Skip to content
తెలంగాణ వార్తలు

సర్‌ ప్రక్రియకు పారదర్శకత అవసరం!

Prajapaksham 18 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
సర్‌ ప్రక్రియకు పారదర్శకత అవసరం!

సర్‌ ప్రక్రియకు పారదర్శకత అవసరం!

ఉజ్జిని రత్నాకర్ రావు

రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుంది. మొత్తం ఓటర్లలో 99.99% పైగా ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశామని ఎన్నికల అధికారులు తెలుపుతున్నారు. కానీ అందజేసింది బిఎల్‌లకు. బిఎల్‌లు ఇల్లిల్లు తిరిగి ఓటర్లకు అందజేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు బిఎల్‌లు అందజేసే కార్యక్రమం నత్తనడకలోనే సాగుతుంది.

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ద్వారా ప్రజలు సాధించుకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. ఐదేండ్లకు ఒకసారి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే శక్తి, అధికారాన్ని ప్రశ్నించే హక్కు, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించిన పాలకులకు శిక్షించే అధికారం, ప్రజల తీర్పును ప్రకటించే సాధనం ఓటు. అలాంటి ఓటు హక్కుకు ఆధారమైన ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ జరగాలి.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సర్ ప్రక్రియ కంటే గందరగోళమే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలను ఒక ప్రశ్న వేధిస్తుంది. ‘నా పేరు ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉంది. మరి నేను మళ్లీ ఏం చేయాలి?’ ఈ ప్రశ్నకు ప్రతి ప్రాంతంలో ఒకే సమాధానం లేదు. తిరిగి సర్ ద్వారా తాను ఓటరునే అని నిరూపించుకోవాలని ఎలక్షన్ కమిషన్ చెబుతుంది. భారత ఎన్నికల కమిషన్ పైనే ప్రతి వ్యక్తికి ఓటు కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. ప్రస్తుతం జరుగుతున్నది ఓటర్లను తికమక పెట్టే విధంగా ఉన్నది!

ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన ఓటర్లు ఓటేయడంలోనూ, ఓటును కాపాడుకోవటంలోనూ వెనుకబడి ఉన్నారని జనరల్‌గా వస్తున్న విమర్శలు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ జిల్లాలలో పోలింగ్ సరళి పరిశీలిస్తే మనకు ఇదే అర్థమవుతుంది. ఈ జిల్లాలో వలస ఓటర్లు, వారికి గ్రామాలలో ఓట్లు ఉండటం, ఓటర్ల శాశ్వత నివాసం లేకపోవడం మొదలుకు కారణాలు ఉన్నాయి.

ఆగస్టు 3 వరకు గడువు పెంచిన కమిషన్!

ఆంధ్రప్రదేశ్‌లో 14 రోజులపాటు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పొడిగించిన నేపథ్యంలో, తెలంగాణలో కూడా కనీసం 10 రోజులు పొడిగించాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి.

అయితే ఎన్నికల కమిషన్ ఆగస్టు 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాల సేకరణకు గడువు పెంచింది. బిఎల్‌లు ఫారాలు అందజేయవలసిన బాధ్యత ఉన్నది. జులై 15 వరకు 1,66,70,610 మంది ఓటర్లు మాత్రమే (49.27%) తమ ఫారాలను అందజేశారు. దీంతో మరో 50% మంది ఓటర్లు పది రోజుల్లో ఇవ్వడం సాధ్యమేనా?

ఇది ఇలా ఉండగా, 35 శాతం మందికి (నగరాలలో, పట్టణాలలో) ఫారాలు అందలేదని చెబుతున్నారు. గ్రామాలలో 80 నుండి 85 శాతం వరకు ఫారాలు అందజేశారు. బిఎల్‌లు అందజేసిన ఫారాలలో వారి వద్దకు చేరినవి సగం మాత్రమే. ఇంకా కొంత టైం ఉన్నందున అందరికీ అందజేయాలి.

అధికారులు 100% పంపిణీ అని చెప్తుంటే నగర, పట్టణ ప్రాంతాల ఓటర్లు మాత్రం మా కాలనీలకు, మా ఇండ్లకు అసలు బిఎల్‌వోలు వచ్చిన దాఖలాలే లేవు. మాకు అందాల్సిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎటుపోయాయి? అంటూ నిలదీస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, శివారు కాలనీల్లో చాలామందికి ఫారాలు అందలేదు. అధికారులు ఇండ్ల వద్దకు వచ్చి వివరాలు సేకరించకుండానే ఆఫీసుల్లో కూర్చుని ఫామ్ పంపిణీ అయిపోయినట్టు టిక్ మార్కులు పెట్టుకుంటున్నారని ఆరోపణలు వింటున్నాం.

