం, తోటి విద్యార్థుల విజయాలతో తమను తాము తక్కువగా భావించడం వంటి కారణాలు తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి.
ఒక పరీక్షలో విఫలం కావడం అంటే జీవితం విఫలమైనట్లు కాదు. చరిత్రలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు మొదటి ప్రయత్నంలో విజయం సాధించలేదు. వైఫల్యం ఒక పాఠం మాత్రమే. అది జీవితానికి ముగింపు కాదు.
విద్యార్థులే కాదు, ఉద్యోగులు, అధికారులు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగ జీవితంలో పనిభారం, లక్ష్యాల ఒత్తిడి, పై అధికారుల ప్రవర్తన, ఉద్యోగ భద్రతపై భయం, కుటుంబ బాధ్యతలు కలిసి మానసిక ఒత్తిడిని పెంచుతాయి. కొందరు తమ సమస్యలను ఎవరికీ చెప్పకుండా మనస్సులోనే దాచుకుంటారు. ఈ మౌనం క్రమంగా తీవ్ర నిరాశకు దారితీయవచ్చు. ఉద్యోగం కోల్పోతే మరో ఉద్యోగం వెతుక్కోవచ్చు. కానీ, జీవితాన్ని కోల్పోతే తిరిగి పొందలేం. అందుకే సమస్యలను పంచుకోవడం, అవసరమైతే సెలవు తీసుకోవడం, వృత్తిపరమైన సహాయం పొందడం బలహీనత కాదు, బాధ్యత అనే విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి.
కుటుంబాల్లో సైతం మారుతున్న సంబంధాలు
కుటుంబం అనేది మనిషికి మొదటి అండ. కానీ, అదే కుటుంబంలో అపార్థాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్తా-కోడళ్ల సమస్యలు, పిల్లలతో దూరం, సక్సెస్ అవ్వలేదనే భావన వంటి అంశాలు మానసిక వేదనకు కారణమవుతున్నాయి.
ప్రతి ఇంట్లో అభిప్రాయ భేదాలు సహజం. మాట్లాడుకుంటే పరిష్కారం దొరకని సమస్యలు చాలా తక్కువ. పరస్పరం వినడం, అర్థం చేసుకోవడం, గౌరవించడం కుటుంబ బంధాలను బలపరుస్తాయి. మనం మారలేము, ఎదుటివారిని మార్చలేమనుకుంటే కుటుంబం నుంచి విడిపోయి, ఎవ్వరికి వాళ్లు ఉంటూ, ఎక్కడైనా కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటూ ఉండడం కూడా ఒక మార్గమే.
ప్రేమ, నిరుద్యోగం, ఒంటరితనం… యువతలో ప్రేమలో విఫలం కావడం, నిరుద్యోగం, భవిష్యత్తుపై అనిశ్చితి, సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో తమను పోల్చుకోవడం వల్ల ఆత్మన్యూనత భావం పెరుగుతోంది. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే, మొత్తం జీవితం కాదు. మీ ప్రేమను వదులుకునేందుకు వాళ్లు సిగ్గుపడేలా, తలదించుకునేలా బ్రతకండి. మీ తల్లిదండ్రుల కష్టాలను తలచుకోండి. మీకు ఏ ప్రేమ గొప్పదో కూడా తెలుస్తుంది.
అలాగే ఉద్యోగం దొరకకపోవడం, ఆలస్యమవడం లాంటివి ఎదురైతే అవకాశాలు ముగిసిపోయినట్లు కాదు. ప్రతి ఒక్కరి జీవితం విభిన్న ప్రయాణం. చదివిన చదువుకే ఉద్యోగం అంటే, చదివిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు దొరకవు. చదువు విజ్ఞానం పెంచడానికి, ఉద్యోగం అనేది ప్రయత్నం మాత్రమే. బ్రతకడానికి అనేక మార్గాలున్నాయి. ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలి. అందరికీ ఆదర్శంగా ఉండేలా బ్రతికి చూపించాలి.
మరోవైపు రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సవాళ్లు
రైతులకు ప్రకృతి వైపరీత్యాలు, అప్పులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, వ్యాపారులకు ఆర్థిక నష్టాలు, మార్కెట్ ఒడిదుడుకులు తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. రైతులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వేరే పంటల సాగు చేయాలి. వ్యాపారస్తులు చేస్తున్న వ్యాపారంలో నష్టం వస్తే మరో వ్యాపారం వైపు దృష్టి పెట్టాలి.
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి చాలామంది నష్టపోతున్నారు. షేర్ మార్కెట్ అనేది ఒక మాయ ప్రపంచంలాంటిది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. అత్యాశకు వెళ్లి సర్వం పోగొట్టుకుంటున్నారు. ఒక్కసారి నష్టం వచ్చినప్పుడు మరో మార్గాన్ని అన్వేషించాలి. పోయిన చోటే వెతకడం అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే అవుతుంది.
సినిమాలో సక్సెస్ అవ్వలేదని, మోడలింగ్ రంగంలో గుర్తింపు రాలేదని, సమాజంలో గుర్తింపు రాలేదని, సోషల్ మీడియాలో ఫాలోయర్స్ లేరని, లైక్స్ లేవని, ఎవరో ఏదో కామెంట్ చేశారని… ఇలా అనేక కారణాలతో జీవితాలను వదిలేసుకుంటున్నారు. ఒక్క రంగం కాకపోతే మరో రంగం ఉంది. ప్రపంచం చాలా విశాలమైనది, విస్తరించి ఉన్నది అనే విషయాన్ని గుర్తెరగాలి. ఒత్తిడికి గురైన సందర్భంలో మనస్సులోని బాధను నమ్మకమైన వారితో పంచుకోవడం మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టే అవుతుంది.
ఆత్మహత్యల నివారణకు కుటుంబ సహకారం, ప్రభుత్వ అవకాశాలు, ఆర్థిక సలహాలు, సామాజిక మద్దతు ఎంతో అవసరం. బలవన్మరణాల నివారణకు అందరి పాత్ర అవసరమే. ఆత్మహత్యల నివారణకు ఒక్క ప్రభుత్వ చర్యలు సరిపోవు. కుటుంబం, పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగ సంస్థలు, మీడియా, స్వచ్ఛంద సంస్థలు, సమాజం… అందరూ కలిసి పనిచేయాలి.
తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజూ మాట్లాడాలి. ఉపాధ్యాయులు దండనకు, మార్కులకే కాకుండా విద్యార్థుల భావోద్వేగాలను కూడా గుర్తించాలి. కార్యాలయాల్లో మానసిక ఆరోగ్యానికి అనుకూల వాతావరణం ఉండాలి. మీడియా సంచలనాత్మక కథనాల కంటే అవగాహన పెంచే కథనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తొలగించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం కోరడం సహజం. అది బలహీనత కాదు, సమస్యను ఎదుర్కొనే ధైర్యానికి నిదర్శనం.
జీవితంలో కష్టాలు, వైఫల్యాలు, అవమానాలు, నష్టాలు… ఇవన్నీ శాశ్వతం కావు. కాలం మారినట్లు పరిస్థితులు కూడా మారతాయి. ఈ రోజు అసాధ్యంగా కనిపించే సమస్య రేపు ఒక జ్ఞాపకంగా మారవచ్చు. అందుకే క్షణికావేశంలో శాశ్వత నిర్ణయం తీసుకోవద్దు.
మీ చుట్టూ బాధలో ఉన్నవారిని గమనించండి. వారికి తీర్పు ఇవ్వకుండా ఓపికగా వినండి. అలా చేస్తే వాళ్లలో సగం మనసు భారం తగ్గుతుంది. అవసరమైనప్పుడు అండగా నిలబడండి. ఒక ఆప్యాయమైన పలకరింపు, కొంత సమయం, దూరంగా ఉన్నవాళ్లకు ఒక ఫోన్ కాల్, “నేను ఉన్నాను” అని చెప్పే మాట… కొన్నిసార్లు ఒక ప్రాణాన్ని కాపాడగలదు.
ఉన్నది జీవిస్తున్న జిందగీ ఒక్కటే. జిందగీని ప్రేమించండి, సమస్యలను కాదు. మీ జిందగీ మీకే కాదు, మీ కుటుంబానికి, సమాజానికి కూడా ముఖ్యమే. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. వెతికేయండి. ధైర్యంగా, నమ్మకంతో జీవితాన్ని సాగించండి.