Skip to content
తెలంగాణ వార్తలు

Bonalu 2026: తెలంగాణ ఆషాడ బోనాల సంబరాలు షురూ…గోల్కొండ జగదాంబకు తొలి బోనం సమర్పణ..

Prajapaksham 17 Jul 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
Bonalu 2026: తెలంగాణ ఆషాడ బోనాల సంబరాలు షురూ…గోల్కొండ జగదాంబకు తొలి బోనం సమర్పణ..

కాకతీయుల కాలంలో పురుడుపోసుకుని, కుతుబ్‌షాహీల ముందుచూపు, అసఫ్‌జాహీల ఆలోచనలకు ప్రతిరూపంగా ఏర్పడిన గోల్కొండ కోట పరిసర ప్రాంతం క్రమంగా ఖ్యాతిగాంచిన ప్రాంతంగా రూపాంతరం చెందింది. ఈ ప్రాంత ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే ఆషాఢమాసం బోనాల సంబురాలు భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి.

12 నుంచి 14వ శతాబ్దం వరకు పాలించిన కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమైన బోనాల సంబురాలను నెలరోజుల పాటు ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. కాకతీయుల కాలం కంటే ముందు నుంచే చల్లంగ చూడాలంటూ గ్రామదేవతలను కొలుస్తూ, కాలక్రమంలో కలరా మహమ్మారి కారణంగా జనసాంద్రత అధికంగా ఉండే హైదరాబాద్‌ ప్రాంతంలో తొలకరి పలకరింపుతో నెలకొనే విపత్కర పరిస్థితుల నుంచి రక్షించాలని కోరుతూ అమ్మవార్లను కొలిచి ప్రజలు మొక్కులు తీర్చుకుంటారు.

ఈ క్రమంలోనే గోల్కొండ కోటలో జరిగిన తొలి బోనం సమర్పణ సందర్భంగా కోత్వాల్‌ వీసీ సజ్జనార్‌ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోల్కొండ కోట దిగువ భాగం నుంచి పైవరకు ఉన్న బందోబస్తును ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం జగదాంబికా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ, తొలి బోనం రోజున తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఉత్సవాల భద్రత కోసం సుమారు 2,000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. లంగర్‌హౌస్‌ చౌరస్తా నుంచి కోటలోని ఆలయం వరకు ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆకతాయిల ఆటకట్టించేందుకు అత్యాధునిక డ్రోన్‌ కెమెరాలు, విస్తృతమైన సీసీటీవీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. జేబుదొంగతనాలు, గొలుసు చోరీలను అరికట్టేందుకు క్రైమ్‌ విభాగం ప్రత్యేక నిఘా పెంచిందని, మహిళల భద్రత కోసం షీటీమ్స్‌ నిరంతరం గస్తీ కాస్తాయని స్పష్టం చేశారు. భక్తుల వాహనాల పార్కింగ్‌ కోసం ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని వివరించారు.

శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ విభాగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని, బోనాల ఉత్సవాలను ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోత్వాల్‌తో పాటు జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) డి. జోయల్‌ డేవిస్‌, డీసీపీ (సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌) ఆర్‌. వెంకటేశ్వర్లు, గోల్కొండ జోన్‌ డీసీపీ జె. రాఘవేంద్రరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బంగారు బోనమెత్తిన జోగిని అవిక

బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సప్తమాతృకలకు సప్త బోనాలలో భాగంగా భాగ్యనగర్‌ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఎం. మధుసూదన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబ అమ్మవారికి గురువారం తొలి బంగారు బోనం సమర్పించారు.

అమ్మవారికి పట్టువస్త్రాలు, ఒడిబియ్యం, బ్యాండు చప్పుళ్లు, పోతరాజుల వీరంగాలు, శివసత్తులతో కలిసి జోగిని అవిక బంగారు బోనమెత్తుకుని హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం నుంచి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా బయలుదేరారు.

అంతకుముందు మీరాలంమండి బంగారు మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరిబౌలి నుంచి గోల్కొండ జగదాంబ దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంలోనే పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు.

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన భాగ్యనగర్‌ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులను ఆలయ కమిటీ ఘనంగా శాలువాలు కప్పి సన్మానించింది. కార్యక్రమంలో మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఎం. మధుసూదన్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి కె. విష్ణుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కుమ్మరుల తొలిబోనం..

జగదాంబిక అమ్మవారికి కుమ్మరుల తొలి బోనం సమర్పణ జరిగింది. తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 521 బోనాల సమర్పణ డప్పు మేళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా భక్తులు బోనాలను సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు మేళాలు, సాంప్రదాయ నృత్యాలు, భక్తి గీతాల నడుమ వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో కిటకిటలాడగా, బోనాల ఊరేగింపు భక్తి పారవశ్యాన్ని తలపించింది.

ట్యాగ్‌లు: Bonalu Festival Hyderabad