నత్తనడకన సర్ డిజిటలైజేషన్ :

కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియ రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలోనూ, డిజిటలైజేషన్‌లోనూ నత్తనడకలో సాగుతున్నది. రాష్ట్రంలో 3.38 కోట్లకు పైగా ఓటర్లలో 50 శాతమే ఆన్‌లైన్ అయినవి. 75.44% యాదాద్రి టాప్‌లో ఉంది. 13.71%తో మల్కాజిగిరి లాస్ట్‌లో ఉన్నదని సీఈఓ కార్యాలయం నివేదిక.

సర్ నిబంధనల ప్రకారం బూత్ లెవెల్ ఆఫీసర్లు (బిఎల్‌వోలు) మూడుసార్లు ఓటర్ల ఇండ్లకు వెళ్లాలని ప్రాథమిక నియమం. నగరాలు, పట్టణాల్లో అది అమలవుతున్న ప్రాంతాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఒక్కసారి కూడా రాని ప్రాంతాలు వందల్లో ఉంటాయి. అయినా అంతా సజావుగా సాగుతుందని ఎన్నికల కమిషన్ గొప్పగా చెబుతోంది.

బిఎల్‌వోలు ఒక కాలనీ కమ్యూనిటీ హాల్లో కూర్చుని అందుబాటులో ఉన్న వారికి ఫారాలు ఇస్తున్నారు. లేదా ఆ కాలనీ బాధ్యులకు ఇచ్చి అందజేయాలని కోరుతున్నారు. పూర్తి చేసిన ఫారాలు కూడా ఓటర్లే మళ్లీ బిఎల్‌వో వద్దకు వెళ్లి సమర్పించుకునే పరిస్థితి చాలా చోట్ల ఉంది.

సర్ ప్రక్రియలో ప్రాథమిక అడుగే సరిగా పడలేదని దీన్ని బట్టి తేలికగానే అర్థం అవుతుంది. అయినా మన యంత్రాంగం సమర్థత బ్రహ్మాండంగా ఉందని మనం సరిపెట్టుకోవాలి.

అదే ప్రమాణికం ఎట్లవుతది?

తెలంగాణలో 2002లో చేపట్టిన సర్ తర్వాత ఏడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన వారందరూ కూడా ఇప్పుడు మళ్లీ తమని తామే నిఖార్సయిన ఓటర్లుగా నిరూపించుకోవాలి.

ఇంటర్నెట్‌ను ఉపయోగించగలిగిన వాళ్లు కూడా 2002 నాటి సర్ జాబితాలో తమ పేర్లు వెతుక్కోవటానికి కింద మీద పడుతున్నారు. గంటలపాటు దాని కోసం ప్రయత్నించి విఫలమై చివరకు 2002 నాటి సర్‌లో తమ పేర్లు లేవని వెలుసుబాటును ఉపయోగించుకొని ఎన్యూమరేషన్ ఫామ్ ఆన్‌లైన్‌లో పూర్తి చేస్తున్నారు.

దీనికి ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు వివరాలను సమర్పించి వాటి ఆధారంగా వచ్చే ఓటీపీలతో వన్ టైం పాస్‌వర్డ్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. 2002 నాటి సర్ జాబితాతో సంబంధం లేకుండానే ఓటర్‌గా కొనసాగే అవకాశం ఉంటే అసలు దాంతో మొత్తం ప్రక్రియను ఎందుకు ముడిపెట్టాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తక మానదు.

రకరకాల కారణాలతో, కొరతలతో దాదాపు కోటి మంది 11 రకాల డాక్యుమెంట్లతో ఏదో ఒక దాన్ని సమర్పించి తమని తాము అసలైన ఓటర్లుగా నిరూపించుకోవాలని నిబంధనలు రూపొందించటం ఎంతవరకు కరెక్టు?

2002 నాటి ఓటర్ల చేర్పు మామూలుగానే జరిగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు సర్ సంబంధిత ప్రత్యేక హడావుడి కనబడలేదు. మామూలు ఓటర్ల జాబితా సవరణలాగే అది జరిగిపోయింది.

