SIR ప్రక్రియలో జాప్యం..ఎన్యూమరేషన్ పత్రాలతో ప్రజలు అయోమయం
SIR
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సర్వే ప్రక్రియలో భాగంగా మేడ్చల్ జిల్లాలో పంపిణీ చేస్తున్న ఎన్యుమరేషన్ పత్రాలను పూరించి తిరిగి ఇవ్వటంలో ఓటర్లలో గందరగోళం నెలకొంటోంది. ఈ ఫారాల్లో ప్రస్తుత వివరాలతో పాటు 2002 ఓటరు జాబితాకు ముడిపడి ఉండటమే కాకుండా, ఆ ఫారాలతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ ఫొటోలు జతపరచాలన్న నిబంధన మరింత అయోమయానికి గురి చేస్తోంది.
పత్రాలను పూరించటంలో ఎలాంటి తప్పులు దొర్లకూడదంటూ బీఎల్ఓలు హెచ్చరికగా చెబుతుండటంతో, ఏ మాత్రం పొరపాటు జరిగినా తమ ఓటు హక్కు ఎక్కడ పోతుందేమోనన్న భయంతో వాటిని పూరించటానికే వెనుకాముందు అవుతున్నారు. దీనికి తోడు ఎన్యుమరేషన్ ఫారాల్లో అంశాలన్నీ చిన్న అక్షరాలతో, కనపడీ కనపడని విధంగా కేవలం తెలుగు భాషలో మాత్రమే ముద్రించబడి ఉండటం మరో సమస్యగా మారింది.
ఎన్యుమరేషన్ పత్రాలను పూరించటంలో పూర్తి అవగాహన కల్పించటంలో అధికారులు సరైన విధంగా చర్యలు తీసుకోకపోవటమే దీనికి కారణమవుతోంది. దీంతో తమకిచ్చిన ఎన్యుమరేషన్ ఫారాలను పూరించి ఇవ్వటంలో ఓటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
2002 ఓటరు జాబితాతో ముడిపెట్టటంతో సందేహాలు
బీఎల్ఓలు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాల్లో 2002లో ఓటరు జాబితాలో పేరు ఉంటే ఒకలా, లేకుంటే మరోలా పూరించాలని, పత్రాలను పూరించటంలో వారి సంబంధీకుల వివరాలతో నింపాలని చెప్పటం ఓటర్లలో పలు అనుమానాలకు దారి తీస్తోంది.
2002 ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో, ఉంటే ఎలా తెలుసుకోవాలో తెలియక కొంత మంది, నియోజకవర్గ పోలింగ్ బూత్ నంబర్ తెలియక మరికొంత మంది అయోమయానికి గురవుతున్నారు. ఓ ఇంటి నుంచి మరో ఇంటికి మారిన వారిలో చాలా మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు అందలేదు.
కుటుంబంలో ఉన్న వారందరి వివరాలతో పాటు వారి పాస్‌పోర్ట్ ఫొటోలు సైతం జతపరచాలన్న నిబంధన, వారి కుటుంబంలోని పిల్లలు మరో రాష్ట్రంలోనో, మరో దేశంలోనో ఉద్యోగ రీత్యా వెళ్లిన సందర్భాల్లో ఫొటోలను జతపరచే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మరోపక్క పుట్టిన తేదీ ధృవపత్రాలు తప్పనిసరిగా జతపరచాలన్న నిబంధన సీనియర్ సిటిజన్ల విషయంలో సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఓటు ఉంటుందో, పోతుందో అన్న ఆందోళన ఓటర్లలో నెలకొంది.
వివాహమై అత్తగారింటికి వచ్చిన యువతి తమ పుట్టింట్లో ఉన్న ఓటును ఇక్కడ నమోదు చేయాలా, లేక అక్కడే కొనసాగించాలా అన్న సందేహాలు సైతం నెలకొన్నాయి. విద్యావంతులే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే, చదువుకోని వారి పరిస్థితి మరింత సమస్యాత్మకంగా ఉందనే చెప్పవచ్చు.