Skip to content
ప్రపంచం వార్తలు

నేను లేకపోతే వార్తా పరిశ్రమ దివాళా తీస్తుంది… వైట్ హౌస్ డిన్నర్‌లో పాత్రికేయులపై విరుచుకుపడిన ట్రంప్

Prajapaksham 26 Jul 2026 0 నిమిషాల పఠనం ప్రపంచం
నేను లేకపోతే వార్తా పరిశ్రమ దివాళా తీస్తుంది… వైట్ హౌస్ డిన్నర్‌లో పాత్రికేయులపై విరుచుకుపడిన ట్రంప్

నేను లేకపోతే వార్తా పరిశ్రమ దివాళా తీస్తుంది… వైట్ హౌస్ డిన్నర్‌లో పాత్రికేయులపై విరుచుకుపడిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గడచిన ఏప్రిల్‌లో వైట్ హౌస్ పాత్రికేయులకు ఏర్పాటు చేసిన డిన్నర్ కార్యక్రమం ఆయనపై హత్యాయత్నం ఘటనతో రసాభాసగా మారిన తర్వాత, మరోసారి శుక్రవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ కార్యక్రమం హాస్యోక్తులు, పాత్రికేయులపై ప్రశంసలతో సాగినప్పటికీ, కొంతమంది జర్నలిస్టులను ఉద్దేశించి అవమానకరమైన విమర్శలు చేశారు. చాలా కఠిన పదజాలం ఉపయోగించారు. రెండోసారి కలుసుకోవడం ఉత్తమంగా ఉంటుందన్నారు. చాలామంది జర్నలిస్టులను తాను గౌరవిస్తానన్నారు. తనకు వ్యతిరేకంగా నకిలీ వార్తలు రాస్తున్నారని విమర్శించారు.

మీలో కొందరికి నేను నచ్చనన్నారు. తాను లేకపోతే వార్తలు ఉండవని, వార్తా పరిశ్రమ దివాళా తీస్తుందని చమత్కార బాణాలు విసిరారు. 2028లో రూపం మార్చి టోపీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. పాత్రికేయులు నిష్పక్షపాతాన్ని కోల్పోయారని విమర్శించారు. కొందరు పాత్రికేయులను ఉద్దేశించి పరోక్షంగా ఆయన సూటి దూషణలు చేశారు. “మనం తూటాలతో కాకుండా చర్చలతో పరిష్కరించుకుందాం” అన్నారు. కొందరు పాత్రికేయులు తనకు వ్యతిరేకంగా నకిలీ వార్తలు రాస్తున్నారని, చాలామంది జర్నలిస్టులు “ట్రంప్ డీరేంజ్‌మెంట్ సిండ్రోమ్” (ట్రంప్ వ్యతిరేక ఉన్మాదం)తో బాధపడుతున్నారని విమర్శించారు. అంటే ఎలాంటి మనోవైకల్యం లేకపోయినా ఒక నాయకుణ్ణి లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా విమర్శలు, దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది.

జార్జి డబ్ల్యూ. బుష్ అధికారంలో ఉన్నప్పుడు కన్జర్వేటివ్ కాలమిస్టు ఛార్లెస్ క్రౌతామర్ మొదటిసారి ఈ పదబంధాన్ని సృష్టించారు. తనను లక్ష్యంగా చేసుకుని ద్వేషంతో విమర్శల దాడులు చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. ఈ సందర్భంగా తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన పాత్రికేయులకు కూడా ఆయన చిరునవ్వుతో అవార్డులు అందజేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వార్తలు రాసిన వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టుల బృందం కూడా ట్రంప్ నుంచి అవార్డులు తీసుకున్నవారిలో ఉంది. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని కూడా ఆయన అమెరికన్లకు పిలుపునిచ్చారు. ఈ వేదికపై డబ్ల్యూహెచ్‌సీఏ అధ్యక్షురాలు వీజియా జియాంగ్ పాల్గొన్నారు. గత ఏప్రిల్‌లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ (డబ్ల్యూహెచ్‌సీఏ)కు డిన్నర్ ఏర్పాటు చేసినప్పుడు కోల్ టోమస్ అలెన్ (31) ట్రంప్‌పై హత్యాయత్నం చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు.

ఆనాడు డిన్నర్‌కు 2,000 మంది జర్నలిస్టులు హాజరుకాగా, ఈసారి భద్రతా ఆంక్షలు కఠినతరం చేసి కేవలం 700 మంది జర్నలిస్టులను మాత్రమే డిన్నర్‌కు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం జరిగిన హోటల్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వైట్ హౌస్, మీడియా మధ్య వాతావరణం ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితుల్లో ఈ డిన్నర్ జరిగింది.

ట్యాగ్‌లు: international news Trump