దీనికి భిన్నంగా ఇటీవల బిహార్, బెంగాల్, తమిళనాడులో తగిన సమయం ఓటర్లకు ఇవ్వకుండా హడావిడిగా సర్ చేపట్టడంతోనే తీవ్రస్థాయిలో వివాదాలు చెలరేగాయి. లక్షల సంఖ్యలో ఓట్లను తొలగించారు. ఈ విధానాన్ని రాజకీయ పార్టీలు అన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఇప్పుడే బిఎల్‌లు ఇంటింటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే, 2002లో సర్ అంత సక్రమమని భావించి దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం ఏ మాత్రం సహేతుకంగా అనిపించదు. అప్పటికి మొబైల్ ఫోన్లు లేవు, ల్యాండ్‌లైన్ ఫోన్ ఉన్న వాళ్లు తక్కువే, సోషల్ మీడియా లేనేలేదు. 2002 నాటి పరిస్థితుల్లో సర్‌కు చాలా పరిమితులు ఉంటాయి.

పేర్లలో, ఇంటి పేర్లలో, వయస్సు నమోదుల్లో ఎన్నో తప్పులు ఆనాటి జాబితాలో కనబడతాయి. వీటన్నింటినీ సర్దిద్దుకోవాల్సిన బాధ్యతను ఇప్పుడు ఓటర్ల పైనే పెట్టారు.

అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయడం రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ విధి. అలా నమోదు చేసిన వాళ్లను కొన్నేళ్ల తర్వాత ‘మిమ్మల్ని మీరు ఓటర్లుగా నిరూపించుకోండి’ అని చివరికి అదే కమిషన్ ఆదేశించటం ప్రజాప్రతినిధి చట్టాన్ని పలుచన చేయటమేనని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి.

ఫారం ఇస్తేనే ఓటు హక్కు – సీఈఓ వెల్లడి :

పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్‌లకు ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఓటరు పేరు నమోదు అవుతుందని, లేదంటే ఓటును తొలగించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫారాలను వెంటనే పూర్తి చేసి బిఎల్‌లకు అందజేయాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 88 లక్షల ఓట్లు గల్లంతు!

ఓటరు జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియ జరుగుతుండగానే తాజాగా రాష్ట్ర ఎన్నికల అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 88 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆ ఓట్లలో సగం రాజధానివే అని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

బిఎల్‌లు సరిగా ఫారాలు పంపిణీ చేయకపోవడం, అందుకున్న ఓటర్లు నింపకపోవడం వంటి కారణాలతో ఓట్లు గల్లంతు అవుతాయని ఎన్నికల అధికారులు చెప్తున్నారు.

జిహెచ్ఎంసి పరిధిలో భారీగా ఓట్లు రద్దు

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అధికంగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్క జిల్లా నుంచి 8 లక్షల నుంచి 12 లక్షల మేర ఓట్లు రద్దు అవుతాయని తెలుస్తుంది.

ఈ జిల్లాలో ఓటరు గుర్తింపు కార్డులు ఒకటికి మించి ఉన్నాయని తేలింది. ఈ సంఖ్య పెద్ద ఎత్తున ఉండటంతో ఓటరు జాబితాలో తేడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

రెండు చోట్ల ఓటు ఉంటే?

గతంలో ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలు లేదా ఇతర రాష్ట్రాల్లో ఓటరుగా నమోదైన వారు ఒకేచోట తమ ఓటును నమోదు చేసుకోవాలి. జిల్లాలు, రాష్ట్రాల వ్యాప్తంగా నకిలీ ఓటరు నమోదులను గుర్తించడానికి ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ (డిఎస్‌ఈ) సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగిస్తుంది.

నకిలీ నమోదులను గుర్తించిన తర్వాత అధికారులు విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి తమ ఓటును నిలుపుకోవాలనుకుంటున్న నియోజకవర్గాన్ని ఎంచుకోమని ఓటర్లను అడుగుతారు. ఆ తరువాత ఇతర ప్రాంతాల నుంచి ఓటును తొలగిస్తారు.

కొత్త ఓటర్‌కు ఫారం 6…

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదు కాని వారికి ఫామ్ అందదు. దానికి బదులుగా వారు కొత్తగా ఓటరు నమోదు కోసం ఉద్దేశించిన ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా మారితే ఓటరు బదిలి చేయడానికి ఉద్దేశించిన 8 ఫారం ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్లుగా నమోదై ఉన్నవారు శ్రమ కోర్చయినా ఫారాలు పొంది వాటిని బిఎల్‌వోలకు అందచేసి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఓట్లు గల్లంతు.. ఉనికి ప్రశ్నార్థకం.

ట్యాగ్‌లు: Elections SIR