టార్గెట్ పోలవరం: చంద్ర బాబు శపథం నెరవేరేనా?.. బెంబేలెత్తిస్తున్న గ్రౌండ్ రియాలిటీ ఇదే!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా రాజమండ్రిలో మాట్లాడుతూ, పోలవరం డ్యామ్‌ను ఆరు నూరైనా పూర్తి చేస్తామని శపథం చేశారు. ఈ ప్రాజెక్టు తొలి దశను వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని, గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు.
అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుపై సీఎం చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడం అనేది అతిపెద్ద సవాలుగా చెప్పవచ్చు.
టెక్నికల్ గ్రౌండ్ లెవల్ ఇష్యూల పరంగా చూసినట్లయితే, పోలవరం డ్యామ్‌లో డయాఫ్రం వాల్ అనేది గుండెకాయ లాంటిది. ఇది భారీ వరదలకు పూర్తిగా దెబ్బతిన్నది. దీన్ని రిపేర్ చేయాలా, లేదా కొత్తది నిర్మించాలా అనేది ఇంకా తేలలేదు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు ఒక దశాబ్దం వెనక్కి వెళ్లిందని జలవనరుల నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ విషయంలో అడ్డంకులు ఉన్నాయి. ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కడితేనే అసలు పని పూర్తవుతుంది. కానీ దీని నిర్మాణం కోసం ముందు డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉంటుంది.
అలాగే ప్రాజెక్టు నిర్మాణం కన్నా కూడా పునరావాస ప్రక్రియ చాలా భారంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే లక్షలాది మంది గిరిజనులు, ఇతర వర్గాలకు సంబంధించిన పునరావాస సమస్యను ప్రభుత్వం ఇంకా పూర్తిగా పరిష్కరించలేదు. పరిహారం ప్రక్రియ కూడా ఇంకా నత్తనడకన కొనసాగుతోంది.
ఇక డిజైన్ల ఆమోదంలో జాప్యం కూడా పోలవరానికి పెద్ద అడ్డంకిగా చెప్పవచ్చు. ఎందుకంటే స్పిల్‌వే, కాఫర్ డ్యామ్ నిర్మాణాల్లో పదేపదే సాంకేతిక మార్పులు జరగడంతో పాటు, కేంద్ర జల సంఘం అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చుట్టూ డిజైన్ల ఆమోదం కోసం అధికారులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. దీంతో జాప్యం మరింత పెరుగుతోందని చెప్పవచ్చు.
నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తామని ప్రకటనలు చేసింది. కానీ రెండేళ్లలో క్షేత్రస్థాయిలో ఉన్న సాంకేతిక, వాతావరణ సవాళ్ల కారణంగా ఎక్కడి పనులు అక్కడే అన్నట్టుగా ఆగిపోయాయి.
ముఖ్యంగా డయాఫ్రం వాల్ పునర్నిర్మాణం వంటి సంక్లిష్టమైన పనులకు కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి తాజాగా ప్రకటించిన గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణం పూర్తి కావడం దాదాపు అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్ట్ సంస్థలు, కేంద్ర అధికారుల మధ్య క్షేత్రస్థాయిలో పనులు వేగవంతంగా చేసే వ్యవస్థ ప్రస్తుతం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. పనుల కన్నా కూడా సమీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని పోలవరంపై అధ్యయనం చేస్తున్న పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం కూడా 2022 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రకటించింది. కానీ ఆ గడువు ముగిసి నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా కొనసాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా, పబ్లిసిటీ స్టంట్ కోసం గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటనలు చేయడం తప్ప, ఆచరణలో మాత్రం పోలవరం నిర్మాణ పనులు శూన్యంగానే కనిపిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక అత్యంత ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు. ఎందుకంటే ఇది జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు. దీనికి పూర్తిస్థాయిలో నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర క్యాబినెట్ ఇటీవల తొలి దశ పూర్తి కావడానికి రూ.12 వేల కోట్లు మంజూరు చేసింది.
కేంద్రంలో కూటమి ప్రభుత్వానికి టీడీపీ మద్దతు కొనసాగుతున్న నేపథ్యంలోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ పొత్తు బీజేపీకి అంత అవసరం లేని పరిస్థితి ఉంది. మరి భవిష్యత్తులో కూడా పోలవరంపై ఇలాగే నిధుల వర్షం కురిపిస్తుందా, లేదా శీతకన్ను వేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
ఇక అన్నిటికన్నా ప్రధానమైన అడ్డంకి ఏమిటంటే, జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కూడా “ముందు మీరు ఖర్చు చేయండి, తర్వాత బిల్లులు పరిశీలించి మేము చెల్లిస్తాం” అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోంది. ఇది అతిపెద్ద శాపంగా చెప్పవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో వేల కోట్లు వెచ్చించి, ఆ తర్వాత బిల్లులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వం చుట్టూ రీయింబర్స్మెంట్ కోసం తిరగడం సాధ్యం కాని పని అని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల తొలి దశ వరకే బాధ్యత తీసుకుంటామని సూచనప్రాయంగా చెబుతోంది. నిర్వాసితుల పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. ఇవన్నీ పోలవరం ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి.